Rottela Panduga: భక్తులతో పోటెత్తిన స్వర్ణాల చెరువు

Rottela Panduga Starts From Today in SPSR Nellore - Sakshi

నేటి నుంచి రొట్టెల పండగ ప్రారంభం 

బారాషహీద్‌ దర్గాకు పోటెత్తిన భక్తులు 

స్వర్ణాల చెరువులో కోర్కెల రొట్టెల మార్పిడి సందడి  

మతాలకు, కులాలకు అతీతంగా మతసామరస్యంగా జరిగే రొట్టెల పండగ కరోనా కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది జరుగుతోంది. దీంతో ముందుగానే తీరిన కోర్కెల రొట్టెలు వదిలేందుకు.. కొత్త కోర్కెల రొట్టెలు పట్టుకునేందుకు వచ్చే భక్తులతో బారాషహీద్‌ దర్గా ప్రాంగణం కిటకిటలాడింది. రొట్టెల మార్చుకునే స్వర్ణాల చెరువు భక్తులతో పోటెత్తింది. 

సాక్షి, నెల్లూరు: రొట్టెల పండగ ప్రారంభానికి ముందే భక్తుల రాక ద్విగుణీకృతమైంది. సోమవారం ఉదయం నుంచి స్వర్ణాలచెరువు వద్ద కోర్కెల రొట్టెలను మార్చుకున్నారు. నాలుగు రోజుల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు బారాషహీద్‌ దర్గాకు చేరుకుంటున్నారు. భక్తులు భారీగా రావడంతో దర్గా ప్రాంగణంలో సందడి ప్రారంభమైంది. నగర పాలక సంస్థ, పోలీసు, విద్యుత్, ఆరోగ్యశాఖ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశారు.

ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రొట్టెల పండగ మంగళవారం ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు రొట్టెల పండగ జరుగుతోంది. జాతీయ రహదారుల నుంచి నగరంలోకి ప్రవేశించే మార్గంలో బారాషహీద్‌ దర్గాకు రూట్‌ మ్యాప్‌ సూచిస్తూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దర్గా ప్రాంగణం విద్యుత్‌ వెలుగులు విరజిమ్ముతున్నాయి. దర్గా ఆవరణలో చిన్నారులు ఆడుకునేందుకు ఆట వస్తువులు, జైంట్‌వీల్‌లు ఏర్పాటు చేశారు.

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాగునీటి కేంద్రాలు, స్నానపు గదులు, మరుగుదొడ్లు మహిళలు, పురుషులకు విడివిడిగా ఏర్పాటు చేశారు. భక్తులకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అందుబాటులో 108 వాహనాలు, ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా భారీ జింక్‌షీట్‌లు ఏర్పాటు చేశారు. స్వర్ణాల చెరువు వద్ద భక్తులు ప్రమాదాలకు గురికాకుండా కంచెను ఏర్పాటు చేశారు. చెరువు వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. చెరువులో నీరు మురుగు చేరకుండా ఎప్పటికప్పుడు మోటార్లతో శుద్ధి చేస్తున్నారు.  

15 వేలకు పైగా భక్తులు హాజరు  
దర్గాకు సోమవారం 15 వేల మందికి పైగా భక్తులు హాజరయ్యారు. కోర్కెల రొట్టెలను మార్చుకుని భక్తిశ్రద్ధలతో దర్గాను సందర్శించారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు అధికంగా హాజరయ్యారు. రొట్టెల పండగకు ముందుగానే భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు కూడా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేశారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నారు. 

అధికారుల సమన్వయంతో... 
కార్పొరేషన్, పోలీసు, ఆరోగ్య, విద్యుత్‌శాఖ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్‌ చక్రధర్‌బాబు, ఎస్పీ విజయారావు, కార్పొరేషన్‌ కమిషనర్‌ హరిత, ఇతర శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉద్యోగులకు రొట్టెల పండగ నిర్వహణపై సూచనలు చేశారు. 

అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం 
రొట్టెల పండగకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. క్షేత్ర స్థాయిలో నిత్యం పరిశీలిస్తూ సిబ్బందికి సూచనలు ఇస్తున్నాం. బారాషహీద్‌ దర్గా ప్రాంగణం మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. 24 గంటలు పాటు పోలీసులు నిఘా ఉంటుంది. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాం.   
– చక్రధర్‌బాబు, కలెక్టర్‌

మది నిండా భక్తి, విశ్వాసం
మది నిండా భక్తి, విశ్వాసం. అంతే నమ్మకంగా తీరుతున్న కోర్కెలతో మతసామరస్యానికి ప్రతీకగా రొట్టెల పండగ నిలుస్తోంది. కోరిన కోర్కెలు తీరితే రొట్టెలు వదిలే, పట్టుకునే 
భక్తులతో నెల్లూరు స్వర్ణాల తీరం సంద్రంగా మారింది. ఐదు రోజుల పాటు జరిగే పండగ ప్రారంభానికి ముందే సోమవారం భక్తులు కిటకిటలాడారు. కుల, మతాలకు అతీతంగా భక్తజనం పోటెత్తింది. వివాహం, విద్య, ఆరోగ్యం, ప్రమోషన్, గృహం, ఉద్యోగం, ధనం, సౌభాగ్యం, వ్యాపారం ఇలా అనేక సంతోషాలు తమ కుటుంబాల్లో పరిఢవిల్లాలని ఎన్నెన్నో ఆశలతో వచ్చే భక్తుల నమ్మకానికి ప్రతీకగా ఏటేటా రొట్టెల పండగ విశిష్టత పెరుగుతోంది. 
 – నెల్లూరు(మినీబైపాస్‌) 

చదువు రొట్టె పట్టుకున్నాను 
పదో తరగతి పాస్‌ అవ్వాలని రొట్టెను పట్టుకున్నాను. గతంలో మూడేళ్లుగా రొట్టెల పండగకు వస్తున్నాను. ఈ దఫా చదువు రొట్టెను పట్టుకున్నాను. ఇంతకు ముందు ఆరోగ్య రొట్టెను పట్టుకున్నాం. 
– రేష్మా, హైదరాబాద్‌   

సంతాన రొట్టెను తీసుకున్నా.. 
కర్ణాటకలోని తుమ్ముకూరులో వ్యాపారం చేస్తున్నాను. 13 తరాలుగా మా వంశంలో మగపిల్లలు లేరు. పోయిన సారి ఇక్కడకు వచ్చి మగ పిల్లవాడు కావాలని మొక్కుకున్నాను. ఇదిగో వీడే నా ఒక్కగానొక్క మగ పిల్లవాడు. నా కోరిక తీరింది.  
– మొహ్మద్‌ ఇలియాజ్, తుమ్ముకూరు, కర్ణాటక 

ఆరోగ్య రొట్టె పట్టుకున్నాను 
కర్ణాటకలో కేఎస్‌ఆర్‌టీసీలో కండక్టరుగా పని చేస్తున్నాను. యాక్సిడెంట్‌లో కాళ్లు పోగొట్టుకున్నాను. ప్రాణం మీద ఆశలు వదులు కోవాల్సిందేనని డాక్టర్లు చెప్పారు. అల్లాకు మొక్కుకున్నాను. ఆరోగ్యం మెరుగుపడాలని.. ఇక్కడికి వచ్చాను.  ఆరోగ్య రొట్టెను పట్టుకున్నా.   
– బాబాజానర్, కేఎస్‌ఆర్టీసీ, కండక్టర్, కర్ణాటక 

ఉద్యోగ రొట్టె పట్టుకున్నా.. 
చదువు పూర్తయ్యంది. మంచి ఉద్యోగం రావాలని ఉద్యోగ రొట్టెను పట్టుకున్నాం. ఇంతకు  ముందు మంచిగా చదువు పూర్తి కావాలని కోరుకున్నాం. అది తీరింది. ఇప్పుడు ఉద్యోగ రొట్టె పట్టుకున్నాం.   
– శ్రీవిద్య, ప్రవళ్లిక, నెల్లూరు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top