రోడ్డుపై లారీలను పరిశీలించే విధులూ సచివాలయ ఉద్యోగులకే.. | Secretariat Employees Assigned Duties to Inspect Lorries on the Roads | Sakshi
Sakshi News home page

రోడ్డుపై లారీలను పరిశీలించే విధులూ సచివాలయ ఉద్యోగులకే..

May 2 2026 5:48 AM | Updated on May 2 2026 5:48 AM

Secretariat Employees Assigned Duties to Inspect Lorries on the Roads

టార్పాలిన్‌ లేకుండా వెళ్లే లారీల వివరాలు సేకరించాల్సిందే

సాక్షి, అమరావతి: సచివాలయ వ్యవస్థ లక్ష్యానికి చంద్రబాబు ప్రభుత్వం తూట్లుపొడుస్తోంది. ఉద్యోగులకు సంబంధం లేని బాధ్యతలు అప్పగిస్తూ చిన్నచూపుచూస్తోంది. మొన్నటికి మొన్న పల్నాడు జిల్లాలో సచివాలయ ఉద్యోగులకు పెట్రోల్‌ బంకుల వద్ద విధులు వేసిన ఘటన మరువక ముందే అనకాపల్లి జిల్లాలో వింత విధులు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. ఎన్టీపీసీ యార్డు నుంచి ఫ్లైయాష్‌ నింపుకొని వచ్చి పోయే లారీలను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు పైఅధికారులకు సమాచారమిచ్చేందుకు కాపలా కాసే బాధ్యత కూడా గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల నెత్తినే పడింది.

అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం ఫ్లై ఓవర్‌  వద్ద గత నెల 30 నుంచి ఈ నెల 8 వరకు ఈ పనిచేసేందుకు 18 మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒకరు.. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మరొకరు చొప్పున రోజుకు ఇద్దరు సచివాలయ ఉద్యోగులకు విధులు అప్పగించారు.

సచివాలయ ఉద్యోగులకు లారీలను పరిశీలించే విధులు అప్పగిస్తూ పరవాడ ఎంపీడీవో జారీ చేసిన ఉత్తర్వులు   

ఫ్లై యాష్‌ లోడుతో వెళ్లే లారీలపై టార్పాలిన్‌ లేకపోతే ఆ లారీ వివరాలు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి నివేదించాలని పరవాడ ఎంపీడీవో ఆదేశాలు జారీ చేశారు. ఫ్లై యాష్‌ రవాణాతో ప్రజలు, జంతువులకు ఇబ్బంది కలుగకుండా, ప్రమాదాలను నివారించేందుకే సచివాలయాల ఉద్యోగులకు ఆ బాధ్యతలు అప్పగించామని
ఎంపీడీవో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement