అంతకు మించి అరాచకం! | TDP Yellow Gang Plans Attacks On Votes Counting Day On June 4th, More Details Inside | Sakshi
Sakshi News home page

అంతకు మించి అరాచకం!

Published Wed, May 22 2024 4:07 AM

TDP Yellow Gang Plans Attacks On Votes counting day

ఓట్ల లెక్కింపు రోజు విధ్వంసానికి పచ్చ ముఠాల ప్లాన్‌

పోలింగ్‌ రోజు హింసకు మించి భయోత్పాతం సృష్టించే పన్నాగం

కుట్రలపై పోలీసు శాఖను అప్రమత్తం చేసిన నిఘావర్గాలు

రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు

ఆ 3 జిల్లాలపై ప్రత్యేకంగా కన్ను

గూండాలను అరెస్ట్‌ చేస్తున్న పోలీసులు.. అంతా టీడీపీ మూకలే

స్ట్రాంగ్‌ రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత

రెడ్‌జోన్ల ఏర్పాటు.. నిషేధాజ్ఞలు విధింపు.. డ్రోన్‌ కెమెరాల వినియోగం నిషిద్ధం

సాక్షి, అమరావతి: ఎన్నికల హింసకు తెగబడ్డ పచ్చ ముఠాలు ఈ కుట్రలకు పదును పెడుతుండటం పోలీసు శాఖకు సవాల్‌గా మారింది. పోలింగ్‌ సంద­ర్భంగా యథేచ్ఛగా దాడులు, దౌర్జన్యాలకు పాల్ప­డిన టీడీపీ రౌడీ మూకలు ఓట్ల లెక్కింపు రోజు మరింత బరి తెగించేందుకు పథకం రూపొందించి­నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇప్పటివరకు పోలీ­సులు అరెస్ట్‌ చేసిన వారితోపాటు అదుపులోకి తీసు­కున్న వారిలో 75% మంది టీడీపీకి చెందిన­వారే కావడం ఆ పార్టీ అధినేత చంద్రబాబు కుట్రలకు అద్దంపడుతోంది. 

ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద అలజడులు రేకెత్తించడం, జూన్‌ 4న ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద బీభత్సం సృష్టించేందుకు భారీ కుట్రలకు తెర తీశాయి. పచ్చ ముఠాలు, అల్లరి మూకలు విసురుతున్న సవాల్‌ను సమర్థంగా తిప్పికొట్టేందుకు పోలీసు శాఖ అప్రమత్తమైంది. పోలింగ్‌ సందర్భంగా పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో టీడీపీ గూండాలు అరాచకాలకు తెగబడి భయానక వాతావరణాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ మూడు జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 

ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆయా చోట్ల విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు కార్డన్‌ – సెర్చ్‌ ఆపరేషన్లు చేపట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ పటిష్ట నిఘా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమైన కూడళ్లు, గ్రామ శివారు ప్రాంతాలు, అనుమానిత ప్రదేశాల్లో పోలీసు శాఖసోదాలు నిర్వహిస్తోంది. నేర చరితులను అదుపులోకి తీసుకుంటోంది. అక్రమ మద్యం, ఆయుధాలు, పేలుడు పదార్ధాలను, రికార్డులు లేని వాహనాలను గుర్తించేందుకు తనిఖీలు చేపట్టింది.  

బదిలీలతో అల్లరి మూకల అరాచకం..
రాష్ట్రంలో పోలింగ్‌ రోజు, అనంతరం టీడీపీ రౌడీమూకలు యథేచ్చగా విధ్వంస కాండకు తెగబడ్డాయి. చంద్రబాబు, పురందేశ్వరిఈసీపై ఒత్తిడి తెచ్చి పల్నాడు, ప్రకాశం, ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పోలీసు అధికారులను బదిలీ చేయించి తమకు అనుకూలమైన వారిని నియమించుకుని పన్నాగాన్ని అమలు చేశారు. ప్రధానంగా పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో టీడీపీ రౌడీమూకలు కర్రలు, కత్తులు, రాడ్లతో విరుచుకుపడటంతోపాటు బాంబు దాడులకు కూడా తెగబడి బీభత్సం సృష్టించాయి.

గూండాగిరీ అంతా పచ్చముఠాదే
పోలింగ్‌కు ముందు, అనంతరం దాడులు, దౌర్జన్యాలకు పాల్పడినవారిని గుర్తించి పోలీసు శాఖ కఠిన చర్యలు చేపడుతోంది. ఎన్నికల ముందు నమోదైన కేసులతో ప్రమేయం ఉన్న 1,522 మందిని గుర్తించి కొందరిని అరెస్ట్‌ చేసింది. మిగిలిన వారికి 41 సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేసింది. వీరితో దాదాపు 1,300 మంది టీడీపీ వర్గీయులే కావడం గమనార్హం. ఇక పోలింగ్‌ రోజు దాడులు, ఘర్షణల కేసుల్లో ప్రమేయం ఉన్న 2,790 మందిని గుర్తించగా కొందరిని అరెస్టు చేశారు. మిగిలిన వారికి 41 సీఆర్‌పీసీ కింద నోటీసులిచ్చారు. 

పోలింగ్‌ రోజుల అరాచకాలకు తెగబడ్డ వారిలో దాదాపు 2,400 మంది టీడీపీకి చెందిన వారే కావడం ఆ పార్టీ కుట్రలను బట్టబయలు చేస్తోంది. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా 85 మందిపై హిస్టరీ షీట్లను తెరవగా వీరిలో 58 మంది టీడీపీ వర్గీయులే ఉన్నారు. టీడీపీకి చెందిన ముగ్గురిపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించగా మరో ఇద్దరిని  జిల్లాల నుంచి బహిష్కరించారు. పోలీసుశాఖ గత మూడు రోజులుగా 301  సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్‌ – సెర్చ్‌ ఆపరేషన్ల ద్వారా విస్తృతంగా సోదాలు నిర్వహించింది. ఎటువంటి పత్రాలు లేని 1,104 వాహనాలను జప్తు చేసింది. 482 లీటర్ల సారాయి, 3,332 లీటర్ల అక్రమ మద్యం, 436 లీటర్ల ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా రవాణా చేసిన మద్యాన్ని స్వాధీనం చేసుకుంది.

స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత 
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద టీడీపీ మూకలు అరాచకాలకు తెగబడే ప్రమాదం ఉన్నందున పటిష్ట బందోబస్తు కల్పించారు. 350 స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరిచిన ఈవీఎంలకు కేంద్ర బలగాలు, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీసు బలగాలు, సివిల్‌ పోలీసులు 24/7 మూడంచెల భద్రతతో పహరా కాస్తున్నారు. బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులకు బాడీ వార్న్‌ కెమెరాలను సమకూర్చారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద వెయ్యికి పైగా అధునాతన ఫేస్‌ రికగ్నైజేషన్‌ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. 

స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి జిల్లా ఎన్నికల అధికారి(కలెక్టర్‌), ఎస్పీ/ పోలీస్‌ కమిషనర్లు పాసులు జారీ చేసిన వ్యక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల పరిశీలనకు వచ్చిన అధికారులు, సిబ్బంది వివరాలను నమోదు చేస్తున్నారు. వీడియోగ్రఫీ ద్వారానే లోపలికి అనుమతిస్తున్నారు. అన్ని స్ట్రాంగ్‌రూమ్‌లను అనుసంధానిస్తూ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో పటిష్ట నిఘా కోసం స్ట్రాంగ్‌ రూమ్‌ల చుట్టూ ఫ్లడ్‌ లైట్లను అమర్చారు. స్ట్రాంగ్‌రూమ్‌లు ఉన్న ప్రదేశానికి 2 కి.మీ. పరిధిని రెడ్‌ జోన్‌గా ప్రకటించి డ్రోన్లు, బెల్లూను ఎగురవేయడాన్ని నిషేధించారు. స్ట్రాంగ్‌రూమ్‌ల నుంచి ఈవీఎంలను కౌంటింగ్‌ కేంద్రాలకు సురక్షితంగా తరలించే ప్రక్రియను ఖరారు చేశారు.

అమలులో నిషేధాజ్ఞలు
స్ట్రాంగ్‌రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాలున్న నగరాలు, పట్టణాల్లో ఓట్ల లెక్కింపు ముగిసేవరకూ వరకూ పోలీసు శాఖ నిషేధాజ్ఞలను విధించింది. 30 పోలీస్‌ యాక్ట్, సెక్షన్‌ 144 అమలులో ఉంటాయని ప్రకటించింది. ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది. కర్రలు, కత్తులు, రాడ్లు, ఇతర ఆయుధాలతో సంచరించకూడదని హెచ్చరించింది. పెట్రోల్‌ బంకుల్లో విడిగా పెట్రోల్, డీజిల్‌ విక్రయించకూడదని ఆదేశించింది. అసత్య వార్తలు, ఫేక్‌ న్యూస్‌ను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేయకూడదని పేర్కొంది.

ప్రజలు సహకరించాలి: డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా
అసాంఘిక శక్తులను కఠినంగా అణచివేస్తాం. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. అందుకు ప్రజలు కూడా  సహకరించాలి. ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దు.  సంయమనం పాటించాలి. చట్టవ్యతిరేక, అసాంఘిక శక్తుల కదలికల గురించి టోల్‌ ఫ్రీ నంబర్లు 100, 112లకు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారమివ్వాలి.

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టం
ఓట్ల లెక్కింపు చేపట్టే కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కూడా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్ని కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే అంశంపై ఈసీ ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. రాష్ట్రంలో 33 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. లెక్కింపు త్వరగా నిర్వహించేందుకు కౌంటింగ్‌ కేంద్రాలను పెంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఈసీకి ప్రతిపాదించారు. 

పోలింగ్‌ సందర్భంగా హింసాత్మక ఘటనలు జరిగిన పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఓట్ల లెక్కింపు రోజు విజయోత్సవ ర్యాలీలను నిషేధించారు. ఓట్ల లెక్కింపు ముగిసిన తరువాత 15 రోజుల వరకు 25 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రంలోనే కొనసాగనున్నాయి.  

Advertisement
 
Advertisement
 
Advertisement