
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులు అంటే ఓటుకు మాత్రమే పనికొస్తారా?. అలాగే, లోకేష్ రెడ్ బుక్‌లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా? అని అడిగారు. పవన్.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తున్న పేరు.. అధికారం వచ్చాక ఎందుకు గుర్తు రావడం లేదని సూటిగా ప్రశ్నించారు.
సుగాలి ప్రీతికి నమ్మకం ద్రోహం పేరుతో విజయవాడలో సుగాలి పార్వతి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సుగాలి పార్వతి మాట్లాడుతూ.. నా కూతుర్ని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఎనిమిది సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నాను. న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయినా తరువాత ఈ కేసును పవన్ కల్యాణ్ గాలికి వదిలేశారు. మొదటి సంతకం సుగాలి ప్రీతి ఫైల్‌పైనే అని అన్నారు. ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
అసెంబ్లీ సమావేశాల్లో నా కూతురు కేసుపై చర్చించాలి. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి సీబీఐ విచారణ జరిపించాలి. సేనతో సేనాని అంటున్నారు.. నా కూతురుకి మాత్రం న్యాయం చేయలేకపోయారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి అనితకు శ్రీకాంత్ పెరవలిపై ఉన్న దృష్టి నా కూతురు విషయంలో లేదు. ఎమ్మెల్సీ అనంత విషయంలో ఉన్న ఆత్రుత నా కూతురు విషయంలో లేదు. గిరిజనులు అంటే ఓటుకు మాత్రమే పనికొస్తారా?. ఎందుకు ఇప్పటి వరకు న్యాయం చేయలేకపోయారని మంత్రి అనితను అడుగుతున్నాను.
గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని నాకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తాను. సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయంపై డిజిటల్ క్యాంపైయిన్ చేస్తాం. నిరాహార దీక్షకి కూడా పూనుకుంటాం. ఎనిమిది సంవత్సరాలు అవిటి తనంతో పోరాటం చేస్తుంటే ప్రభుత్వం స్పందించదా?. లోకేష్ రెడ్ బుక్‌లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా?. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తున్న పేరు.. అధికారంలోకి వచ్చాక ఎందుకు గుర్తులేదు?. జనసేన రాష్ట్ర కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడతాం’ అని వ్యాఖ్యలు చేశారు.
