కౌలు రైతుల రుణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

కౌలు రైతుల రుణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: సీఎం జగన్‌

Published Thu, Sep 9 2021 11:40 AM

State Level Bankers Committee Meeting Chaired By CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన క్యాంప్‌ కార్యాలయంలో 216వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం గురువారం జరిగింది. ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘కోవిడ్‌లాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్న బ్యాంకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. గడచిన 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా 2019–20లో దేశంలో పన్నుల ఆదాయం మొత్తం 3.38శాతం తగ్గింది. మరుసటి ఏడాది అంటే 2020–21లో కూడా కోవిడ్‌ విస్తరణను అడ్డుకోవడానికి లాక్‌డౌన్, ఇతరత్రా ఆంక్షల కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగమనం కొనసాగింది’’ అన్నారు.

‘‘దేశ జీడీపీ వృద్ధిరేటు 7.25శాతం మేర పడిపోయింది. మొదటి త్రైమాసికంలో అయితే 24.43 శాతం మేర జీడీపీ వృద్ధిరేటు పడిపోయింది. ఈ క్లిష్ట సమయంలో బ్యాంకర్ల సహకారం కారణంగా దేశంతో పోలిస్తే ఏపీ సమర్థవంతమైన పనితీరు చూపిందనే చెప్పొచ్చు. 2020–21లో దేశ జీడీపీ 7.25 శాతం మేర తగ్గితే ఏపీలో 2.58 శాతానికి పరిమితమైంది. ఇందులో కీలక పాత్ర పోషించిన బ్యాంకర్లను అభినందిస్తున్నాను’’ అన్నారు సీఎం జగన్‌.

‘‘గతేడాది ఇదే పీరియడ్‌తో పోలిస్తే టర్మ్‌ రుణాలు రూ. 3,237 కోట్లు తక్కువగా నమోదయ్యాయని.. వ్యవసాయరంగానికి 1.32 శాతం తక్కువగా రుణ పంపిణీ ఉన్నట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది. అదే సమయంలో పంట రుణాలు 10.49 శాతం అధికంగా ఇచ్చినట్టు కనిపించడం సంతోషదాయకం’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

కౌలు రైతుల రుణాలపై ప్రత్యేక దృష్టి
‘‘కౌలు రైతులకు రుణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని బ్యాంకర్లను కోరుతున్నాను. ఇప్పటివరకూ 4,91,330 క్రాప్‌ కల్టివేటర్‌ రైట్‌కార్డ్స్‌ (సీసీఆర్‌సీ)లను ఇచ్చాం. వీరికి సీసీఆర్‌సీ కార్డులను ఇవ్వడమే కాదు, ఆ డేటాను ఈ–క్రాపింగ్‌లో పొందుపరిచాం. వీరంతా నిజంగా పంటను సాగుచేస్తున్న రైతులు. వీరి విషయంలో బ్యాంకర్లు ముందుకు వచ్చి, వారికి రుణాలు ఇవ్వాలి’’ అని సీఎం జగన్‌ సూచించారు.

ఆర్బీకేలు– విత్తనం నుంచి విక్రయం వరకూ...
‘‘రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాం. విత్తనం నుంచి పంట విక్రయం దాకా రైతులను ఇవి ముందుండి నడిపిస్తాయి. ఆర్బీకేల్లోనే ఈ–క్రాపింగ్‌ కూడా చేస్తున్నాం. సాగు చేస్తున్న కమతం వద్దే రైతును నిలబెట్టి ఫొటో తీసి, జియో ట్యాగింగ్‌చేసి మరీ ఈ– క్రాపింగ్‌ చేస్తున్నాం. పంటను సాగుచేస్తున్న రైతుకు డిజిటల్‌ రశీదే కాదు, భౌతిక రశీదు కూడా ఇస్తున్నాం’’ అని సీఎం జగన్‌ తెలిపారు. 

ఆర్బీకేలు–బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు
‘‘ఇప్పటికే బ్యాంకర్లు 9,160 ఆర్బీకేలను మ్యాపింగ్‌ చేసి అక్కడ  బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లను పెట్టాలని నిర్ణయించడమే కాక.. ఇప్పటికే 6,538 కరస్పాండెంట్లను పెట్టడం ప్రశంసనీయం. ఆ బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌ ఆర్బీకేను వినియోగించాలి.. అలాగే బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌ సేవలు ఆర్బీకే వినియోగించుకోవాలి. ఈ–క్రాపింగ్‌ ప్రక్రియలో బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌ భాగం కావాలి’’ అన్నారు సీఎం జగన్‌. 

‘‘బ్యాంకింగ్‌ విషయంలో వైయస్సార్‌ జిల్లాలో 100 శాతం డిజిటలైజేషన్‌ పూర్తిచేశామని చెప్తున్నారు. బ్యాంకింగ్‌ రంగంలో డిజిటలైజేషన్‌ అంటే గ్రామాల్లోని ఆర్బీకేల్లో ఉన్న బ్యాంకింగ్‌ బిజినెస్‌ కరస్పాండెంట్లు.. బ్యాంకులుగా మారినప్పుడే డిజిటలైజేషన్‌ దిశగా గొప్ప అడుగు వేసినట్టు. వ్యవసాయానికి సంబంధించి రుణాలు ఇవ్వడం, ఈ– క్రాపింగ్‌ ద్వారా వారికి రుణాలు ఇవ్వడం.. ఇవన్నీ ఆర్బీకేల్లోని బిజినెస్‌ కరస్పాండెంట్ల ద్వారా చేయాలి. సంపూర్ణ డిజిటలైజేషన్‌కు ప్రతిరూపాలుగా ఆర్బీకేలను బ్యాంకర్లు తీర్చిదిద్దాలి’’ అని సీఎం జగన్‌ కోరారు. 

31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు
దేశంలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల మంది మహిళలకు ఇళ్లపట్టాలు రిజిస్ట్రేషన్‌చేసి ఇచ్చాం. ఇప్పటికే 10 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం ప్రారంభం అయ్యింది. మొదటి విడతలో 15 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం చేస్తున్నాం. ఒక్కో లబ్ధిదారునికి కనీసంగా రూ.4–5లక్షల ఆస్తిని సమకూరుస్తున్నాం. ఇంటి నిర్మాణంకోసం కనీసం ఒక్కొక్కరికి రూ.35వేల రుణం ఇచ్చే దిశగా బ్యాంకులు అడుగులు ముందుకేయాలి. దీనివల్ల ఇళ్ల నిర్మాణంలో వారికి తగిన తోడ్పాటు లభిస్తుంది. బ్యాంకులు 3 శాతం వడ్డీకి ఇస్తే, మిగిలిన వడ్డీని ప్రభుత్వం భరిస్తుంది. దీనిపై బ్యాంకులు చురుగ్గా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’’ అన్నారు సీఎం జగన్‌.

జగనన్న తోడు– చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు
‘ఇప్పటి వరకు 9.05 లక్షలమంది చిరువ్యాపారులు జగనన్న తోడు ద్వారా లబ్ధి పొందారు. లబ్ధిదారులందరికి రూ.10వేల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. దీనిపై వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ప్రతి ఆరునెలలకు ఒకసారి కొత్తగా దరఖాస్తులు తీసుకోవడంతోపాటు, అందులో అర్హులైన వారికి రుణాలు మంజూరు ప్రక్రియ కొనసాగాలి. దీనిపై బ్యాంకులు దృష్టిసారించాలి’’ అన్నారు సీఎం జగన్‌.

‘‘ఎంఎస్‌ఎంఈలకు తోడుగా నిలవాలని బ్యాంకర్లను కోరుతున్నాను. ఒక్కో పరిశ్రమ కనీసం 10 నుంచి 20 మందికి ఉపాధినిస్తున్నాయి. వీరికి తగిన తోడ్పాటు అందించాలని బ్యాంకర్లను కోరుతున్నాను’’ అన్నారు సీఎం జగన్‌. ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు హాజరయ్యారు. 

ఇవీ చదవండి:
శిశు మరణాలకు కళ్లెం
AP: ఇక రోజూ బులెటిన్‌ బోర్డు

Advertisement
 
Advertisement
 
Advertisement