అమరావతి సోకుల పేరుతో ప్రజల కష్టార్జితం దోపిడీ
కొత్త మెడికల్ కాలేజీలకు మాత్రం నిధులుండవు
మిమ్మల్ని రాజకీయంగా సమాధి చేయడం ఖాయం
పేదలపై కక్షతోనే 50 వేల ఇళ్ల పట్టాల రద్దు
చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్
సాక్షి, అమరావతి: అమరావతి పేరుతో ప్రజల కష్టార్జితాన్ని చంద్రబాబు ప్రభుత్వం విచ్చలవిడిగా దోచుకుంటోందని వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ భవనాల అద్దాల కోసం ఏకంగా రూ.2,540 కోట్లు కేటాయించడంపై విస్మయం వ్యక్తంచేశారు. చదరపు అడుగు నిర్మాణానికి రూ.18,500 వరకు ఖర్చుచేయడం ఏ రకమైన పాలనని ప్రశ్నించారు.
ఇదంతా చంద్రబాబు తన అస్మదీయులకు సంపద సృష్టించేందుకు వేసిన నిరంతర దోపిడీ ప్లాన్ అని ఆరోపించారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ కాన్సెప్ట్‌కు ప్రజల్లో వస్తున్న సానుకూలతను తట్టుకోలేకే చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులతో జర్నలిస్టులను, ప్రతిపక్ష నేతలను వేధిస్తే చూస్తూ ఊరుకోబోమని సజ్జల హెచ్చరించారు. ఆయనింకా ఏమన్నారంటే..
చ.అడుగుకి రూ.18,500
అమరావతిలో భవిష్యత్తులో కట్టబోయే అసెంబ్లీ బిల్డింగుల అద్దాల కోసమే రూ.2,540 కోట్లతో కాంట్రాక్టుకు రెడీ అయ్యారు. బిల్డింగ్ వర్క్, ప్లంబింగ్, డ్రైనేజీ వంటి పనులకు చదరపు అడుగుకి రూ.12 వేల నుంచి రూ.14 వేలు అనుకుంటే.. మున్ముందు ఇది ఎంతకు పెరుగుతుందో చెప్పలేని పరిస్థితి. రాజధానిలో నిర్మాణం చేపడుతున్న 52 లక్షల చదరపు అడుగులకి ఈ నిర్మాణ ఖర్చు కూడా కలుపుతుంటే.. చదరపు అడుగుకి రూ.18,500 వరకు ఖర్చవుతుంది. అలాగే, పాలవాగును టవర్స్ మధ్యలో తిప్పుతూ కృష్ణానదిలో కలిపేలా డిజైనింగ్ చేస్తారట. ఆ డిజైనింగ్‌కు మరో రూ.వందో, రెండు వందల కోట్లో ఇస్తారు.
రైతుల సందేహాలకు సమాధానంలేదు
ఏడాదికి రూ.1,000 కోట్లు చొప్పున ఖర్చుపెడితే నాలుగైదేళ్లలో పూర్తయ్యే కొత్త మెడికల్ కాలేజీలకు డబ్బుల్లేవని చెబుతూ మరోవైపు.. అమరావతి కోసం ఇష్టారాజ్యంగా బరితెగిస్తున్నారు. మెడికల్ కాలేజీలు, ఆరోగ్యశ్రీ బకాయిలు, రైతులకు మద్దతు ధరల కోసం నిధుల్లేవని చెబుతూ అమరావతి దోపిడీకి మాత్రం భారీగా నిధులు విడుదల చేయడం విడ్డూరం. ఇది ఏ స్థాయికి వెళ్లిందంటే.. రెండో దశ భూములు తీసుకునే ప్రక్రియలో కూడా దోపిడీకి తెరలేపారు. కానీ, రైతులు తమ సందేహాలను అడిగితే వాటికి సమాధానంలేదు. పైగా.. తమకు కావాల్సిన వాళ్లకు, దగ్గరి వాళ్ల లేఅవుట్లకు మాత్రం ఎడాపెడా అనుమతులిచ్చేస్తున్నారు.
అరెస్టులతో అణచివేయలేరు
పూడి శ్రీహరిని సంబంధంలేని వ్యవహారంలో అరెస్టుచేశారు. ఈ విషయంలో చంద్రబాబు, లోకేశ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి.. ప్రశ్నించే గొంతులను అరెస్టులతో అణచివేయలేరు. మిమ్మల్ని రాజకీయంగా సమాధిచేసే శక్తి వైఎస్సార్‌సీపీకి మాత్రమే ఉంది. ఇక పేదలకు కేటాయించిన 50 వేల ఇళ్ల పట్టాలను నిర్దాక్షిణ్యంగా రద్దుచేయడం చంద్రబాబుకు పేదలపై ఉన్న కక్షను తెలియజేస్తోంది. కాగా, మెంబర్‌షిప్, ఎస్‌ఐఆర్‌పై వైఎస్సార్‌సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉంటూ ఫోకస్ పెంచాలని పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. పార్టీ కీలక నేతలతో శుక్రవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.


