Sakshi News home page

రాతిలో పోత పోసిన లేపాక్షి అందాలు

Published Tue, Jan 16 2024 4:27 PM

Special Story On Historical Background Of Lepakshi - Sakshi

ఆమధ్య “హంపీ వైభవం" పేరిట వరుసగా వ్యాసాలు రాశాను. అప్పుడు మా లేపాక్షి మనసు చిన్నబుచ్చుకుంది. హంపీ గురించి అన్నన్ని పుస్తకాలు ప్రస్తావిస్తూ వ్యాసాలు రాశావే! నిన్ను పెంచిన లేపాక్షి గురించి పరిశోధించి వ్యాసాలు రాయకపోతే ఎలా? అని లేపాక్షి జనం నన్ను నిలదీశారు. వారి నిలదీతలో అర్థముంది. లేపాక్షిమీద తపన ఉంది. నామీద లేపాక్షికి ఉన్న ఆ హక్కును గౌరవిస్తూ... లేపాక్షి మీద పరిశోధించి రాసిన సాధికారికమయిన పుస్తకాలను, వ్యాసాలను సంవత్సరం పాటు సేకరించాను. రెండు, మూడు కావ్యాలు కాలగర్భంలో కలిసిపోవడం వల్ల దొరకలేదు.

నాకు దొరికిన ప్రచురితమైన నలభై తెలుగు, కన్నడ, ఇంగ్లీషు లేపాక్షి పుస్తకాల నుంచి ప్రధానంగా మూడింటి ఆధారంగా ఈ వ్యాసాలను రాస్తున్నాను. అవి:-
1. లేపాక్షి: రచయిత- ప్రఖ్యాత చారిత్రక పరిశోధకుడు ఆమంచర్ల గోపాలరావు. ఇంగ్లీషులో దీన్ని మోనో గ్రాఫ్ పరిచయ వ్యాసంగా పేర్కొన్నా పరిశోధన స్థాయి గ్రంథం ఇది. 1969లో ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడెమీ ప్రచురణ.
2. లేపాక్షి ఆలయం: రచయిత- హిస్టరీ ప్రొఫెసర్ వి కామేశ్వర రావు, ఎస్ వీ యూనివర్సిటీ, తిరుపతి. పరిశోధన గ్రంథం. 1987 ప్రచురణ.
3. త్యాగశిల్పం..పద్య, గద్య కావ్యం: కర్ణాటక ఉన్నత న్యాయస్థానంలో కీలకమైన పదవిలో పనిచేస్తుండిన తెలుగు పద్యప్రేమికుడైన లంకా కృష్ణమూర్తి పద్యాలు; లేపాక్షి ఓరియంటల్ కాలేజీలో తెలుగు అధ్యాపకుడు, అష్టావధాని పమిడికాల్వ చెంచు సుబ్బయ్య శర్మ(మా నాన్న) గద్యం. ఇద్దరూ కలిసి రాసినది. 1975 ప్రచురణ.

ఈ పుస్తకాలేవీ ఇప్పుడు మార్కెట్లో లేవు. ఇలాంటివి పునర్ముద్రణ కావు. లేపాక్షిలో మిత్రుడు లేపాక్షి రామ్ ప్రసాద్ దగ్గర భద్రంగా ఉంటే కొరియర్‌లో తెప్పించుకుని...జిరాక్స్ చేసుకుని వారి పుస్తకాలు వారికి మళ్లీ కొరియర్‌లో వెనక్కు పంపాను. రామ్ ప్రసాద్ తాత వెంకటనారాయణప్ప లేపాక్షికి తొలి సర్పంచ్. ఐదు దశాబ్దాలపాటు లేపాక్షి గుడిని వెలికి తీసుకురావడానికి కల్లూరు సుబ్బారావుతో కలిసి పనిచేశారు.

నాకు తెలిసిన ఆవగింజంత భాషా సాహిత్యాలకు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక విషయాలకు లేపాక్షి బీజం. అక్కడ తాకిన ప్రతిదీ శిల్పమే. చూసిన ప్రతిదీ అందమే. రాతిలో పోతపోసిన ఆ అందాలను, ఆనందాలను చెప్పకపోతే... నాకొచ్చిన నాలుగు మాటలకు విలువ ఉండదు. కాబట్టి ఈ ప్రయత్నం.

వీరభద్రాలయం

లేపాక్షి ఆలయం 16వ శతాబ్దంలో నిర్మితమైనదని మొదట అనుకునేవారు. భారత పురావస్తుతత్వ శాఖ తవ్వకాల్లో బయటపడ్డ శాసనాల ప్రకారం క్రీస్తు శకం 1400 నాటికే లేపాక్షిలో పాపనాశేశ్వర ఆలయం ప్రసిద్ధిలో ఉందని తేలింది. ఇక్కడ వీరభద్రుడు, పాపనాశేశ్వరుడు, దుర్గాదేవి, రఘునాథ స్వామి ప్రధానమైన దేవుళ్లు. "లేపాక్ష్యామ్ పాపనాశనః" అని స్కాంధపురాణంలో ఉన్నది ఈ లేపాక్షి పాపనాశేశ్వర స్వామి ప్రస్తావనే అన్నది ఎక్కువమంది పండితుల అభిప్రాయం. 16వ శతాబ్దిలో విజయనగర రాజులు అచ్యుతదేవరాయలు, అళియరాయల దగ్గర పెనుగొండ మండల కోశాధికారిగా ఉండిన విరుపణ్ణ ఇలవేల్పు వీరభద్రస్వామి. విరుపణ్ణ కలల పంట మనముందున్న ఈ లేపాక్షి కళల పంట.

లేపాక్షికి ఆ పేరెలా వచ్చింది?

త్రేతాయుగం రామాయణ కథతో లేపాక్షి కథ కూడా మొదలవుతుంది. సీతమ్మను రావణుడు అపహరించుకుని ఆకాశమార్గాన తీసుకువెళుతుంటే జటాయువు అడ్డగించి... యుద్ధం చేస్తుంది. కోపగించిన రావణుడు పక్షికి రెక్కలే బలం కాబట్టి... ఆ రెక్కలను నరికేస్తే చచ్చి పడి ఉంటుందని...రెక్కలను కత్తిరిస్తాడు. జటాయువు రెక్కలు తెగి... రక్తమోడుతూ... నేల కూలుతుంది. సీతాన్వేషణలో భాగంగా చెట్టూ పుట్టా; కొండా కోనా; వాగూ వంకా వెతుకుతూ రామలక్ష్మణులు జటాయువు దగ్గరికి వస్తారు. సీతమ్మ జాడ చెప్పి...రాముడి ఒడిలో జటాయువు కన్ను మూస్తుంది. తమకు మహోపకారం చేసిన జటాయువు అంత్యక్రియలను రామలక్ష్మణులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంలో జటాయువును చూసిన వెను వెంటనే రాముడన్న మాట- “లే! పక్షి!” అదే "లేపాక్షి" అయ్యింది.

    పమిడికాల్వ మధుసూధన్‌ 
 

Advertisement

What’s your opinion

Advertisement