
విశాఖ ఉక్కు కార్మిక నేతలపై టీడీపీ ఎంపీ శ్రీభరత్ తీవ్ర వ్యాఖ్యలు
కాంట్రాక్టర్లు, కార్మిక నేతలు, కొందరు అధికారులు కుమ్మక్కయ్యారు
రూ.లక్షలు తీసుకున్న నాయకుల ఆందోళనల్లో అర్థం లేదు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా
ఎంపీ, ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఉక్కు కార్మిక నాయకుల ఆగ్రహం
కాంట్రాక్ట్ పోస్టులను రూ.లక్షలకు అమ్ముకున్నారు
కూర్మన్నపాలెం/గాజువాక/ఉక్కునగరం: విశాఖ ఉక్కు కార్మిక సంఘాల నేతలపై టీడీపీ ఎంపీ ఎం.శ్రీభరత్, గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘కార్మిక నాయకులకు నైతిక విలువలు లేవు. కాంట్రాక్ట్ పోస్టులను రూ.లక్షలకు అమ్ముకున్నారు. మళ్లీ ఆ నాయకులే కూటమి ప్రభుత్వంపై దు్రష్పచారం చేస్తున్నారు’ అంటూ శ్రీభరత్ ఆరోపించారు. జీవీఎంసీ 87వ వార్డులో రూ.6 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు బుధవారం వీరు శంకుస్థాపన చేశారు.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీ భరత్ మాట్లాడుతూ.. కార్మిక నాయకులది రాజకీయ ఎత్తుగడ అని, ప్రజలే అలాంటి వారిపై తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ ‘కార్మిక నేతలు రూ.లక్షలు తీసుకుని వేలాది మందిని కాంట్రాక్టు కార్మికులుగా నియమించుకున్నారు. ప్యాకేజీ ఇచ్చినా ఉనికి కాపాడుకోవడం కోసం ఆందోళనలు చేస్తున్నారు. ఇందులో అర్థం లేదు. కాలక్షేపం చేస్తామంటే ప్రజల్లో చులకన అవుతారు’ అని వ్యాఖ్యానించారు. స్టీల్‌ప్లాంట్‌లో అనర్హులను మాత్రమే తొలగిస్తున్నామన్నారు.
కాంట్రాక్టర్లు, కార్మిక నేతలు, కొందరు అధికారులు కుమ్మక్కవడంతో నిర్వాసితులకు అన్యాయం జరుగుతోందన్నారు. నాయకులు స్వార్థం విడనాడి కర్మాగారంలో ఉత్పత్తి సాధనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. కాగా, కాంట్రాక్ట్ పోస్టులు అమ్ముకున్నామంటూ ఎంపీ, ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై కార్మిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్లాంట్ బాగుంటే లబ్ధి పొందలేమనే ప్రజాప్రతినిధులు విమర్శలు చేస్తున్నారని తప్పుబట్టారు.
డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమే
ప్రస్తుతం వ్యవహారాలను పక్కదోవ పట్టించడానికి కూటమి ప్రజాప్రతినిధులు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. స్టీల్ ప్లాంట్‌కు సొంత గనుల కేటాయింపు గురించి అడగని ఈ ప్రజాప్రతినిధులు.. ప్రారంభమే కాని మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం గనులు అడుగుతున్నారు. నిర్వాసితుల మధ్య చిచ్చు పెట్టేలా విమర్శలు చేస్తున్నారు. –మంత్రి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి, స్టీల్ ఐఎన్‌టీయూసీ
సీబీఐ విచారణకైనా సిద్ధం
కాంట్రాక్ట్ కార్మికుల పోస్టులను అమ్ముకున్న కార్మిక నేతల పేర్లను ప్రజాప్రతినిధులు బయటపెట్టాలి. ఈ అంశంపై అవసరమైతే సీబీఐతో విచారణ జరిపించి దోషులపై చర్యలు తీసుకోవాలి. దీనికి మా యూనియన్ కట్టుబడి ఉంది.
– కేఎస్‌ఎఎన్ రావు, అధ్యక్షుడు, స్టీల్ ఏఐటీయూసీ
ఆ విషయాన్ని తేల్చాలి..
ఇటీవల తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులు డబ్బులు కట్టి చేరినవారా? లేక నిర్వాసితులా? అనేది తేల్చి చెప్పాలి. ఎలాంటి విచారణకైనా మేం సిద్ధం. – జె.అయోధ్యరామ్, గౌరవ అధ్యక్షుడు, స్టీల్ సీఐటీయూ