2026–27 ఏడాదికి టారిఫ్‌ ఆర్డర్‌ విడుదల | Tariff order released for the year 2026 and 2027 | Sakshi
Sakshi News home page

2026–27 ఏడాదికి టారిఫ్‌ ఆర్డర్‌ విడుదల

Mar 26 2026 2:58 AM | Updated on Mar 26 2026 11:55 AM

Tariff order released for the year 2026 and 2027

పంపిణీ సంస్థల ప్రతిపాదనల్లో రూ.1717.60 కోట్లు తిరస్కరణ 

సౌర పరికరాల తయారీ పరిశ్రమలకు ప్రత్యేక కేటగిరీ

పరిశ్రమల కేటగిరీలోకి వాటర్‌ ప్లాంట్లు, ప్రింటింగ్‌ ప్రెస్‌లు  

టైమ్‌ ఆఫ్‌ డేలో మార్పులకు లభించని ఆమోదం 

పలు సర్వీసుల బిల్లింగ్‌లో మార్పునకు ససేమిరా 

గ్రీన్‌ పవర్‌ కేటగిరీ రద్దు ప్రతిపాదనలకు రాని అంగీకారం 

ప్రభుత్వం సకాలంలో రాయితీ సొమ్ము ఇవ్వకపోతే వడ్డీ వసూలు: ఏపీఈఆర్‌సీ

సాక్షి, అమరావతి: 2026– 27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ తూర్పు(ఏపీఈపీడీసీఎల్‌), మధ్య (ఏపీసీపీడీసీఎల్‌), దక్షిణ(ఏపీఎస్పీడీసీఎల్‌) విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఆదాయ, అవసరాల నివేదిక (అగ్రిగేట్‌ రెవిన్యూ రిక్వైర్‌మెంట్‌–ఏఆర్‌ఆర్‌), 2024–25కు సంబంధించిన ట్రూ అప్, ట్రూ డౌన్‌ ప్రతిపాదనలను ఏపీఈఆర్‌సీకి గతేడాది నవంబర్‌లో సమర్పించాయి. 2025–26 ఆర్ధిక సంవత్సరంలో డిస్కంల ఖర్చులు, ఆదాయాలను లెక్కించి, ఈ ఏడాదికి జరిగే అంచనాలను రూపొందించారు. 

డిస్కంల ప్రతిపాదనలపై ఏపీఈఆర్‌సీ ఈ ఏడాది జనవరిలో బహిరంగ విచారణ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఆ సందర్భంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ప్రజలపై రూ.20,135.50 కోట్ల భారం వేసినందున కొత్తగా మళ్లీ భారాలు వేయవద్దని, డిస్కంలు చూపిస్తున్న లోటును ప్రభుత్వమే భరించాలని రాష్ట్ర ప్రజలు  స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఏఆర్‌ఆర్‌ను బుధవారం ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ పీవీఆర్‌ రెడ్డి కర్నూలులో విడుదల చేశారు. 

రూ.1717.60 కోట్లు తగ్గించిన ఏపీఈఆర్‌సీ 
» డిస్కంలు ఏపీఈఆర్‌సీకి సమర్పించిన ఆర్థిక లోటు లెక్కలను ఏపీఈఆర్‌సీ యధాతథంగా ఆమోదించలేదు. దక్షిణ డిస్కంలో నెట్‌వర్క్‌ నిర్వహణ, విద్యుత్‌ సరఫరా వ్యయం రూ.23,314.92 కోట్లుగా చెబితే, దానిని రూ.23,853.78 కోట్లుగా ఏపీఈఆర్‌సీ లెక్కించింది. అందులో రూ.14,544.98 కోట్లు ప్రస్తుత ధరల ప్రకారమే చార్జీలు వసూలు చేస్తే సమకూరుతుంది. 

అలాగే టారిఫ్‌ యేతర రాబడి మరో రూ.1838.31 కోట్లు వస్తుంది. దీనికి సబ్‌ స్టేషన్లు, గ్రిడ్‌ సపోర్ట్‌ చార్జీల రూపంలో వచ్చే మరో రూ.189.65 కోట్లు ఆదాయంతో కలిపితే మొత్తం రూ.16,572.94 ఆదాయం వస్తుంది. డీబీటీ సర్దుబాట్లు రూ.271.14 కోట్లు కూడా కలిపితే లోటు రూ.7,551.98 కోట్లు ఉంటుంది. దీనిని  చార్జీల ద్వారా వసూలు చేయాలని ఏపీఎస్పీడీసీఎల్‌ ప్రతిపాదించింది.  

» అదే విధంగా మధ్య డిస్కంకు వచ్చే ఏడాది ఖర్చు రూ.14,446.93 కోట్లు అవుతుందని డిస్కం చెబితే అంతలేదంటూ రూ.13,664.66 కోట్లకు ఏపీఈఆర్‌సీ తగ్గించింది. ప్రస్తుత టారిఫ్‌ ప్రకారం అయితే రూ.10,515.79 కోట్లు ఆదాయం వస్తుందని, ఇంకా రూ.4465.20 కోట్ల ఏపీసీపీడీసీఎల్‌కు  లోటు ఉంటుందని తేల్చింది. ఇక తూర్పు డిస్కం లోటు రూ.21,639.84 కోట్లుగా ఏపీఈఆర్‌సీ నిర్ణయించింది. ఇందులో ప్రస్తుత రేట్ల ప్రకారం రూ.17,813.15 కోట్లు ఆదాయం వస్తుందని, అది పోగా రూ.3773.40 కోట్లు లోటు ఉంటుందని వివరించింది. ఈ ఒక్క డిస్కం ప్రతిపాదనల్లోనే రూ.1399 కోట్లను ఏపీఈఆర్‌సీ తగ్గించింది.  

»  ఈ లెక్కన  మొత్తం రూ.17,508.17 కోట్ల ఆదాయ లోటును డిస్కంలు ఏఆర్‌ఆర్‌ నివేదికలో చూపించగా, దానిని రూ.15,790.57 కోట్లుగా ఏపీఈఆర్‌సీ తేల్చింది. అంటే రూ.1717.60 కోట్లను తిరస్కరించింది. మిగిలిన లోటును  భరిస్తామని ప్రభుత్వం లేఖ ఇచ్చినట్లు ఏపీఈఆర్‌సీ తెలిపింది.  

రాయితీ ఆలస్యమైతే వడ్డీ తీసుకోండి 
»  ప్రభుత్వం సకాలంలో రాయితీ సొమ్మును ఇవ్వకపోతే దానిపై వడ్డీని వసూలు చేసుకునే హక్కు డిస్కంలకు ఉందని, ఆ మేరకు వడ్డీ తీసుకోవచ్చని ఏపీఈఆర్‌సీ స్పష్టం చేసింది. 
»   అలాగే సబ్సిడీ బకాయిలు, ప్రభుత్వ శాఖలు పెండింగ్‌ బిల్లులను ఈ ఏడాదిలోనే 100 శాతం వసూలు చేయాలని చెప్పింది. 
»  డిస్కంలు ప్రతిపాదించిన టైమ్‌ ఆఫ్‌ డేలో  మార్పులకు మాత్రం  ఆమోదం లభించలేదు.  

» పలు సర్వీసుల బిల్లింగ్‌ విధానంలో మార్పులు చేయాలని డిస్కంలు అడిగినా ఏపీఈఆర్‌సీ అంగీకరించలేదు.  
»  గ్రీన్‌ పవర్‌ కేటగిరీ రద్దు ప్రతిపాదన కూడా తిరస్కరణకు గురయ్యింది. చిన్న పరిశ్రమలకు (కాటేజ్‌ ఇండస్ట్రీలు) లోడ్‌ పరిమితి 10 హెచ్‌పీ నుంచి 20హెచ్‌పీకి పెంచింది. 

»  సౌర పరికరాల తయారీ పరిశ్రమకు ప్రత్యేక కేటగిరీ ఏర్పాటు చేయాలని చెప్పింది. 
»  వాటర్‌ ప్లాంట్లు, ప్రింటింగ్‌ ప్రెస్‌లను కమర్షియల్‌ నుంచి ఇండస్ట్రియల్‌ కేటగిరీకి మార్చింది. 
»  జాతీయ రహదారుల స్ట్రీట్‌ లైటింగ్‌ సర్వీసులను వేరే కేటగిరిలోకి తీసుకువచ్చింది 
»  పౌల్ట్రీ ఫార్మ్‌లలో అంతర్గత పౌల్ట్రీ గ్రాసం తయారీ కేంద్రం (ఫీడ్‌ మిక్సింగ్‌ యూనిట్‌)లకు యూనిట్‌ రూ.5.85 టారిఫ్‌తో ప్రత్యేక సబ్‌ మీటర్‌ ఏర్పాటుకు అనుమతిచ్చింది. 

»  డిస్కంలు బకాయిలు తగ్గించుకోవాలని, విద్యుత్‌ ప్రమాదాలను తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించింది.  
»  ప్రజలు ఎక్కడైనా ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు వంటివి గమనిస్తే వెంటనే ఫొటోతీసి విద్యుత్‌ శాఖకు పంపే విధంగా  ఫిర్యాదులు స్వీకరించేందుకు  వెబ్‌సైట్, వాట్సప్‌ ద్వారా ఏర్పాట్లు అందుబాటులోకి తేవాలని కమిషన్‌ ఆదేశించింది. 

Advertisement
 
Advertisement
Advertisement