జనసేన కార్యకర్తపై... టీడీపీ మూకల దాడి | TDP Goons Attack Janasena Activist at Kolluru: Bapatla District | Sakshi
Sakshi News home page

జనసేన కార్యకర్తపై... టీడీపీ మూకల దాడి

May 24 2026 6:06 AM | Updated on May 24 2026 6:06 AM

TDP Goons Attack Janasena Activist at Kolluru: Bapatla District

కొల్లూరు పోలీసు స్టేషన్‌పై దాడికి తెగబడుతున్న టీడీపీ మూకలు

టీడీపీ శ్రేణులపై ఫిర్యాదు చేసేందుకు కొల్లూరు పీఎస్‌కు వెళ్లిన జనసేన కార్యకర్త

ఒక్కసారిగా దూసుకొచ్చి అతడితోపాటు పోలీసులపైనా దాడి

పచ్చమూకల దాష్టీకంతో కొల్లూరు పోలీస్‌స్టేషన్‌ రక్తసిక్తం

పోలీసు జీపు దహనం చేసేందుకు విశ్వప్రయత్నం 

ఉలిక్కిపడిన పోలీసు యంత్రాంగం

కొల్లూరు: పచ్చమూకల దాష్టీకానికి బాపట్ల జిల్లా కొల్లూరు పోలీస్‌ స్టేషన్‌ రక్తసిక్తమైంది. టీడీపీ శ్రేణుల అరాచకపర్వంతో పోలీసులు సైతం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి తలెత్తింది. తమపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన జన సైనికుడు, అతని  కుటుంబ సభ్యులపై పోలీస్‌ స్టేషన్‌లోనే టీడీపీ వర్గీయులు విచక్షణారహితంగా దాడి చేశారు. పచ్చమూకల విధ్వంసం కారణంగా పోలీసు స్టేషన్‌లో భీతావహ వాతావరణం నెలకొని స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు ఏమీ చేయలేక చేతులెత్తేసి ప్రాణా­లు కాపాడుకునేందుకు తలోదిక్కుకు వెళ్లిపోయారు. 

టీడీపీ నాయకుడిని విమర్శించాడన్న సాకుతో దాడి.. 
కొల్లూరులో నూడిల్స్‌ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న జన సైనికుడు ఉప్పు జానకిరామయ్య టీడీపీ నాయకుడైన మాజీ ఎంపీపీ కనగాల మధుసూధన్‌ ప్రసాద్‌ను విమర్శించి, చులకనగా మాట్లాడాడన్న సాకుతో ఆ పార్టీ శ్రేణులు దాడి చేసినట్లు రేపల్లె డీఎస్సీ ఆవుల శ్రీనివాసరావు వెల్లడించారు. పోలీసుల కథనం మేరకు.. శుక్రవారం రాత్రి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ మూసేసి  ఇంటికి వెళ్తున్న జానకిరామయ్యకు, టీడీపీ నాయకుడి అనుచరులైన కొల్లూరులోని ఓ కాలనీకి చెందిన వ్యక్తులు సమీపంలోని మద్యం దుకాణం వద్ద తారసపడ్డారు. ఈ క్రమంలో తమ నాయకుడిని తక్కువ చేసి మాట్లాడతావా అంటూ ఆ కాలనీకి చెందిన కొండూరు సురేష్‌ ప్రశ్నించడంతో ఇరువురి నడుమ మాటామాటా పెరిగి తోపులాటకు దారితీసింది.

ఈ క్రమంంలో జానకిరామయ్య తలపై మద్యం సీసాతో సురేష్‌ దాడి చేయడంతో గాయమైంది. వెంటనే బంధువులు, స్నేహితుల సాయంతో ఫిర్యాదు చేసేందుకు జానకిరామయ్య కొల్లూరు పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. తీవ్ర రక్త స్రావమవుతున్న జానకిరామయ్యను వైద్యశాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. అతడిని తెనాలి తరలించేందుకు 108 వాహనం వస్తున్న సమయంలో కాలనీ నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన టీడీపీ శ్రేణులు విచక్షణారహితంగా పోలీసులతోపాటు, బాధితుడు జానకిరామయ్య, వారి బంధువులపైనా దాడి చేశారు. జానకిరామయ్య మేనల్లుడు రాము బాలశివగంగాధర్‌ ఆ కాలనీకి వెళ్లి తన మేనమామను కొడతారా... చూసుకుందాం రండి అనడంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న కాలనీకి చెందిన వ్యక్తులు పెద్ద సంఖ్యలో పోలీసు స్టేషన్‌కు దూసుకొచ్చి విచక్షణారహితంగా దాడి చేశారని తెలుస్తోంది.

పోలీసుల జీపు దహనానికి యత్నం
వేమూరు సీఐ పీవీ.ఆంజనేయులుతోపాటు, పోలీసు సిబ్బంది కూడా టీడీపీ శ్రేణుల దాడికి గురయ్యారు. స్టేషన్‌ ఆవరణలో ఉన్న పోలీసు జీపును రోడ్డుపైకి నెట్టుకెళ్లిన పచ్చ మూకలు ధ్వంసం చేసి దహనం చేసేందుకు ప్రయతి్నంచారు. దాన్ని తిరిగి ఆవరణలోకి తీసుకొచ్చేందుకు వెళ్లిన హోంగార్డు నాగరాజుపై ఇష్టానుసారంగా దాడికి తెగబడి దుస్తులు చింపేశారు. 

ఇదే క్రమంలో వేమూరు పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ ప్రసాద్‌పైనా దాడి చేశారు. ఈ దాడిలో ఇరువర్గాల వారూ గాయపడడంతో గుంటూరు, తెనాలి వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఉప్పు జానకిరామయ్యతోపాటు, అతని సోదరి రాము వెంకటలక్ష్మి, అతని బావ, రాము శివనారాయణ, మేనల్లుడు రాము బాల శివగంగాధర్‌ గాయాలతో గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఎస్సీ కాలనీకి చెందిన గొడవర్తి తేజ, దున్నా చింతయ్య, చొప్పర చింతయ్య గాయాలతో తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.  

కొల్లూరులో పోలీసుల పహారా
కొల్లూరు పోలీస్‌ స్టేషన్‌లో దాడి సమాచారంతో రేపల్లె డీఎస్పీ శ్రీనివాసరావుతోపాటు, సబ్‌ డివిజన్‌ పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలు కొల్లూరు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఇరు సామాజికవర్గాల నడుమ జరిగిన వివాదం కారణంగా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కొల్లూరులోని పలు ప్రాంతాల్లో పికెట్‌ ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు.

వేమూరు, చుండూరు, రేపల్లె టౌన్, రేపల్లె రూరల్‌ సీఐలు పీవీ.ఆంజనేయులు, ఎం.ఆనందరావు, బి.అశోక్‌కుమార్, సురేష్‌బాబు, పలు స్టేషన్ల ఎస్‌ఐలు కొల్లూరులో మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు పోలీసు స్టేషన్‌పై చేసిన దాడి ఘటనలో ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు తెలిపారు. ఈ దాడి పోలీసు వ్యవస్థకే సవాలుగా మారిందని, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అందరిపైనా కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడి వెనుక రాజకీయ నాయకుల పాత్రపైనా విచారణ చేపడతామని పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement