రైలు ప్రయాణం.. నరకం | Summer Train Travel Turns Into Nightmare | Sakshi
Sakshi News home page

రైలు ప్రయాణం.. నరకం

May 11 2026 9:29 AM | Updated on May 11 2026 9:29 AM

Summer Train Travel Turns Into Nightmare

ఏలూరు జిల్లా: వేసవిలో రైలు ప్రయాణం నరక ప్రాయంగా మారింది. సెలవులకు వెళ్తున్న ప్రయాణికులకు రిజర్వేషన్లు లభించక జనరల్‌ బోగీల్లో ప్రయణించాల్సి వస్తోంది. ఇసకేస్తే రాలనంత జనంతో జనరల్‌ బోగీలు కిక్కిరిసిపోతున్నాయి. వృద్ధులు, చిన్నారులు ఉక్కపోతతో విలవిల్లాడుతున్నారు. జాగా కోసం ప్రయాణికుల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ బాధలు పడలేక తప్పని పరిస్థితుల్లో రిజర్వేషన్ల బోగిల్లో ప్రయాణిస్తే ఫైన్ల రూపంలో టిక్కెట్‌ కలెక్టర్లు వసూలు చేస్తున్నారు. 

దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ వయా ఏలూరు – విశాఖపట్నం, నరసాపురం, విశాఖపట్నం వయా నరసాపురం, భీమవరం విజయవాడ రూట్లు కీలకమైనవి. ఏలూరు నుంచి కోణార్క్, యశ్వంత్‌పూర్, కోరమండల్, ఈస్ట్‌కోస్ట్, లింగంపల్లి – జన్మభూమి, బెంగుళూరు, ప్రశాంతి, సింహాద్రి, ఎల్‌టీటీ, రాయ్‌గఢ్, తిరుపతి ఇలా దాదాపు 18 ఎక్స్‌ప్రెస్‌ రైలు సరీ్వసులు రోజూ నడుస్తోన్నాయి. అదే విధంగా విజయవాడ వయా గుడివాడ, భీమవరం మీదుగా విశాఖ, చెన్నై, తిరుపతి, హైదరాబాదు, టాటానగర్, తిరుపతి, కాకినాడ పోర్టు వంటి దాదాపు 11 ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు నడుస్తున్నాయి. రాత్రి ప్రయాణాల్లో రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది.  

జనరల్‌ బోగీల పెంపు కలేనా? 
సుదూర ప్రాంతాలకు నడుస్తున్న ఎక్ర్‌ప్రెస్‌ రైళ్ళలో మూడు, కొన్నింటికి నాలుగు జనరల్‌ బోగీలు మాత్రమే ఉంటున్నాయి. ముందు భాగంలో కొన్ని, వెనుక మరికొన్ని ఉంటున్నాయి. ఒక్కో బోగిలో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారు. మూత్ర విసర్జనకు సైతం వెళ్ళలేని పరిస్థితి జనరల్‌ బోగిల్లో కనిపిస్తోంది. కింద కూర్చునే విషయంలో ప్రయాణికుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మరుగుదొడ్ల దుర్వాసన భరించలేక అనేక మంది ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.  

మౌలిక వసతుల కొరత 
ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం అని గొప్పలు చెబుతున్న రైల్వే శాఖ క్షేత్ర స్థాయిలో వాటి అమలు బాధ్యత తీసుకోవడం లేదు. అనేక స్టేషన్లలో కుళాయిల్లో నీరు వస్తున్నా అవి తాగడానికి ఏ మాత్రం పనిచేయడం లేదు. పగటి పూట శివారు బోగీలకు మండుటెండలో నడిచి ఎక్కాల్సిన పరిస్థితి. ముఖ్యంగా మరుగుదొడ్ల గదులకు తాళాలు వేస్తున్నారు. అత్యవసరమైతే స్టేషన్‌ మాస్టార్‌ వద్ద తాళాలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతోంది. రిజర్వేషన్లు, తత్కాల్‌ విషయానికి వస్తే “క్యూ’లైన్లలో నిలుచున్నా కొంత సమయానికి కోటా అయిపోయిందని సిబ్బంది చెబుతున్నారు. మౌలిక వసతులపై రైల్వే అధికారులు దృష్టి సారించాలని ప్రయాణికులు కోరుతున్నారు.  

ప్రయాణికులకు సౌకర్యాలు కలి్పంచండి 
రైలు ప్రయాణికులకు స్టేషన్లలో తాగునీరు, మరుగుదొడ్ల వంటి కనీస సౌకర్యాలు కలి్పంచాలి. 
కైకలూరు ప్రాంతంలో డబుల్‌ లైన్‌ ట్రాక్‌ వేసిన తర్వాత గూడ్సు రైళ్ళ సంఖ్య పెరిగింది. దీంతో క్రాసింగ్‌ గేట్ల వద్ద ఎక్కువ సమయం ప్రయాణికులు వేచి ఉంటున్నారు. బ్రిడ్జిలు, అండర్‌ గ్రౌండ్‌ వంతెనలు నిర్మించాలి.  
– కోమటి విష్ణువర్థనరావు, వైఎస్సార్‌సీపీ ముదిరాజుల విభాగ అధ్యక్షుడు

జనరల్‌ బోగీల సంఖ్య పెంచాలి 
ప్రయాణికులకు తగ్గట్టుగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళలో జనరల్‌ బోగీల సంఖ్య పెరగడం లేదు. దీంతో మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైల్వేశాఖకు బోగీల సంఖ్య పెంచాలని ప్రయాణికుల నుంచి వినతులు వెళుతున్నాయి. వేసవి సెలవులకు దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని బోగీల సంఖ్య పెంచాలి.  
– చావలి శంకరశాస్త్రి, న్యాయవాది, కైకలూరు  

Advertisement
 
Advertisement
Advertisement