రేణిగుంట: తిరుపతి జిల్లా రేణిగుంటకు చెందిన ఓ తల్లీ, కుమారుడు పది ఫలితాల్లో సత్తా చాటారు. వివరాలు.. బుగ్గవీధికి చెందిన శిరీష పదో తరగతి చదువును మధ్యలోనే ఆపేశారు. ఆ తర్వాత బ్యూటీషియన్ కోర్స్ పూర్తి చేసి.. సొంతంగా బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు. 20 ఏళ్ల తర్వాత తిరిగి చదువుకోవాలనే పట్టుదలతో ముందుకు అడుగు వేశారు. చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు. తన చిన్న కుమారుడు హర్షతో పాటు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించారు. 365 మార్కులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. దీనిపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

ఒకేసారి ఉత్తీర్ణులైన తల్లీకుమార్తెలు
ఆలమూరు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం పెదపళ్లకి చెందిన తల్లీకుమార్తెలు ఇంటరీ్మడియెట్, పదో తరగతి పరీక్షల్లో ఒకేసారి ఉత్తీర్ణులయ్యారు. ఆలమూరులోని బొబ్బా జయశ్రీ ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్న కుమార్తె సలాది సాతి్వక పదో తరగతిలో 543 మార్కులు సాధించింది. ఆమె తల్లి కుమారి గురువారం విడుదలైన ఓపెన్ స్కూల్ (సార్వత్రిక విద్యాపీఠం) ఇంటర్ పరీక్షల్లో 352 మార్కులతో ఉత్తీర్ణత పొందింది. పదో తరగతి పూర్తి కాగానే కుమారికి వివాహం కావడంతో చదువుకు ఫుల్‌స్టాప్ పడింది. చదువుపై ఆమెకున్న మక్కువను గుర్తించిన భర్త ప్రసాద్ ప్రోత్సహించారు. దీంతో, ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాసి ఆమె విజయం సాధించింది.

ఉత్తీర్ణత సాధించిన తండ్రి, కుమార్తె
రెంటచింతల: టెన్త్ ఫలితాల్లో తండ్రి, కుమార్తె ఉత్తీర్ణత సాధించిన సంఘటన పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మల్లవరంలో జరిగింది. పరాశక్తి సిమెంట్ కంపెనీలో రోజువారి కూలీ అయిన జిల్లా బాబూరావు ఈ ఏడాది ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్ పరీక్షలు రాసి 257 మార్కులు సాధించాడు. ఆయన కుమార్తె చిట్టి స్థానిక సెయింట్ జోసఫ్స్ ఉన్నత పాఠశాలలో చదువుకుని 448 మార్కులు తెచ్చుకుంది. తన కుమార్తె, తానూ ఒకేసారి టెన్త్ పాస్ కావడం సంతోషంగా ఉందని బాబూరావు తెలిపారు.


