
శ్రీకాళహస్తి మండలంలో అధికార పార్టీ నేత భూఆక్రమణకు యత్నం
ఏర్పేడు: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం గుంటకిందపల్లిలో ఓ సామాన్య రైతు సాగు చేసుకుంటున్న పొలం దురాక్రమణకు అధికార పార్టీ అండతో ఓ వ్యక్తి ప్రయత్నించారు. జేసీబీ సాయంతో పొలంలోకి దౌర్జన్యంగా ప్రవేశించి, పొలంలో ఉన్న రేకుల షెడ్డు, వ్యవసాయ బోరు మోటారును ధ్వంసం చేశాడు. బాధితుని కథనం మేరకు.. గుంటకిందపల్లికి చెందిన పరమేశ్వరి, దేవి, వాణిశ్రీ అనే మహిళల పేరుతో సర్వే నంబరు 8లోని 6.1 ఎకరాల పొలాన్ని 2008లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పేదలకు భూపంపిణీ కింద ఇచ్చారు.
అప్పటి నుంచి ముగ్గురు మహిళలు ఆ పొలానికి చుట్టూ ఫెన్సింగ్, లోపల రేకుల షెడ్డు, బోరుమోటారు వేసుకుని సాగు చేసుకుంటున్నారు. అయితే ఆ భూమి తనదంటూ ఆనంద్ అనే టీడీపీకి చెందిన నేత గురువారం ఎవరూ లేని సమయంలో పొలం వద్దకు చేరుకుని జేసీబీ తీసుకొచ్చి పొలంలోని రేకుల షెడ్డు, బోరుమోటారును కూల్చివేసి ధ్వంసం చేశారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.