ఇసుక వాహనాలపై టార్పాలిన్‌ కవర్‌ తప్పనిసరి | Sakshi
Sakshi News home page

ఇసుక వాహనాలపై టార్పాలిన్‌ కవర్‌ తప్పనిసరి

Published Sat, May 18 2024 5:07 AM

Tarpaulin cover is mandatory on sand vehicles

జీసీకేసీ, ప్రతిమ సంస్థలకు హైకోర్టు ఆదేశం

ఉల్లంఘనలకు జరిమానా ఎంతో తరువాత తేలుస్తాం

ఇసుక రవాణా వేళలను కూడా నిర్ణయిస్తాం

స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం

టార్పాలిన్‌ కవర్‌పై తాము కూడా ఆదేశాలిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం

విచారణ జూలై 31కి వాయిదా

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇసుక రవాణా చేసే ప్రతి వాహనంపైనా టార్పాలిన్‌ కవర్‌ కప్పడాన్ని హైకోర్టు తప్పనిసరి చేసింది. ఇసుక రవాణా సమయంలో ఏర్పడుతున్న వాయు కాలుష్యం, రోడ్లపై సంచరించే పాదచారులు, వాహనదారులు పడుతున్న తీవ్ర ఇబ్బందుల నివారణకు హైకోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. 

ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఇసుక తవ్వకాల అనుమతులు పొందిన జీసీకేసీ ప్రాజెక్ట్స్‌ అండ్‌ వర్క్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ప్రతిమ ఇన్‌ఫ్రా లిమిటెడ్, వారి అసైనీలను ఆదేశించింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఎంత జరిమానా విధించాలి, ఇసుక రవాణా చేయాల్సిన సమయాలను తదుపరి విచారణలో తేలుస్తామని తెలిపింది. జరిమానా విషయంలో అడ్వొకేట్‌ జనరల్, కోర్టు సహాయకారి సలహాలు ఇవ్వొచ్చునంది. 

తదుపరి విచారణను జూలై 31కి వాయిదా వేసింది. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలంటూ హైకోర్టులో దాఖలైన పలు వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఇటీవల ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలను నిలిపేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తదుపరి విచారణ వరకు పొడిగించింది. టార్పాలిన్‌ కవర్‌ విషయంలో తాము కూడా లీజుదారులకు తగిన ఆదేశాలిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ కోర్టుకు నివేదించారు. 

ఇసుక రవాణా విషయంలో హైకోర్టు ఎటువంటి షరతులు విధించినా పాటిస్తామని తెలిపారు. ఇసుక అక్రమ తవ్వకాల విషయాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ)కే వదిలేయాలని ఏజీ శ్రీరామ్, అమికస్‌ క్యూరీ నోర్మా అల్వరీస్‌ విన్నవించారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం, ఇసుక విషయంలో మరికొన్ని అంశాలపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని తెలిపింది. 

ఇసుక రవాణాకు వేళలు నిర్ణయించాల్సిన అవసరం ఉందని అమికస్‌ క్యూరీ తెలిపారు. రవాణా ప్రాంతాల్లో కాలుష్యం స్థాయిలను పర్యవేక్షించి, పరిమితులను దాటితే ఆ ప్రాంతాల్లో ఇసుక వాహనాల రాకపోకలను తగ్గించాలని, అవసరమైతే రవాణా మార్గాన్ని మార్చాలని సూచించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement