
ఢిల్లీ: పిన్నెల్లి సోదరులపై హత్య కేసు నమోదు విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఏ1 నుంచి ఏ5 వరకు ఉన్నది టీడీపీ వారే అని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అనంతరం, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావుల కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (ఏ6), ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి (ఏ7) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిన్నెల్లి సోదరుల తరఫు లాయర్ వాదనలు వినిపిస్తూ..‘రాజకీయ కక్షతో పెట్టిన కేసు ఇది. ఈ కేసుతో తమకు సంబంధం లేదని ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేయకముందే ఫిర్యాదుదారు ఇంటర్వ్యూ ఇచ్చారు. అధికార పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు వల్లే జరిగిన హత్య ఇది. చంద్రబాబు ప్రభుత్వం కావాలనే పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు బనాయించింది అని తెలిపారు.
అనంతరం, ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘నిందితులంతా హత్యకు గురైన వ్యక్తి పార్టీ వారే కావడం విచిత్రం. ఈ కేసులో ఏ1 నుంచి ఏ5 వరకు టీడీపీవారే ఉన్నారు అని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి విచారణ వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
