
చంద్రబాబుతో నకిలీ మద్యం నిందితులు తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జ్ జయచంద్రారెడ్డి, టీడీపీ నేత జనార్దన్‌రావు
నకిలీ మద్యం కేసు పక్కదారి పట్టిస్తాం... మేం చూసుకుంటాం
నకిలీ మద్యం రింగ్ లీడర్లను బుజ్జగిస్తున్న ప్రభుత్వ పెద్దలు
రాయ‘బేరాలు’ కుదిరిన తర్వాతే వీడియో విడుదల చేసిన జనార్దన్‌రావు
తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జ్ జయచంద్రారెడ్డి, ఆయన అనుచరుడు
జనార్దన్‌రావు గుప్పిట్లో దందా గుట్టు
టీడీపీ ముఖ్య నేతలు అందులో కీలక భాగస్వాములు.. ఇందులో కరకట్ట బంగ్లా కమీషన్ 30 శాతం
సాక్షి, అమరావతి: బహుళ జాతి కూల్ డ్రింక్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా తమ ఉత్పత్తుల కోసం ప్రాంచైజీలు ఇస్తాయి! ఆ కంపెనీలు కూల్ డ్రింక్ తయారీకి అవసరమైన మిశ్రమాన్ని సరఫరా చేస్తే... ఫ్రాంచైజీలు ఆ మిశ్రమంతో కూల్‌డ్రింకులు తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తాయి. ఇలా తయారయ్యే ప్రతి బాటిల్‌పై ఫ్రాంచైజీలు కూల్ డ్రింక్ కంపెనీకి కమీషన్ చెల్లించాలి. ఇదీ వ్యాపారం..!
సరిగ్గా అదే వ్యాపార సూత్రంతో ప్రభుత్వ పెద్దలు రాష్ట్రంలో నకిలీ మద్యం దందా సాగిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. కరకట్ట బంగ్లాకు 30 శాతం కమీషన్.. అంటే ఏడాదికి రూ.3వేల కోట్లు చెల్లించాలనే ఒప్పందం కుదరడంతో నకిలీ మద్యం ఫ్రాంచైజీ రాకెట్ రాష్ట్రవ్యాప్తంగా వేళ్లూనుకుంది.
చినబాబు అండదండలతో అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జ్ జయచంద్రారెడ్డి, ఆయన ప్రధాన అనుచరుడు అద్దేపల్లె జనార్ధన్‌రావు నకిలీ మద్యం తయారీ ఫార్ములాను ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి చేయగా... టీడీపీ నేతల కుటుంబాలు ప్రాంతాలవారీగా ఆ ఫ్రాంచైజీలు తీసుకున్నాయి.
ఏడాదిగా సాగుతున్న ఈ దందా ములకలచెరువులో వెలుగు చూసిన రాకెట్‌తో అనూహ్యంగా బయటపడింది. తమను ఈ కేసు నుంచి తప్పించకుంటే మొత్తం బండారం బయటపెడతామని జయచంద్రారెడ్డి, జనార్ధన్‌రావు బెదిరిస్తుండటంతో పెదబాబు, చినబాబు బెంబేలెత్తుతున్నారు. ఆ కేసు తప్పిస్తాం..! కంగారు పడొద్దు...! తమ గుట్టు విప్పొద్దని రాయబేరాలు సాగిస్తున్నారు.
మమ్మల్ని కెలికితే... బండారం బయటపెడతా
అన్నమయ్య జిల్లా ములకలచెరువులో బయటపడిన నకిలీ మద్యం రాకెట్ టీడీపీ కూటమి సర్కారు పెద్దలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఈ నకిలీ మద్యం రాకెట్‌లో అడ్డంగా దొరికిన టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ జయచంద్రారెడ్డి, ఆయన వ్యాపార భాగస్వామి అద్దేపల్లి జనార్ధన్‌రావు ఎదురు తిరగడంతో ప్రభుత్వ పెద్దలు హడలిపోతున్నారు. ఈ కేసును కప్పిపుచ్చేందుకు అమరావతి నుంచి ప్రభుత్వ ముఖ్యనేత వేసిన ఎత్తుగడ బెడిసికొట్టింది.
టీడీపీ నేతలే నకిలీ మద్యం దందా సూత్రధారులని ఆధారాలతో బట్టబయలు కావడంతో విధిలేని పరిస్థితుల్లో జయచంద్రారెడ్డిని టీడీపీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించారు. జనార్ధన్‌రావుతోపాటు కొందరు టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. దాంతో ఈ వ్యవహారం సద్దుమణుగుతుందని భావించారు. కానీ అనూహ్యంగా జయచంద్రారెడ్డి, జనార్ధన్‌రావు ఎదురుతిరిగి ప్రభుత్వ ముఖ్యనేతకు షాక్ ఇచ్చారు. ఈ కేసు నుంచి తమను బయటపడేయాలని, లేకపోతే రాష్ట్ర స్థాయిలో సాగుతున్న నకిలీ మద్యం దందా గుట్టును బహిర్గతం చేస్తామని వారు తేల్చి చెప్పినట్లు సమాచారం.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో టీడీపీ నేత పెట్టిన నకిలీ మద్యం ప్లాంటులోని యంత్రాలు, క్యాన్‌లు, (ఇన్‌సెట్‌లో) నకిలీ మద్యం బాటిళ్లు
తామేమీ ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా నకిలీ మద్యం తయారు చేయడం లేదు కదా? అని వారిద్దరూ నిలదీయడంతో పెదబాబు, చినబాబులకు నోట మాట రాలేదు! ‘ ఎన్నికల ముందు కుదిరిన ఒప్పందం ప్రకారం టీడీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రస్థాయిలో నకిలీ మద్యం దందాను వ్యవస్థీకృతం చేశాం. అందుకు ఎంతో ఖర్చు పెట్టాం. ఈ రాకెట్‌ను మేం పర్యవేక్షిస్తున్నాం... కానీ అందులో చాలా మంది టీడీపీ పెద్దలు ఉన్నారు కదా..! అంతకంటే పెద్దలకు కమీషన్లు వెళ్తున్నాయి కదా..?’ అని జయచంద్రారెడ్డి, జనార్ధన్‌రావు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఓ టీడీపీ సీనియర్ ప్రజాప్రతినిధి ద్వారా కబురు పంపినట్లు విశ్వసనీయ సమాచారం.
అదే విషయాన్ని ఈ కేసును అమరావతి నుంచి పర్యవేక్షిస్తున్న ఐపీఎస్ అధికారికి కూడా చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా ఓ టీడీపీ సీనియర్ ప్రజాప్రతినిధి, ఐపీఎస్ అధికారి ద్వారా తమ మనసులో మాటను ముఖ్యనేతకు తేల్చి చెప్పారు. అదే సమయంలో తమ డిమాండ్లను బలంగా వినిపించినట్లు తెలుస్తోంది. ఈ కేసు నుంచి తమను బయటపడేసే బాధ్యత ప్రభుత్వ పెద్దలదేనని... లేదంటే మొత్తం నకిలీ మద్యం గుట్టు విప్పుతామని తేల్చి చెప్పారు.
మిమ్మల్ని మేం చూసుకుంటాం... నోరెత్తొద్దు
నకిలీ మద్యం దందా బండారం మొత్తం బయట పెడతామని జయచంద్రారెడ్డి, జనార్ధన్‌రావు బెదిరించడంతో పెదబాబు, చినబాబు షాక్ తిన్నారు. దాంతో తమకు సమాచారం ఇచ్చిన మధ్యవర్తుల ద్వారానే జయచంద్రారెడ్డి, జనార్దన్‌రావులతో రాయబేరాలు సాగించారు. తప్పనిసరి పరిస్థితుల్లో కేసు నమోదు చేయాల్సి వచ్చిందని.. పార్టీ పరువు బజారున పడటంతో సస్పెండ్ చేయాల్సి వచ్చిందని వారిద్దరినీ బుజ్జగించేందుకు యత్నించారు. ‘మీరు ఇప్పుడు మొత్తం గుట్టు విప్పితే మీకూ నష్టం... మాకూ నష్టం... పార్టీకి పూర్తిగా నష్టం.. ఎవరికి ప్రయోజనం ఉండదు..’ అని సర్ది చెబుతున్నట్లు తెలుస్తోంది. ‘అయినా అధికారంలో ఉన్నది మన ప్రభుత్వమే.
ఇటీవల అన్నమయ్య జిల్లా ములకలచెరువులో పట్టుబడిన నకిలీ మద్యం బాటిళ్లు
కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా చూస్తాం. మీవరకు రానివ్వకుండా పక్కదారి పట్టిస్తాం.. మీరేమీ ఆందోళన చెందవద్దు..’ అని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులు తెరవెనుక ఉండండి... తరువాత మళ్లీ పార్టీలో క్రియాశీలం కావచ్చని సూచించినట్లు సమాచారం. దాంతో జయచంద్రారెడ్డి, జనార్దన్‌రావు మెత్తబడినట్లు తెలుస్తోంది. అంతే కాదు.. ఈ నకిలీ మద్యం వ్యవహారంలో టీడీపీ నేతల ప్రమేయం లేదని వీడియో ద్వారా ప్రకటించాలని జనార్దన్‌రావును చినబాబు ఆదేశించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కేసు నుంచి బయటపడేస్తామని ప్రభుత్వ పెద్దల నుంచి హామీ లభించడంతో జనార్ధన్‌రావు సోమవారం సాయంత్రం వీడియో విడుదల చేసినట్లు టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
పెదబాబులో గుబులు.. చినబాబు బెంబేలు!
టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, జనార్ధన్‌రావు హెచ్చరికలతో పెదబాబు, చినబాబు బెంబేలెత్తుతున్నారు. ఏడాదిగా రాష్ట్రవ్యాప్తంగా తాము వ్యవస్థీకృతం చేసిన నకిలీ మద్యం రాకెట్ వెనుక గూడుపుఠాణి బట్టబయలవుతుందని ఆందోళన చెందుతున్నారు. అసలు ఈ మొత్తం దందా చినబాబు అండదండలతోనే సాగుతోంది. ఆయనకు సన్నిహితుడైన అన్నమయ్య జిల్లాకు చెందిన ప్రభుత్వ కీలక నేత ఈ నకిలీ మద్యం రాకెట్‌కు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు.
అందుకే ఉమ్మడి చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో సీనియర్ ప్రజాప్రతినిధులను కాదని మరీ ఆయనకు ప్రభుత్వంలో కీలక పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ కీలక నేతకు సన్నిహితులైన జయచంద్రారెడ్డి, జనార్ధన్‌రావు, కట్టా సురేంద్రబాబు ఆఫ్రికా దేశాల్లో అనుసరించే నకిలీ మద్యం తయారీ విధానాన్ని రాష్ట్రంలోకి తీసుకొచ్చారు. చినబాబు ఆదేశాలతో ఆయనకు సన్నిహితులైన టీడీపీ నేతలను వ్యాపార భాగస్వాములుగా చేసుకున్నారు. రాష్ట్రాన్ని ప్రాంతాలవారీగా పంచుకుని నకిలీ మద్యం దందా సాగిస్తున్నారు.
జయచంద్రారెడ్డి, జనార్దన్‌రావు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యం తయారీ యూనిట్లను నెలకొల్పారు. అన్నమయ్య జిల్లాకు చెందిన కీలక నేత రాయలసీమలో... నర్సీపట్నానికి చెందిన సీనియర్ నేత కుటుంబం ఉత్తరాంధ్రలో... రెవెన్యూ, పోలీసు అధికారులపై దాడులకు దిగిన చరిత్ర కలిగిన ఏలూరు జిల్లాకు చెందిన వివాదాస్పద ఎమ్మెల్యే ఉమ్మడి గోదావరి జిల్లాల్లో... బాపట్ల జిల్లా కీలక నేత ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో.. జయచంద్రారెడ్డి స్వయంగా రాయలసీమలో నకిలీ మద్యం రాకెట్‌ను నిర్వహిస్తున్నారు. టీడీపీ సిండికేట్ ఆధ్వర్యంలోని మద్యం దుకాణాలు, బెల్ట్ దుకాణాలు, బార్లలో యథేచ్ఛగా నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్నారు.
కరకట్ట బంగ్లా వాటా 30 శాతం...
ఏడాదిగా రాష్ట్రంలో జరుగుతున్న మద్యం విక్రయాల్లో మూడో వంతు నకిలీనేనని ఎక్సైజ్ శాఖ అనధికారికంగా వెల్లడిస్తుండటం గమనార్హం. ఆ విధంగా టీడీపీ కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే రూ.5,280 కోట్ల మేర నకిలీ మద్యం అమ్మకాలు సాగాయి. మొత్తం అమ్మకాల్లో నకిలీ మద్యం వాటాను 50 శాతం దాటించాలన్నది ఈ సిండికేట్ లక్ష్యంగా పెట్టుకుంది.
అంటే రానున్న నాలుగేళ్లలో ఏడాదికి రూ.10 వేల కోట్లు చొప్పున రూ.40 వేల కోట్లు కొల్లగొట్టేందుకు పన్నాగం వేసింది. అందులో 30 శాతం అంటే రూ.12 వేల కోట్లు కరకట్ట నివాసానికి కమీషన్‌గా చెల్లించాలన్నది ఒప్పందం. ప్రాంతాలవారీగా పర్యవేక్షిస్తున్న టీడీపీ సీనియర్ నేతలకు 50 శాతం, మద్యం దుకాణాలు, బార్లు నిర్వహిస్తున్న టీడీపీ సిండికేట్‌కు 20 శాతం వాటా దక్కనుంది.