AP: సర్వర్‌ సమస్యలు క్లియర్‌

Server database Problems Clear In Registration Department At Andhra Pradesh - Sakshi

రిజిస్ట్రేషన్ల శాఖలో సర్వర్‌ సేవల విభజన 

మంగళగిరిలో కొత్త సర్వర్‌ క్లస్టర్‌ 

డేటా బేస్‌ను మార్చే పనిలో అధికారులు 

సోమవారం నుంచి అంతరాయం లేకుండా సేవలు 

గుణదల (విజయవాడ తూర్పు):  సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో తరచూ ఏర్పడుతున్న సర్వర్‌ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ చర్యలు చేపట్టింది. ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా సేవలందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం నుంచి రిజిస్ట్రేషన్ల శాఖ సంబంధిత సర్వర్‌ను నిలిపేసి డేటా బేస్‌ను మార్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిలిచిపోయింది. సోమవారం నుంచి వేగవంతంగా సేవలందించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. 

ఉమ్మడిగా సర్వర్‌ సేవలు 
సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోని సర్వర్‌ విధానం హైదరాబాద్‌ కేంద్రంగా నడుస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సర్వర్‌లు ఇప్పటివరకు ఒకే కేంద్రంగా పని చేస్తున్నాయి. ఈ కారణంగా వందలాది సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు సంబంధించిన సేవలు అందించడంలో సామర్థ్యం సరిపోవడం లేదు. సాంకేతిక సమస్యలు ఏర్పడి కక్షిదారులు అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమన్వయంతో సర్వర్‌ డేటాబేస్‌ విభజన చేస్తున్నారు. 

తొలగనున్న రిజిస్ట్రేషన్‌ కష్టాలు 
సర్వర్‌ సక్రమంగా పనిచేయని కారణంగా ఇప్పటి వరకు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో తరచూ కక్షిదారులు ఇబ్బందులు పడుతున్నారు. గత నెలలో ఏకంగా 20 రోజుల పాటు ఈసీలు, సీసీలు రాక ప్రజలు అవస్థలు పడ్డారు. సకాలంలో రిజిస్ట్రేషన్లు జరగక అమ్మకందార్లు, కొనుగోలు దార్లు సంకట స్థితిలో పడ్డారు. ఈ ప్రభావం బ్యాంక్‌లపై పడటంతో లోన్లు రాక రుణ గ్రహీతలు తటస్థంగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం సర్వర్‌ సామర్థ్యం పెంచటం వల్ల ఈ కష్టాలన్నీ తీరుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 

సర్వర్‌ సామర్థ్యం పెంచేందుకు కృషి 
హైదరాబాద్‌ నుంచి మంగళగిరికి డేటాబేస్‌ సిస్టమ్‌ను మార్చే ప్రక్రియ జరుగుతోంది. ఆదివారం సాయంత్రానికి సర్వర్‌ అప్‌డేట్‌ చేస్తాం. సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. సర్వర్‌ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు భవిష్యత్‌లో నెట్‌వర్క్‌ విధానాన్ని అభివృద్ధి చేస్తాం. 
– నలమల రేవంత్, కార్డ్‌ సూపరింటెండెంట్‌ (విజయవాడ)  

మంగళగిరిలో ‘పై’ డేటా సెంటర్‌ 
గుంటూరు జిల్లా మంగళగిరిలో ‘పై’డేటా సెంటర్‌ను ఏర్పాటు చేశారు. సిస్‌ఫై సంస్థ నిర్వహణలో పై డేటా సెంటర్‌ ఉంటుంది. ఐటీ డిపార్ట్‌మెంట్‌ పర్యవేక్షణలో ఉండే ఈ సంస్థ ద్వారా ఏపీకి సంబంధించిన డేటాబేస్‌ను మార్చారు. రాష్ట్రంలో ఉండే 294 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు ఇకపై మంగళగిరి నుంచే సర్వర్‌ ఆపరేషన్స్‌ జరుగుతాయి. హైదరాబాద్‌ నుంచి మంగళగిరికి డేటాబేస్‌ను మార్చే ప్రక్రియలో సర్వర్‌ సామర్థ్యం పెరిగి సమస్యలు తొలగుతాయని అధికారులు తెలియజేస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top