‘అమ్మ’కు అండగా.. | Sakshi
Sakshi News home page

‘అమ్మ’కు అండగా..

Published Mon, Sep 25 2023 5:05 AM

Thalli Bidda Express is a dedicated vehicle service to transport pregnant/expectant mothers who deliver at Government hospitals - Sakshi

సాక్షి, అమరావతి: మాతృత్వం మరో జన్మ. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి పండంటి బిడ్డకు జన్మనిచ్చేవరకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండాలి. రాష్ట్రంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న సీఎం జగన్‌ ప్రభుత్వం వారికి సకాలంలో వైద్యపరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన మందులు, పౌష్టికాహారం అందిస్తోంది. మరోవైపు ప్రసూతి మరణాలు మరింతగా తగ్గించడంపైనా వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా హైరిస్క్‌ గర్భిణులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పింస్తోంది.

రాష్ట్రంలో ఏటా 9 లక్షల ప్రసవాలు నమోదవుతుంటాయి. వీరిలో 28 శాతం మంది రక్తహీనత, ఇతరత్రా అనారోగ్య కారణాలతో బాధపడే హైరిస్క్‌ గర్భిణులు ఉంటారని అధికారులు చెబుతున్నారు. వీరి ఆరోగ్యంపై నిరంతరం వాకబు చేస్తూ, తల్లీబిడ్డ ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రసవం జరిగేలా వైద్యశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. హైరిస్క్‌ గర్భిణులను డెలివరీ తేదీకి ముందే ఆస్పత్రులకు తరలించి వైద్యుల సంరక్షణలో ఉంచుతున్నారు. దీంతోపాటు తీవ్ర రక్తహీనతతో బా«ధపడే గర్భిణులకు ఐరన్‌ సుక్రోజ్‌ ఇంజెక్షన్, రక్తమార్పిడి కోసం ఆస్పత్రులకు వెళ్లడానికి తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా ఉచిత రవాణా సేవలు అందుబాటులోకి తెచ్చారు.  

గుమ్మం వద్దకే వాహనం 
ఈ ఏడాది ఆగస్టు నుంచి హైరిస్క్‌ గర్భిణులను ప్రసవం, ఐరన్‌ సుక్రోజ్, రక్తమార్పిడి కోసం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల్లో తరలించడం ప్రారంభించారు. పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్, ఏఎన్‌ఎం, కమ్యూనిటి హెల్త్‌ ఆఫీసర్, ఆశా వర్కర్‌లు తమ పరిధిలో హైరిస్క్‌ గర్భిణులను ఆస్పత్రికి తరలించాల్సి ఉన్నట్లయితే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ జిల్లా కో–ఆర్డినేటర్‌కు సమాచారం చేరవేస్తారు.

సమాచారం అందుకున్న 24 గంటల నుంచి 48 గంటల్లో వాహనం గర్భిణుల స్వగ్రామంలో వారి గుమ్మం వద్ద పికప్‌ చేసుకుని ఆస్పత్రికి తీసుకువెళ్తుంది. తీవ్ర రక్తహీనతతో బాధపడే గర్భిణులకు ఐరన్‌ సుక్రోజ్, రక్తమార్పిడి అనంతరం తిరిగి క్షేమంగా ఇంటి వద్దకు చేరుస్తున్నారు. ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన వారికి ప్రసవానంతరం తల్లీబిడ్డ ఇద్దరినీ క్షేమంగా ఇంటికి తరలిస్తున్నారు. ఇలా ఆగస్టు ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ 3,500 మంది గర్భిణులు సేవలు వినియోగించుకున్నారు. వీరిలో 2,300 మందికిపైగా రక్తహీనత సమస్య ఉండి ఐరన్‌ సుక్రోజ్, రక్తమార్పిడి కోసం ఆస్పత్రులకు వెళ్లిన వారు ఉన్నారు.  

గర్భిణులు ఇబ్బంది పడకుండా.. 
రక్తహీనతతో బాధపడే గర్భిణులు ఐరన్‌ సుక్రోజ్‌ ఇంజెక్షన్, రక్తమార్పిడి కోసం సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారు ఆస్పత్రులకు వెళ్లి రావాలంటే ఆటోలు, బస్సుల్లో ప్రయాణిస్తూ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇక మారు మూల గ్రామాల్లో అయితే ప్రయాణ ఇబ్బందులకు భయపడి గర్భిణులు ఆస్పత్రులకు వెళ్లడం మానేస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గర్భిణులను ఉచితంగా ఆస్పత్రులకు తరలించేందుకు ప్రభుత్వం ఈ సేవలను ప్రవేశపెట్టింది. హైరిస్క్‌ గర్భిణులు ఈ సేవలు వినియోగించుకోవాలి.     – డాక్టర్‌ అనిల్‌కుమార్, అదనపు సంచాలకులు, వైద్య శాఖ  

3.27 లక్షల మంది బాలింతలు క్షేమంగా ఇంటికి.. 
ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి బాలింతలను క్షేమంగా ఇంటికి చేర్చడం కోసం ఏర్పాటుచేసిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలను ప్రభుత్వం మరింత బలోపేతం చేసింది. గతేడాది ఏప్రిల్‌ నుంచి 500 కొత్త ఎయిర్‌ కండిషన్డ్‌ వాహనాలను ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 3,27,289 మంది బాలింతలను క్షేమంగా ఇంటికి చేర్చింది. ఈ సేవల కోసం ప్రభుత్వం రూ.71 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా ప్రతి లక్ష ప్రసవాలకు ప్రసూతి మరణాల రేటు(ఎంఎంఆర్‌) 45కు తగ్గింది. ఇదే జాతీయ స్థాయిలో పరిశీలించినట్లయితే ఎంఎంఆర్‌ 76గా ఉంది.

Advertisement
Advertisement