సంకల్పానికి సలాం

Three Years Completed For CM YS Jagan Praja Sankalpa Yatra - Sakshi

వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తి

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఘనంగా కార్యక్రమాలు 

ప్రజారంజకంగా 17 నెలలుగా సంక్షేమ పాలన 

కోవిడ్‌ కష్టాల్లోనూ అన్ని పథకాల కొనసాగింపు

ఊరూరా ప్రజలకు వివరిస్తూ ర్యాలీలు, పాదయాత్రలు

సాక్షి నెట్‌వర్క్‌: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాయి. ‘ప్రజల్లో నాడు–ప్రజల కోసం నేడు’ అంటూ కోవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ.. పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలకు కరపత్రాలు అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఇంటింటా ఆరా తీశారు. జై జగన్‌.. అంటూ నినాదాలు చేస్తూ పార్టీ శ్రేణులు కదంతొక్కాయి. ‘చెప్పాడంటే చేస్తాడంతే’ అంటూ కార్యకర్తలు, అభిమానులు వైఎస్‌ జగన్‌ చేపట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు.

2017 నవంబర్‌ 6వ తేదీన వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర 2019 జనవరి 9వ తేదీన ఇచ్ఛాపురంలో ముగిసిన విషయం తెలిసిందే. ఎండనక, వాననక 14 నెలల పాటు 13 జిల్లాల్లో సుదీర్ఘంగా సాగిన ఈ యాత్రలో వైఎస్‌ జగన్‌ నాడు ప్రజల కష్టనష్టాలను కళ్లారా చూశారు. ప్రజలందరి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నవరత్నాలతో మేనిఫెస్టోను రూపొందించారు. ప్రజలు అఖండ మెజారిటీతో అధికారం కట్టబెట్టడంతో అధికార పగ్గాలు చేపట్టి.. నేడు ఆ ప్రజలందరి ఆకాంక్షల మేరకు పాలన కొనసాగిస్తున్నారు. గత 17 నెలలుగా కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పాలనను అందిస్తున్నారు. మా మేనిఫెస్టో మాకు ఓ భగవద్గీత, ఓ బైబిల్, ఓ ఖురాన్‌ అని చెప్పిన మాటలను అక్షరాలా అమలు చేస్తున్నారు. ఎన్నెన్నో విప్లవాత్మక చట్టాలు, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ విషయాలన్నింటినీ వివరిస్తూ ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ప్రజా చైతన్య కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రారంభించారు.  

 – కృష్ణా జిల్లాల్లోని విజయవాడ తూర్పు, సెంట్రల్, తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ, నూజివీడు, మైలవరం నియోజకవర్గాల్లోని పార్టీ కార్యాలయాల వద్ద సంబరాలు నిర్వహించారు. పాదయాత్ర ద్వారా పలు సమస్యలు పరిష్కరించారు.  
– గుంటూరు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజా చైతన్య యాత్రలకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, మాచర్లలో ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, రేపల్లెలో ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు పాల్గొన్నారు.  
– విశాఖ జిల్లాలో పార్టీ నేతలు తొలుత మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, అనంతరం బైక్‌ ర్యాలీలు, పాదయాత్రలు చేపట్టారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌రావు, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, భీశెట్టి సత్యవతి, గొడ్డేటి మాధవి పాల్గొన్నారు.
– విజయనగరం జిల్లాలో ఉత్సవాలు మిన్నంటాయి. భాజాభజంత్రీలతో సాగిన ఈ ఉత్సవానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 
– తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ నేతలు, కార్యకర్తలు.. పాదయాత్రలు, సేవా కార్యక్రమాలతో పాటు ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో పూజలు, ప్రార్థనలు చేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఎంపీలు వంగా గీత, మార్గాని భరత్‌రామ్, తదితరులు పాల్గొన్నారు. 
– అనంతపురం జిల్లాలో ప్రజాప్రతినిధులు రచ్చబండ కార్యక్రమాలు, పాదయాత్రలు నిర్వహించి ప్రజలతో మమేకమయ్యారు. సంక్షేమ పథకాల అమలులో లోటుపాట్ల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. 
– శ్రీకాకుళం జిల్లాలో తొలి రోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 
– వైఎస్సార్‌ జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాలు, మండలాల్లో ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించారు. కడపలో డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, రైల్వేకోడూరులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, విప్‌ కొరముట్ల శ్రీనివాసులు, రాయచోటిలో చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
– చిత్తూరు జిల్లా పుంగనూరులో నిర్వహించిన పాదయాత్రలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశంసలు అందుకుంటున్నారని కొనియాడారు. కుప్పం, చిత్తూరులో ఎంపీ రెడ్డెప్ప పాల్గొన్నారు. 
– కర్నూలు జిల్లాలో ప్రజా చైతన్య యాత్రలకు విశేష స్పందన లభించింది. అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
–  ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ ర్యాలీలు నిర్వహించారు. ప్రజలకు కరపత్రాలు అందజేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. యర్రగొండపాలెంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పాల్గొన్నారు.   
– శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.  
– పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో శుక్రవారం పాదయాత్రలు జరిగాయి. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పాదయాత్ర చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top