
జానీసైదా మోసం చేశాడంటూ పత్రాలు చూపుతున్న హసీనా
దొంగ పత్రాలు చూపించి ఎన్‌ఆర్‌ఐ మహిళను మోసం చేసిన వైనం
భూమి రిజిస్ట్రేషన్ చేయమంటే పొంతన లేని సమాధానం
పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు
పెదకూరపాడు: ఎన్‌ఆర్‌ఐ మహిళను మోసం చేసి ఓ టీడీపీ నేత రూ.16 లక్షలు కొట్టేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూరప్‌లో ఉండే షేక్ హసీనా అమరావతిలో భూమి కొనుగోలు చేయాలని మధ్యవర్తి గోపిని సంప్రదించింది. దీంతో హసీనా సోదరి జాన్‌బీకి అమరావతి మండలం నెమలికల్లులోని కుప్పా మల్లేశ్వరయ్యకి చెందిన భూమిని గోపి చూపెట్టాడు. ఆ భూమి వివరాలను ఆమె హసీనాకు వాట్సప్‌లో షేర్ చేసింది. భూమి నచ్చడంతో గోపికి రూ.లక్ష బయానా చెల్లించి భూమికి సంబంధించిన డాక్యుమెంట్ జిరాక్స్‌లను తీసుకుంది. భూమి రికార్డులన్నీ బాగానే ఉండటంతో 95 సెంట్ల పొలాన్ని రూ.75.52 లక్షలకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
హసీనా..తన సోదరి జాన్‌బీని పంపి రూ.16 లక్షలు చెల్లించి అగ్రిమెంట్ చేసుకోవడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో అగ్రిమెంట్ చేసుకోవడానికి వచ్చిన జాన్‌బీకి అమరావతికి చెందిన టీడీపీ నేత జానీసైదా తాను మల్లేశ్వరయ్య నుంచి భూమి కొనుగోలు చేసి అగ్రిమెంట్ చేసుకున్నానని నకిలీ పత్రాలు చూపించి నమ్మించాడు. అదే రూ.75.52 లక్షలకే తాను ఆ భూమిని అమ్ముతానని చెప్పాడు. దీంతో మే 15న రూ.16 లక్షలు జానీ సైదాకు చెల్లించి నెలరోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా జాన్‌బీ పేరు మీద అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ క్రమంలో జూన్ 20న భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి యూరప్ నుంచి గుంటూరుకు షేక్ హసీనా వచ్చింది. భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటానని జానీసైదాను కోరినా అతడు పొంతనలేని సమాధానాలు చెప్పాడు.

దీంతో హసీనాకు అనుమానం వచ్చి భూ యజయాని మల్లేశ్వరయ్యను సంప్రదించింది. అతడు జానీసైదా ఎవరో తనకు తెలియదని, తాను అగ్రిమెంట్ చేయలేదని చెప్పడంతో హసీనా తాను మోసపోయానని గ్రహించి గుంటూరు పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేసింది. హసీనా మాట్లాడుతూ తాను కూడా టీడీపీ తరఫున 3 సార్లు పోలింగ్ ఏజెంట్‌గా పనిచేశానని, తనకు జరిగిన మోసాన్ని మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకువెళతానని తెలిపింది. కాగా, ఇసుక ఆక్రమాలకు సంబంధించి జానీ సైదాపై పలు ఆరోపణలున్నాయి. నియోజకవర్గంలో టీడీపీలో ముఖ్యనేత కావడంతో బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు.