‘డ్రోన్ల’పై స్వల్పకాలిక కోర్సులు

Short Courses on Drones Andhra Pradesh - Sakshi

12 రాష్ట్రాల్లో 116 ఐటీఐలకు అనుమతిచ్చిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌లోని 10 ఐటీఐల్లో అందుబాటులోకి..  

సాక్షి, అమరావతి: డ్రోన్ల రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరాన్ని తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ సహా 12 రాష్ట్రాల్లోని 116 ఐటీఐల్లో ఆరు స్వల్పకాలిక కోర్సుల నిర్వహణకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ అనుమతిచ్చింది. ఈ విషయాన్ని ఇటీవల పార్లమెంట్‌లో వెల్లడించింది. డ్రోన్ల తయారీ, టెక్నీషియన్, పర్యవేక్షణ, నిర్వహణ, కిసాన్‌ డ్రోన్‌ ఆపరేటర్‌ తదితర కోర్సులకు అనుమతిచ్చినట్లు తెలిపింది.

వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఐటీఐల్లో డ్రోన్లకు సంబంధించిన నైపుణ్య శిక్షణ కోర్సులు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరగా.. ఏపీలోని 10 ఐటీఐల్లో స్వల్ప­కాలిక కోర్సులకు కేంద్రం అనుమతిచ్చింది.

అలాగే అసోం, అరుణాచల్‌ప్రదేశ్, బిహార్, చండీగఢ్, గుజరాత్, మహారాష్ట్ర, మణిపూర్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు కూడా కేంద్రం అనుమతి మంజూరు చేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top