పాజిటివ్‌ వ్యక్తులకు ‘దివ్య’ కషాయం

Special Story On Immunity Boosting Tips For Corona - Sakshi

రోగనిరోధకశక్తి పెంపొందించుకోవడమే ఉత్తమం

పౌష్టికాహారం, వ్యాయామం, యోగాతో ఆరోగ్యం

మనోధైర్యంతోనే వైరస్‌పై విజయం

చిత్తూరు కలెక్టరేట్‌: కరోనా మహమ్మారి కమ్మేస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తోంది.అడ్డుకునేందుకు మందులు లేకపోవడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. వైరస్‌ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాయామం, యోగా, పౌష్టికాహారం తీసుకుని రోగనిరోధకశక్తిని పెంపొందించుకోవడమే ఉత్తమ మార్గంగా మారింది. అలాగే హెర్బల్‌ కషాయం వైపు సమాజం మొగ్గుచూపుతోంది. ఇమ్యూనిటీని సాధించేందుకు దివ్య ఔషధంగా భావిస్తోంది. ఈ క్రమంలో జిల్లాలోని కోవిడ్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పాజిటివ్‌ వ్యక్తులకు సైతం కషాయం అందించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది. 

ఇది వరకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వెంటనే ఆస్పత్రికి, మెడికల్‌షాపుకు వెళ్లి మందులు తెచ్చుకునేవారు. ఇప్పుడు కరోనా ప్రభావంతో ఇంటికే పరిమితమవ్వాల్సిన పరిస్థితి. దీంతో మందుల దుకాణాలకు వెళ్లేవారి సంఖ్య తగ్గుతోంది. ఆరోగ్య సమస్య తలెత్తితే ఇంట్లో తయారు చేసే కషాయంతో వ్యాధి లక్షణాలను తగ్గించుకునే యత్నం చేస్తున్నారు. సోషల్‌ మీడియా, యూట్యూబ్‌లో వెతికి మరీ గృహవైద్యం వైపు మొగ్గుచూపుతున్నారు.  

పాజిటివ్‌ వ్యక్తులకు కషాయం..
కరోనా తీవ్రత తక్కువగా ఉన్న వారి కోసం కోవిడ్‌ కేర్‌ సెంటర్లు ఉన్నాయి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి ఐసొలేషన్‌ వార్డులు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా చికిత్సను అందజేస్తున్నారు. వైరస్‌ బారిన పడిన వారిలో లక్షణాలు లేకుంటే హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. జిల్లాలోని తిరుపతి, చిత్తూరు  కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, ఐసోలేషన్‌ వార్డుల్లో చికిత్సలు పొందుతున్న కరోనా పాజిటివ్‌ వ్యక్తులకు ప్రత్యేకంగా కషాయం పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్‌ నారాయణభరత్‌గుప్తా తెలిపారు. 
 
ఐసొలేషన్‌లో అందించే ఆహారం..
ఐసోలేషన్‌ వార్డుల్లోని రోగులకు ఉదయం 6.30 గంటలకు పొంగల్, ఇడ్లీ, వడ, కిచిడీ, ఉప్మా అల్పాహారంగా ఇవ్వడంతో పాటు కషాయం అందించేందుఉకు చర్యలు చేపడుతున్నారు.
మధ్యాహ్నం 1–2 గంటల మధ్య పప్పు, సాంబారు, పెరుగు, కోడిగుడ్డు, అరటిపండుతో భోజనం.
సాయంత్రం 4–5 గంటల మధ్య రాగిజావ, ఖర్జూరం, బాదం పప్పు, రాత్రి 7.30 నుంచి 8.30 గంటల మధ్య పప్పు, సాంబారు, చపాతీ, పూరీ, ఇడ్లీ, దోశ, పెరుగు అన్నం, కోడిగుడ్డు అందజేస్తారు.  

నిత్యం పాటించాల్సిన జాగ్రత్తలు
జ్వరం : థర్మామీటర్‌తో రోజుకు మూడు సార్లు చూసుకోవాలి.
ఆక్సిజన్‌/పల్స్‌రేట్‌ : పల్స్‌ ఆక్సీమీటర్‌ ద్వారా రోజుకు మూడు సార్లు చూసుకోవాలి.
ఆహారం : వైద్యులు సూచించిన పౌష్టికాహారంతో పాటు, పండ్లు,  

2 వారాలపాటు వాడాల్సిన మందులు
విటమిన్‌– సి 500 ఎంజీ : ఒక ట్యాబ్లెట్‌ రోజుకు రెండుసార్లు : ఉదయం ఒకటి, రాత్రి ఒకటి (తిన్న తర్వాత)
విటమిన్‌–డీ : ఒక ట్యాబ్లెట్‌ రోజుకు ఒకసారి : ఉదయం తిన్న తర్వాత
మల్టీ విటమిన్‌– జింక్‌ :  ఒక ట్యాబ్లెట్‌ రోజుకు రెండుసార్లు : ఉదయం ఒకటి, రాత్రి ఒకటి (భోజనం తర్వాత)
పారాసిట్‌మాల్‌ 500 ఎంజీ లేదా 650 ఎంజీ : రోజుకు రెండు సార్లు (ఉదయం ఒకటి, రాత్రి  ఒకటి భోజనం తర్వాత) 

జలుబు ఉంటే 3 నుంచి 5 రోజులపాటు వాడాల్సినవి
సిట్రిజన్‌ : ఒక మాత్ర రోజుకు ఒకసారి తిన్న తర్వాత 
అజిత్రోమైసిన్‌ 500 ఎంజీ :  ఒక మాత్ర రోజుకు ఒకసారి రాత్రి తిన్న తర్వాత  

వైరల్‌ మందులు 5 రోజులపాటు వాడాలి
హైడ్రాక్సీక్లోరోక్విన్‌ 200 ఎంపీ :  ఒక మాత్ర రోజుకు రెండు సార్లు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి (తిన్న తర్వాత)  

విరేచనాలు తగ్గేందుకు
స్పోరోలాక్‌ : డీఎస్‌ టాబ్లెట్‌ రోజుకు రెండు సార్లు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి తిన్న తర్వాత 

గ్యాస్‌/ కడుపులో మంట తగ్గేందుకు...
ఫాంటాసిడ్‌ డీఎస్‌ఆర్‌ : రోజుకు ఒక మాత్ర ఉదయం తినకముందు.  

రోగనిరోధక శక్తికి చిట్కాలు 
ప్రతి రోజూ ఉదయం 10 గ్రాముల చ్యవన్‌ ప్రాసం తీసుకోవాలి
హెర్బల్‌ టీ, తులసి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, శొంటి వేసిన డికాక్షన్‌ తాగాలి. రుచి కోసం అందులో బెల్లం, నిమ్మరసం వేసుకోవచ్చు.
రోజుకు రెండుసార్లు ఎండు ద్రాక్ష తినాలి.
150 మిల్లీలీటర్ల వేడిపాలలో అర టీస్పూన్‌ పసుపు వేసుకుని రోజుకు ఒకటి, రెండుసార్లు తాగాలి.
గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటివి ఉంటే పసుపును వేడిపాలు లేదా వేడి నీటిలో కలుపుకుని తాగాలి.
రోజూ ఏ సమయంలో అయినా గోరువెచ్చని నీటినే సేవించాలి.
వంటకాల్లో పసుపు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి తప్పక వినియోగించాలి.
కృష్ణ తులసి ఆకుల రసంలో తేనె కలిపి తీసుకోవాలి.
పసుపులో అల్లం వేసి ఉడికించి ఫిల్టర్‌ చేసిన నీటిని తాగాలి.
నువ్వుల నూనె, కొబ్బరినూనె, నెయ్యి చుక్కలను ఉదయం, సాయంత్రం ముక్కు రంధ్రాల్లో వేసుకోవాలి.
నువ్వులనూనె, కొబ్బరి నూనె ఒక స్పూన్‌ మేర నోట్లో వేసుకుని పుక్కిలించి ఉమ్మివేయాలి.
తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు మాస్క్‌ ధరించకుంటే కనీసం చేతి రుమాలు అయినా అడ్డుపెట్టుకోవాలి.
ప్రతి 12 గంటలకు ఒకసారి చేతులు శుభ్రం చేసుకోవాలి, ఆరబెట్టుకోవాలి.
రోజూ అరగంట పాటు యోగా, ప్రాణాయామం చేయాలి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top