ఏపీలో ప్ర‌త్యేకాధికారుల పాల‌న పొడిగింపు

Special Officers Term Extended In Local Bodies In AP - Sakshi

సాక్షి, అమ‌రావ‌తి: స‌్థానిక సంస్థ‌ల్లో ప్రత్యేకాధికారుల పాలనను పొడిగిస్తూ ప్ర‌భుత్వం కీల‌క‌ నిర్ణ‌యం తీసుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 108 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన పొడిగిస్తూ గురువారం నొటిఫికేషన్ జారీ చేసింది. కరోనా వైర‌స్‌ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల క‌మిష‌న్‌ వాయిదా వేయడంతో ఈ నొటిఫికేషన్ జారీ చేస్తున్నట్టు పురపాలకశాఖ ఉత్వ‌ర్వుల్లో పేర్కొంది. నిజానికి ఈ ఏడాది మార్చి 10న కార్పొరేషన్‌లో, జూన్ 30న మున్సిపాలిటీల‌లో, జూలై 2తో నగర పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన ముగిసింది. (ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల)

అయితే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు వాయిదా ప‌డ‌టంతో ప్ర‌భుత్వం.. శ్రీకాకుళంలోని కార్పొరేష‌న్‌లో అక్టోబర్ 10 వరకు మాత్ర‌మే ప్రత్యేకాధికారుల పాలన పొడిగించ‌గా మిగ‌తా అన్ని జిల్లాల్లోని కార్పొరేషన్లలో డిసెంబర్‌ 31 వరకు  పొడిగించింది. శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాల్లో మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలనను డిసెంబర్ 31 వరకు లేదా పాలకవర్గం ఏర్పాటయ్యే వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పురపాలక సంఘాల్లోనూ వ‌చ్చే ఏడాది జనవరి 2 వరకు ప్రత్యేకాధికారుల పాలన పొడిగిస్తున్న‌ట్లు నొటిఫికేషన్‌లో పేర్కొంది. దీంతో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేన‌ట్లే క‌నిపిస్తోంది. (పారదర్శకంగా ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణకే సంస్కరణలు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top