పొగాకు రైతులకు నష్టాల సెగ | Tobacco Farmers Fires on Chandrababu Govt | Sakshi
Sakshi News home page

పొగాకు రైతులకు నష్టాల సెగ

May 30 2026 6:04 AM | Updated on May 30 2026 6:05 AM

Tobacco Farmers Fires on Chandrababu Govt

– ఎంవీఎస్‌ నాగిరెడ్డి, మాజీ వైస్‌ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్‌ ప్రకాశం జిల్లా కందుకూరులో రోడ్డుపై పొగాకు బేళ్లను తగలబెట్టి నిరసన తెలుపుతున్న రైతులు (ఫైల్‌)

ప్రభుత్వ నిర్వాకంతో తీవ్రంగా నష్టపోతున్న రైతులు

అలంకారప్రాయంగా కొనుగోలు కేంద్రాలు

తిరస్కరణకు గురవుతున్న50 శాతం వర్జీనియా బేళ్లు

2023–24లో కిలోకు సగటున రూ.288.65

ఈ ఏడాది దక్కుతున్నది రూ.237.21 మాత్రమే

రెండు రబీ సీజన్లలో రైతులకు రూ.3,100 కోట్ల నష్టం

బేళ్లను తగులబెట్టి నిరసనలు

పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకంతో పొగాకు రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. గతేడాది కొనేవారు లేక నల్లబర్లీ పొగాకు రైతులు నష్టపోగా.. ఈసారి కొనుగోలు కేంద్రాల్లో పొగాకు బోర్డు అధికారుల తీరు కారణంగా వర్జీనియా రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. బోర్డు అనుమతి ఇచ్చిన పరిధిలోనే సాగుచేసి మంచి దిగుబడి సాధించి.. నాణ్యమైన పొగాకు ఉత్పత్తి చేసినా గిట్టుబాటు ధర దక్కడం లేదు. ప్రభుత్వ చేతకానితనం వల్ల రెండేళ్లుగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

2024–25 సీజన్‌లో నల్లబర్లీ పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. బాండ్లు ఇచ్చిన కంపెనీలు కొనుగోలు సమయంలో చేతులెత్తేయడంతో రైతుల వద్ద 53 వేల టన్నులు పేరుకుపోయాయి. అతికష్టంమ్మీద 20 వేల టన్నులు సేకరించగా.. నేటికీ రైతుల వద్ద 33 వేల టన్నులు పాత పొగాకు నిల్వలు ఉండిపోయాయి. ఇళ్లవద్దే ఉండిపోయిన బేళ్లు అమ్ముడుపోక, నిల్వ ఖర్చులు, వడ్డీలు, కూలీ ఖర్చులు తడిసి మోపెడవటంతో నల్లబర్లీ రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఈ ఏడాది అదే పరిస్థితి వర్జీనియా పొగాకు (వైట్‌ బర్లీ) రైతులు ఎదుర్కొంటున్నారు.

తిరస్కరణకు గురవుతున్న బేళ్లే ఎక్కువ
2025–26 సీజన్‌లో 2.93 లక్షల ఎకరాల్లో పొగాకు సాగవగా.. రెండో ముందస్తు అంచనా ప్రకారం హెక్టార్‌కు 2,276 కిలోల దిగుబడి చొప్పున ఈ ఏడాది కనీసం 2.61 లక్షల టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. దక్షిణాది నల్ల నేలల్లో పొగాకుకు సగటున కిలోకి రూ.212.07,  ఉత్తరాది తేలిక నేలల్లో పొగాకుకు సగటున కిలోకు రూ.237.21 చొప్పున మాత్రమే ధర లభిస్తోంది. ఒంగోలు, టంగుటూరు, కొండెపి, వెల్లంపల్లి వేలం కేంద్రాల్లో  45–47 శాతం, పొదిలి, కనిగిరి, కందుకూరు, కలిగిరి, డీసీ పల్లి కేంద్రాల్లో 36–40 శాతం, దేవరపల్లి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం కేంద్రాల్లో 35–43 శాతం మేర బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. తిరస్కరించిన పొగాకును వెనక్కి తీసుకెళ్లడానికి బేలుకు రూ.2 వేల వరకు అదనంగా ఖర్చవుతోందని రైతులు
వాపోతున్నారు.

45 రోజులైనా 5 శాతమే వేలం
పొగాకు వేలం కేంద్రాలు ప్రారంభించి 45 రోజులైంది. ఇప్పటివరకు కేవలం 9,500 టన్నుల పొగాకు మాత్రమే వేలం జరిగింది. అంటే ఉత్పత్తిలో 5 శాతానికి మించి రైతులు ఇప్పటివరకు అమ్ముకోలేకపోయారు. గతేడాది ఇదే సమయానికి 33,860 టన్నులు వేలంలో అమ్ముడయ్యింది. 2023–24లో సగటున కిలోకు రూ.288.65 చొప్పున దక్కితే.. ఈ ఏడాది కిలోకు రూ.237.21కి మించి దక్కడం లేదు. అదీ కూడా మార్కెట్‌కు తీసుకొచ్చిన బేళ్లలో 5 శాతం బేళ్లకే ఈ ధర లభిస్తోంది. ఏటా సగటు ధర పెరగాల్సింది పోయి.. 2023–24తో పోలిస్తే ఈ ఏడాది రైతు కిలోకు దాదాపు రూ.51 తక్కువ ధరకు  అమ్ముకోవాల్సి దుస్థితి దాపురించింది. ఫలితంగా రెండేళ్లలో రూ.3,100 కోట్లకు పైగా రైతులకు నష్టపోతున్నారని అంచనా.

నిత్యం నిరసనల్ని పట్టించుకోని ప్రభుత్వం
ఏ పొగాకు వేలం కేంద్రానికి వెళ్లినా రైతుల నిరసనలతో హోరెత్తిపోతున్నాయి. నిత్యం ధర్నాలు, రాస్తారోకోలు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కడుపు మండిన రైతులు పొగాకును తగలబెట్టే స్థాయికి వచ్చారు. అయినా ప్రభుత్వం తనకేమీ పట్టనట్టుగా మిన్నకుండిపోతోంది.

ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి
పొగాకు సాగు చేసే వారిలో అత్యధికులు కౌలు, సన్నకారు రైతులే. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు కూడా కట్టలేక తీవ్ర ఆరి్థక సంక్షోభంలో కూరుకుపోతున్నారు. రెండేళ్లుగా ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కక రైతులు సంక్షోభంలోకి వెళ్లిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకుని తక్షణమే పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంపై దృష్టి సారించాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement