3, 4 , 5 తరగతులకూ సబ్జెక్టులవారీగా టీచర్లు | Sakshi
Sakshi News home page

3, 4 , 5 తరగతులకూ సబ్జెక్టులవారీగా టీచర్లు

Published Wed, Oct 20 2021 5:04 AM

Subject wise teachers for 3rd 4th 5th classes Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: పాఠశాల విద్య బలోపేతం దిశగా పలు చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రైమరీలో 3, 4, 5వ తరగతుల విద్యార్థులకు సబ్జెక్టులవారీగా బోధనకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు అవసరమైన టీచర్ల సర్దుబాటుతో పాటు ఇతర సదుపాయాల కల్పనకు సన్నాహాలు ప్రారంభించింది. 1, 2 తరగతుల్లో టీచర్, విద్యార్ధుల నిష్పత్తిని 1 : 20 ప్రకారం ఉండేలా చర్యలు చేపడుతోంది. ఉపాధ్యాయ సంఘాలతో సహా అందరి అభిప్రాయాలను అనుసరించి అంతిమంగా విద్యార్థుల సామర్థ్యాల పెంపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించింది.

ఈమేరకు అకడమిక్, పాలన సంస్కరణల ముసాయిదా సిద్ధం చేసి టీచర్ల సంఘాల నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది. సంస్కరణల ద్వారా ఫౌండేషన్‌ స్థాయి నుంచే బలమైన పునాదులతో ఉన్నత స్థాయికి వెళ్లే కొద్దీ విద్యార్ధులు ప్రపంచ పౌరులుగా ఎదిగే అవకాశముంటుందని ఆకాంక్షిస్తోంది. ఇప్పటికే మనబడి నాడు–నేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక మొదలైన కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

సామర్థ్యాలను సాధించేలా
పాఠశాల స్థాయి విద్యార్థులలో అభ్యసన సామర్థ్యాలు ఆయా తరగతులకు తగ్గట్టుగా లేవని, భారీ అంతరం నెలకొందని ‘అసర్‌’ తదితర నివేదికలు వెల్లడించాయి. జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం బాల్య విద్య నుంచి ఉన్నత విద్య వరకు వ్యవస్థలో అత్యున్నత నాణ్యత, సమగ్రత తెచ్చేలా సంస్కరణలు చేపట్టి సామర్థ్యాల లోటును తొలగించాలని నివేదిక సూచించింది. విద్యార్ధులలో సరైన అభ్యసన సామరŠాధ్యలు లేకపోవడానికి ప్రధాన కారణం ప్రాథమిక పాఠశాలల్లో 5 తరగతులకు కలిపి ఒకరిద్దరు టీచర్లతోనే బోధన చేస్తుండడమే. వీరు మొత్తం 18 సబ్జెక్టులను పూర్తి స్థాయిలో బోధించలేకపోతున్నారు. కీలకమైన 3, 4, 5 తరగతుల విద్యార్ధులకు ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్‌ సబ్జెక్టులపై సరైన బోధన జరగడం లేదు.

ఈ నేపథ్యంలో ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్‌కు స్పెషలిస్ట్‌ సబ్జెక్ట్‌ టీచర్లతో బోధన అవసరమని ప్రభుత్వం గుర్తించింది. 1, 2 తరగతులకు కూడా వేర్వేరుగా టీచర్లను నియమించాలని నిర్ణయించింది. పాఠశాల వ్యవస్థ ప్రస్తుతం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలుగా వేర్వేరు ప్రాంతాల్లో విస్తరించి ఉన్నందున వీటినే కొన్ని సర్దుబాట్లతో 1, 2 తరగతుల విద్యార్థులకు వేర్వేరు టీచర్లతో పాటు 3 నుంచి 5 తరగతి విద్యార్ధులకు ప్రత్యేక సబ్జెక్టు టీచర్లతో బోధనకు ప్రతిపాదనలు రూపొందించింది. 

దీని ప్రకారం ఎలా చేస్తారంటే...
హైస్కూలు ఆవరణలో లేదా 250 మీటర్లలోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను హైస్కూలు పరిధిలోకి తెస్తారు. 1, 2 తరగతులకు యథావిధిగా కొనసాగిస్తారు.
► 1, 2 తరగతులకు ఎస్జీటీ టీచర్లను నియమించడంతోపాటు ఉపాధ్యాయులు, 
విద్యార్ధుల నిష్పత్తిని విద్యాహక్కు చట్టాన్ని అనుసరించి 1:30గా నిర్దేశించినప్పటికీ మెరుగైన ఫలితాల కోసం 1 : 20 ప్రకారం పరిగణలోకి తీసుకుంటారు.
► హైస్కూలులో 3 నుంచి 10వ తరగతి వరకు కొనసాగించడంతో పాటు ప్రాథమిక పాఠశాలల్లోని టీచర్లను హైస్కూలులోకి తెస్తారు. ప్రాథమిక పాఠశాలల్లో జూనియర్‌గా ఉన్న ఎస్జీటీలను 1, 2 తరగతుల బోధనకు కేటాయించి సీనియర్‌ ఎస్జీటీలను హైస్కూలు పరిధిలోకి తెస్తారు. 3, 4, 5 తరగతులకు ఆపై తరగతులకు మాదిరిగానే సబ్జెకుల వారీగా టీచర్లను నియమించి బోధన కొనసాగిస్తారు. హైస్కూళ్లలో 3, 4, 5 తరగతులకు వీలుగా వసతి సదుపాయాలు లేని పక్షంలో ఆయా తరగతుల విద్యార్ధులను ప్రాథమిక పాఠశాలల్లోనే ఉంచి హైస్కూలు సబ్జెక్టు టీచర్ల ద్వారా బోధన నిర్వహిస్తారు. సరిపడా లేకుంటే మిగులు టీచర్లను సర్దుబాటు చేస్తారు. ఇలా ప్రతిపాదనలు రూపొందించిన విద్యాశాఖ టీచర్ల సంఘాలు, ఇతరుల అభిప్రాయాలను, సూచనలను సేకరిస్తోంది. వీటిని పరిగణలోకి తీసుకొని ఈ నెలాఖరు నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేసి నవంబర్‌ 1వతేదీ నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తేవాలని భావిస్తోంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement