టీడీపీ కార్పొరేటర్‌ భూ దందాలకు అదుపే లేదు

TDP Corporator Bonda Jagan Land Occupation In Vizag - Sakshi

దొండపర్తి(విశాఖ దక్షిణ): భూఆక్రమణలపై ఒకవైపు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంటే.. మరోవైపు టీడీపీ నేతలు అడ్డూ అదుపూ లేకుండా భూఆక్రమణలతో చెలరేగిపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవహరించిన మాదిరిగానే ఇప్పడు కూడా భూ దందాలు సాగిస్తున్నారు. ఒకవైపు వారి కబంద హస్తాల్లో ఉన్న భూములను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నా.. తమ పంథాను మార్చుకోవడం లేదు. తాజాగా 87వ వార్డు టీడీపీ కార్పొరేటర్‌ బొండా జగన్‌ భూఆక్రమణలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. గాజువాక ప్రాంతంలో ఆర్‌కార్డుల పేరుతో కబ్జాలకు తెరలేపారు. ఈయన వ్యవహారంపై ఇప్పటికే వడ్లపూడి, కణితి కాలనీ, అప్పికొండ ప్రాంతవాసులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు.

కోర్టులో ఉన్నప్పటికీ..
వడ్లపూడి ప్రాంతంలో ఆర్‌హెచ్‌ కాలనీ సెక్టార్‌–2లో 526, 527 ప్లాట్‌ నెంబర్ల వివాదం 2012 నుంచి గాజువాక జూనియర్‌ కోర్టు, హైకోర్టులో నడుస్తోంది. ఈ వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. గత ప్రభుత్వ హయాంలో వివాదమున్న ఇరువర్గాలను బెదిరించి ఆ ప్లాట్లకు నకిలీ పత్రాలు సృష్టించి బొండా జగన్‌ అతని సోదరుడు సూరిబాబు బినామీ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసినట్లు స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అందులో 526 నంబర్‌ ప్లాట్‌ను కొద్ది నెలల క్రితం రూ.30 లక్షలకు విక్రయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అక్రమార్కులకు అండగా..
భూఆక్రమణలకు పాల్పడడమే కాకుండా ఆక్రమణదారులకు కూడా టీడీపీ కార్పొరేటర్‌ బొండా జగన్‌ అండదండలు అందిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వడ్లపూడి ఆర్‌హెచ్‌ కాలనీ, అప్పికొండ కాలనీ సెక్టార్‌–2లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇరోతు గంగరాజు అనే వ్యక్తి 24 అడుగుల రోడ్డును కబ్జా చేసి ఇంటి నిర్మాణం పూర్తి చేశారు. ఈ నిర్మాణంపై అధికారులు చర్యలు తీసుకోకుండా జగన్‌ ఒత్తిడి చేశారని స్థానికులు ఇప్పుడు రెవెన్యూ, జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

  • అప్పికొండ ప్రాంతంలో ప్లాట్‌ నెంబర్‌ 1799 పక్కన ఉన్న 24 అడుగుల రోడ్డును ఆనుకొని ఉన్న స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించిన బొండా జగన్‌ ఓ వ్యక్తికి రూ.15 లక్షలకు విక్రయించగా.. ప్రస్తుతం అందులో ఇంటి నిర్మాణం చేస్తున్నట్లు స్థానికులు అధికారులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
  • కణితి కాలనీ కళింగ వీధి చివర వాటర్‌ ట్యాంక్‌ పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో స్టీల్‌ప్లాంట్‌ నిర్వాసితుల పేరుతో ఇద్దరు వ్యక్తులు దొంగ పట్టాలతో రేకుల షెడ్డులు నిర్మించారు. ఆ నిర్మాణాలను రెవెన్యూ సిబ్బంది ఇప్పటికే రెండు సార్లు తొలగించారు. దీంతో కార్పొరేటర్‌ జగన్‌ వారితో ఒప్పందం చేసుకొని మళ్లీ నిర్మాణాలకు సిద్ధమవుతున్నారని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
  • ఎన్నికల్లో డబ్బులు సాయం చేసినందుకు గాను వడ్లపూడి మెయిన్‌ రోడ్డులో ఉన్న ఎస్‌ కన్వెన్షన్‌ ఫంక్షన్‌ హాల్‌ వెనుక గల ఆర్‌ నెంబర్‌ భూముల్లో ఇటీవల రేకుల షెడ్డు నిర్మాణం చేసినట్లు అక్కడి వారు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదులపై అధికారులు విచారణకు సిద్ధమవుతున్నారు.

ఆక్రమణలపై చర్యలు తీసుకుంటాం
భూఆక్రమణలపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. కణితి కాలనీలో వచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే రెండు సార్లు నిర్మాణాలు తొలగించాం. మరోసారి నిర్మాణం చేపడితే వారిపై కేసులు పెడతాం. ఇప్పటికే ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుపుతాం.
– లోకేశ్వరరావు, గాజువాక తహసీల్దార్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top