అధ్యాపకులు లేకుండానే రాష్ట్రంలో బీఈడీ కళాశాలల నిర్వహణ
ఆరు వర్సిటీల పరిధిలోని కళాశాలల్లో ఇదే తంతు
ఏటా బీఈడీ ప్రవేశాల్లో 90 శాతానికిపైగా ఇతర రాష్ట్రాలకు చెందుతున్న విద్యార్థులే
రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేసి దొంగ హాజరు నమోదు
ఫలితంగా బీఈడీ కళాశాలల్లో అధ్యాపకులను తొలగిస్తున్న దైన్యం
కనీస ప్రమాణాలను అమలు చేయడంలో చంద్రబాబు సర్కార్ వైఫల్యం
సాక్షి, అమరావతి: బీఈడీ కళాశాలల్లో కనీస ప్రమాణాలను అమలు చేయడంలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైంది. అత్యంత పారదర్శకంగా, విలువలతో సాగాల్సిన బీఈడీ బోధనను అవినీతి, అక్రమాలకు కేంద్ర బిందువుగా మార్చేసింది. ఫలితంగా ఏపీలోని ప్రైవేటు బీఈడీ కళాశాలల తరగతి బోధనలో అధ్యాపకులు ఎక్కడా కనిపించట్లేదు. అసలు విద్యార్థులకు క్లాసులే జరగట్లేదు. దొంగ హాజరుతో విద్యార్థులు లేకుండానే ప్రాక్టికల్స్ నిర్వహించి కేవలం థియరీ పరీక్షలకు హాజరైతే చాలు పాస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్న దౌర్భాగ్య విద్యా విధానం అమలు జరుగుతోంది.
ముఖ్యంగా ఆచార్య నాగార్జున, ఆంధ్రకేసరి, ఆంధ్రవర్సిటీ, రాయలసీమ, యోగివేమన, అంబేద్కర్ వర్సిటీ పరిధిలోని ప్రైవేటు బీఈడీ కళాశాలలు పొరుగు రాష్ట్రాల విద్యార్థులకు సీట్ల వలవేసి రూ.లక్షల్లో ఫీజులు దండుకుంటూ రూ.కోట్లలో వ్యాపారం చేస్తున్నాయి. ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం యథావిధిగా మామూళ్ల మత్తులో జోగుతూ ప్రైవేటు కళాశాలలపై నిఘాను గాలికొదిలేయడం.. విద్యాహక్కు చట్టాన్ని అభాసుపాలు చేస్తోంది.
బీఈడీ పెద్ద వ్యాపారం!
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పరిధిలో 450 బీఈడీ కళాశాలలు ఉంటే వీటిలో 98 శాతంపైగా ప్రైవేటు కళాశాలలే. ఏటా 40 వేలకుపైగా సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. కానీ, కన్వీనర్ కోటాలో కేవలం 4–5 వేలు మాత్రమే భర్తీ అవుతున్నాయి. మిగిలిన సీట్లను ప్రైవేటు యాజమాన్యాలు స్పాట్, కేటగిరీ–బీ కోటాలో రూ.లక్షలు వసూలు చేసుకుని భర్తీ చేసుకుంటున్నాయి. 2024లో 37 వేలు, 2025లో 39 వేల సీట్లు భర్తీ అయితే వీరిలో అత్యధికంగా నాన్ కన్వీనర్ కోటాలో పొరుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉండటం గమనార్హం.
ఇక్కడ ప్రైవేటు బీఈడీ యాజమాన్యాలు ఒడిశా, బీహార్, బెంగాల్, అసోం, మిజోరాం వంటి రాష్ట్రాల్లోని విద్యార్థులకు వలవేసి ఇక్కడ బీఈడీ కోర్సుల్లో చేర్పిస్తున్నారు. విద్యార్థులు కళాశాలలకు హాజరవ్వాల్సిన అవసరం లేకుండా వెసులుబాటు ఇచ్చి రూ.లక్షల్లో ఫీజులు దండుకుంటున్నారు. ప్రాక్టికల్స్, రికార్డ్స్ వంటి విద్యా కార్యక్రమాలకు ప్రత్యేక రేట్లు పెట్టి విద్యార్థులు చేయకుండానే చేసినట్టు రికార్డుల్లో నమోదు చేసి బీఈడీ విద్యను దిగజారుస్తున్నారు.
రోడ్డునపడిన 10 వేల మంది అధ్యాపకులు
పాఠాలు చెప్పే అవసరం లేకపోవడంతో ప్రైవేటు యాజమాన్యాలు అధ్యాపకుల ఉద్యోగాలను సైతం ఊడగొట్టి రోడ్డున పడేశాయి. ఇప్పుడు ఏ ప్రైవేటు బీఈడీ కళాశాలల్లో పాఠాలు చెప్పే వాళ్లు లేరు. వినేవారు లేరు. వీరందరినీ కాగితాలపైనే చూపిస్తూ కనికట్టు చేస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం ముడుపులు దండుకుని గుడ్డిగా అనుమతులు ఇచ్చేస్తూ వ్యవస్థలను నాశనం చేస్తోంది. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఏకంగా 10వేల మందికిపైగా బీఈడీ అధ్యాపకులు రోడ్డున పడ్డారు. వీరిలో అట్టడుగు వర్గాలకు చెందిన వారే అధికం. అధ్యాపకుల విషయంలో ఎన్‌సీఈటీ నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి.
ఫలితంగా పీజీలు, పీహెచ్‌డీలు చేసిన వేలాది మంది అధ్యాపకులు నిరుద్యోగులు మిగిలిపోయారు. రాష్ట్రంలోని 90 శాతానికిపైగా బీఈడీ కళాశాలలు అసలు ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు లేకుండానే నడుస్తుండడం గమనార్హం. కేవలం ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను పెట్టుకుని కళాశాలలు నిర్వహిస్తుంటే ప్రభుత్వం వేడుక చూస్తోంది. రాజధాని సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అధికారులు సీటు నుంచి కదలకుండానే లక్షల్లో ముడుపులు తీసుకుంటూ బీఈడీ కళాశాలల్లో అంతా పారదర్శకంగా ఉందని కాగితాలపై సంతకాలు పెట్టేస్తున్నారు.
జగన్ ప్రభుత్వ సంస్కరణలు నిర్వీర్యం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం బీఈడీ విద్యను గాడిలో పెట్టేందుకు అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో కచ్చితంగా అధ్యాపకుల వివరాలు, సర్టిఫికెట్లతో సహా నమోదు చేయాలని నిబంధన విధించింది. ఫలితంగా అధ్యాపకుల ఆధార్ వివరాల ప్రకారం ఎక్కడ పని చేస్తున్నారో స్పష్టంగా తెలిసేది. ఒక అధ్యాపకుడు ఒకచోటనే పని చేసేవారు. కానీ, ఇప్పుడు జ్ఞానభూమికి తిలోదకాలు ఇవ్వడంతో ప్రైవేటు యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయి.
ఏపీలో డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకుల సర్టిఫికెట్లు తీసుకొచ్చి రెండుమూడు బీఈడీ కళాశాలల్లో తప్పుడు ఆధార్ నంబర్లు ఎంటర్ చేసి జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో నమోదుచేసుకుంటున్నారు. ఇది చాలదన్నట్లు తెలంగాణలో పనిచేస్తున్నవారి జిరాక్స్ సర్టిఫికెట్లు తీసుకొచ్చి జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి అనుమతులు తెచ్చుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి అఫిలియేషన్ ఇవ్వాల్సిన యూనివర్సిటీల అధికారులు రూ. లక్షల్లో ముడుపులు తీసుకుని గుర్తింపులు జారీచేస్తున్నారు.
విచిత్రంగా వయో పరిమితి దాటిన వారిని సైతం అధ్యాపకులుగా చూపిస్తుండటం గమనార్హం. ఇటీవల ప్రభుత్వం ముఖ ఆధారిత హాజరును తప్పనిసరి చేయాలని వాటిని బట్టే అఫ్లియేషన్లు ఇవ్వాలని సర్కులర్ జారీ చేయగా వాటిపై టీడీపీ అనుకూల బీఈడీ కళాశాలలు కోర్టుకు వెళ్లిమరీ తాత్కాలిక ఉపశమనం పొందాయి. ఈలోగా అఫ్లియేషన్లు తంతు ముగించుకోవచ్చని భావిస్తున్నాయి.


