ఒక్కడే.. త్రిబుల్‌ యాక్షన్‌!

Seshachalam Forest Red Sandalwood Smuggler In Three Getups - Sakshi

ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధులను చూస్తే ఏమనిపిస్తోంది? చూడటానికి ఒకేలా ఉన్నా డ్రెస్‌లే వేర్వేరుగా ఉన్నాయనుకుంటున్నారు కదూ! అవును నిజమే..ముగ్గురు కాదు..ఒక్కడే..కాకపోతే త్రిబుల్‌ యాక్షన్‌..అవసరం బట్టి ఆర్టీసీ బస్టాండు, తిరుమల, శేషాచలం అడవుల్లో వీళ్లు వేస్తున్న ‘ఎర్ర’గెటప్‌లివి. ఈ తమిళ తంబీల సెటప్‌ చూసి టాస్క్‌ఫోర్స్‌ విస్తుపోయింది. ఈ గెటప్‌ల కథేమిటంటే..

సాక్షి, చంద్రగిరి: ఎర్రచందనం దుంగల కోసం శేషాచలం అడవుల్లోకి ప్రవేశిస్తున్న ఎర్రకూలీలు, స్మగ్లర్లను టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అడ్డుకున్న ఘటన శ్రీవారిమెట్టు వద్ద చోటు చేసుకుంది. టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ ఆంజనేయులు ఆదేశాలతో ఆర్‌ఎస్‌ఐ వాసు, డీఆర్‌ఓ నరసింహారావు బృందాలు మంగళవారం అర్ధరాత్రి శ్రీవారిమెట్టు వద్ద కూంబింగ్‌ చేశాయి. సుమారు 15 మంది స్మగ్లర్లు, కూలీలు అడవిలోకి ప్రవేశిస్తుండటం చూసి వారిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించడంతో వారు పారిపోయారు. వెంటాడి ఒకరిని అదుపులో కి తీసుకున్నారు. చదవండి: భూమి ఇస్తేనే.. తలకొరివి పెడతా..! 

ప్రాధమిక విచారణలో అతడు తిరువణ్ణామలై జిల్లా జమునామత్తూరు, వెళ్లి చెరువుకు  చెందిన వెంకటేశన్‌ అని తేలింది. ఎర్రచందనం దుంగల కోసం వచ్చినట్లు అతడు వెల్లడించాడు. అతని నుంచి స్వాధీనం చేసుకున్న బ్యాగును తనిఖీ చేయగా 3 జతల దుస్తులు లభించాయి. బస్సులో రావడానికి తెల్లటి దుస్తులు, తిరుమలలో తిరిగేందుకు కాషాయం దుస్తులు, అడవిలో వెళ్లేందుకు మరొక దుస్తులు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం స్మగ్లర్‌ వేషధారణకు సంబంధించిన ఫొటోలను టాస్క్‌ఫోర్స్‌ అధికారులు విడుదల చేశారు. నిందితుడిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. సీఐ చంద్రశేఖర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన వారి కోసం గాలిస్తున్నారు. చదవండి: రేపటి వరకు టీచర్ల బదిలీల వెబ్‌ ఆప్షన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top