
అధ్వానంగా ఉన్న ఏలూరు వంగాయగూడెం సెంటర్ నుంచి కేన్సర్ ఆసుపత్రికి వెళ్లే రహదారి
రోడ్డునపడ్డ చంద్రబాబు కూటమి ప్రభుత్వ బండారం
రహదారులు బాగు చేస్తామన్న హామీలన్నీ నీటి మూటలే
చిన్నపాటి వర్షానికే ఛిద్రమైన రోడ్లు
ఊరూరా అదే దుస్థితి
కొన్ని రోడ్లపై ద్విచక్ర వాహనాలు సైతం వెళ్లలేని పరిస్థితి
27,141 కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్లలో సగానికి సగం దెబ్బతిన్న వైనం
కొన్ని చోట్ల కోసుకుపోయి.. ఇంకొన్ని చోట్ల కొట్టుకుపోయి..
కాస్త వర్షానికే రాళ్లు తేలడంతో ముందుకు సాగని ప్రయాణం
చంద్రబాబు ప్రభుత్వ బండారం రోడ్డున పడింది. సంక్రాంతికి నాటికి గుంతలు లేని రోడ్లుగా మారుస్తామన్న సీఎం చంద్రబాబు మాటలు నీటి మీద రాతలుగానే మిగిలాయి. నాలుగు నెలల్లో మళ్లీ సంక్రాంతి వస్తున్నా రాష్ట్రంలో రోడ్ల దుస్థితి మాత్రం మారలేదు. అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో రోడ్లపై అసలు గుంతలు లేకుండా చేస్తామన్న ఎన్నికల హామీని రోడ్డుపాలు చేశారు.
ఎన్నికలకు ముందు కూటమి పార్టీల నేతలు ప్రధానంగా రోడ్లపై టార్గెట్ చేసి ప్రచారం నిర్వహించారు. రహదారులు బాగుంటేనే అభివృద్ధి సాధ్యమని, ఎంత ఖర్చు అయినా సరే రహదారులకు ప్రధమ ప్రాధాన్యం ఇస్తామని గొప్పలు చెప్పారు.

తీరా అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై సాక్షి బృందం విస్తృత స్థాయిలో పరిశీలించింది. ఏ రోడ్డు చూసినా గుంతల మయంగా కనిపించింది. అడుగడుగునా గుంతలు... కోసుకుపోయిన రోడ్లు, కాస్త వర్షానికే కొట్టుకుపోయిన రోడ్లు.. రాళ్లు తేలిన రోడ్లు.. రాష్ట్రం అంతటా ఇవే దృశ్యాలు కళ్లకు కట్టాయి. ఇలాంటి రోడ్లపై గమ్యం చేరడానికి వాహనదారులు అష్టకష్టాలు పడుతుండటం అన్ని ప్రాంతాల్లోనూ కనిపించింది.

రాష్ట్రంలో ఎక్కడికక్కడ రోడ్లపై గుంతలు పెరిగిపోయి.. వాహనాలు గంతులేస్తున్న పరిస్థితి నెలకొంది. కొన్ని రహదారుల్లో వాహనాలు కూరుకుపోయి కనిపించాయి. మరికొన్ని చోట్ల ముందుకు వెళ్లలేని పరిస్థితి కళ్లకు కట్టింది. ఇంకొన్ని చోట్ల అయితే రహదారి ఉందో.. లేదో కూడా తెలియని దుస్థితి.




ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఈ ఏడాదిలో ఆర్‌అండ్‌బీ పరిధిలోని రోడ్లపై గుంతలు పూడ్చటం కోసం ప్రభుత్వం రూ.840 కోట్లు ఖర్చు చేశామని చెబుతోంది. అయితే ఇందులో వాస్తవంగా పదో వంతు కూడా ఖర్చు చేయలేదని ఆర్‌అండ్‌బి వర్గాల సమాచారం. మిగతాదంతా కూటమి పార్టీల నేతలే జేబులో వేసుకున్నట్లు తెలిసింది. ఇక పంచాయతీరాజ్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల సంగతి అయితే చెప్పాల్సిన పనిలేదు. దారుణంగా మారిపోయాయి. రోడ్డుపై తారు అన్నదే కనిపించకుండా పోయింది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఆటోలు, కార్లు, లారీలు బోల్తా పడక తప్పదన్నట్లు రహదారులు రూపు మారిపోయింది. –సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్


ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలో ఎరుకుపాడు–గంపలగూడెం మధ్య ఏడాది క్రితం ఆర్ అండ్ బీ రహదారిని కొత్తగా వేశారు. నిన్నా, మొన్నటి వర్షానికే కొట్టుకు పోయింది.


పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం 75 త్యాళ్యూరు గ్రామంలోని జెడ్పీ పాఠశాల సమీపంలోని వంతెన వద్ద కోతకు గురై ప్రమాదకరంగా మారిన రోడ్డు. కనీసం ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లలేని దుస్థితి. ఎప్పుడు కుప్పకూలుతుంతో అన్నట్లుంది.

