సోషల్ మీడియాలో కట్టా మణికంఠకు మద్దతుగా జనసేన పార్టీని ప్రశ్నిస్తూ టీడీపీ నాయకులు పెట్టిన పోస్టులు
మంత్రి దుర్గేష్ అనుచరులు అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు
సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన టీడీపీ బూత్ ఇన్‌చార్జి కట్టా మణికంఠ
మణికంఠ ఆచూకీ తెలపాలని పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ శ్రేణుల ఆందోళన
నిడదవోలు రూరల్: రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అనుచరుల టార్చర్ వల్లే నేను చనిపోతున్నాను.. అకారణంగా ఓ కేసులో ఇరికించి ఇబ్బంది పెడుతున్నారని తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం సింగవరం గ్రామానికి చెందిన టీడీపీ బూత్ ఇన్‌చార్జి కట్టా మణికంఠ సోషల్ మీడియాలో ఆదివారం మధ్యాహ్నం సెల్ఫీ వీడియో పోస్ట్ చేశాడు. దీంతో మణికంఠ ఆచూకీ తెలపాలని టీడీపీ నాయకులు నిడదవోలు పట్టణ పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. మరో వైపు మణికంఠ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
సెల్ఫీ వీడియో సారాంశం ఇదీ..
‘నా పేరు కట్టా మణికంఠ. మాది నిడదవోలు మండలం సింగవరం. నాన్న.. నన్ను క్షమించండి.. నేను చనిపోతున్నా. అక్రమ కేసులు తట్టుకోలేకపోతున్నాను. మంత్రి కందుల దుర్గేష్ గారూ.. నేను తెలుగుదేశం కార్యకర్తను. మా నాన్న గారు తెలుగుదేశం పార్టీ నాయకులు. 1989 నుంచి అదే టీడీపీలో ఉన్నారు. సింగవరంలో చందు అనే వ్యక్తి గతంలో దేవదాయశాఖకు సంబంధించిన స్థలాలు కబ్జా చేశాడు. పంచాయతీరాజ్, స్కూల్ స్థలాలు కబ్జా చేశాడు. దానిపై మా నాన్న 14 నెలలుగా పోరాటం చేస్తున్నారు. టీడీపీ బూత్ ఇన్‌చార్జినైన నా మీద కేసులు పెడితే ఇంకా ఎందుకు సార్ పార్టీ.
మీ నియోజకవర్గంలో బీసీలంటే అంత చులకనా? ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేయించి నా ఫోన్ సీజ్ చేశారు. ఎస్సై, సీఐ పట్టించుకోవడం లేదు. నేను పనిచేసిన చోటుకు వచ్చి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. ఊర్లో భూములు కబ్జా చేసిన చందు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. నాకు గుండె దడగా ఉంది. తట్టుకోలేకపోతున్నాను. నేను చనిపోతున్నాను. నా చావుకు కారణం డాక్టర్ తోపరాల కల్యాణ చక్రవర్తి, పెన్మత్స చందు వర్మ, అచ్యుత్ పవన్, సాయిలక్ష్మణ్ అడ్డాల, ఎస్సై జగన్మోహన్‌రావు, సీఐ తిలక్‌లే. నేను చనిపోతున్నాను.. నా వల్ల కావడం లేదు.’ అని పోస్టు చేశాడు.


