కొత్త జిల్లాల ఏర్పాటును ప్రజల్లోకి తీసుకెళ్లండి

Sajjala Ramakrishna Reddy Says Information Of New Districts Into People - Sakshi

ఈ కార్యక్రమాన్ని వారంపాటు పండగలా నిర్వహించండి

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త జిల్లాల ఏర్పాటు

20రోజుల్లో బూత్‌ కమిటీల నియామకం పూర్తిచేయాలి

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, మేయర్లతో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల 

సాక్షి, అమరావతి: దశాబ్దాల నాటి రాష్ట్ర ప్రజల స్వప్నాలను సాకారం చేస్తూ.. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా 26 జిల్లాలను ఏర్పాటుచేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ చారిత్రక నిర్ణయం తీసుకున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్‌పర్సన్లు, మున్సిపల్‌ చైర్మన్లు, మేయర్లతో శుక్రవారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

కొత్త జిల్లాల ఏర్పాటును ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. వారం రోజులపాటు పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో సజ్జల మాట్లాడుతూ.. జిల్లాల ఏర్పాటుకు సంబంధించి చాలాచోట్ల చారిత్రక ప్రాధాన్యం, ప్రజల నుంచి డిమాండ్లు, సెంటిమెంట్లు ఉన్నాయన్నారు. వాటిని గౌరవిస్తూ కొత్త జిల్లాలను ఏర్పాటుచేస్తామని సీఎం తొలి నుంచి చెబుతూ వచ్చారన్నారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటుచేశారని.. ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీరణ ద్వారా ప్రతి ఇంటి గడప వద్దకు ప్రభుత్వాన్ని తీసుకెళ్లిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు.

కోర్టులో కేసులు లేకపోతే 3 రాజధానుల ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే ఆచరణలోకి వచ్చి ఉండేదన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశారని.. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సజ్జల పార్టీ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రాల్లో, కొత్తగా ఏర్పాటయ్యే రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో స్థానికంగా ఉండే విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాలను భాగస్వాములను చేస్తూ వారంపాటు పండగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.

అధికార యంత్రాంగం కూడా సాంస్కృతిక శాఖ ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పారు. జానపద కళారూపాలు, స్థానిక సంస్కృతులు, సాంప్రదాయాలు వంటివి ఈ కార్యక్రమంలో ఉండేలా చూసుకోవాలన్నారు. సదస్సులు,  సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలన్నారు. వలంటీర్ల సత్కారం, అవార్డులిచ్చే కార్యక్రమాలు కూడా ఇదే సమయంలో జరుగుతాయని.. వాటిని ఈ కార్యక్రమంలో సమన్వయం చేసుకుంటూ నిర్వహించాలని ఆయన సూచించారు. 

వచ్చే నెల నుంచి గడప గడపకూ..
ఇక మే నుంచి ‘గడప గడపకు’ వెళ్లే కార్యక్రమాన్ని చేపట్టాలని సజ్జల కోరారు. బూత్‌ కమిటీలకు సంబంధించి సమీక్ష చేసుకోవాలని.. గతంలో ఉన్నవారు చురుగ్గా లేకపోతే కొత్తవారిని ఎంపిక చేసుకోవాలన్నారు. బూత్‌ సైజ్‌ను బట్టి బూత్‌ కమిటీ నిర్మాణం కన్వీనర్‌ నేతృత్వంలో జరగాలని.. ఈ కమిటీల్లో మహిళలకు సరైన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పార్టీ ప్లీనరీ జూలై 8న నిర్వహిస్తున్న నేపథ్యంలో 20 రోజుల్లోగా బూత్‌ కమిటీల నియామకం పూర్తిచేయాలని సజ్జల సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top