
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. టూరిస్టు బస్సు అదుపు తప్పి పంట కాల్వలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. దీంతో, వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
వివరాల ప్రకారం.. గుంటూరులోని ఫిరంగిపురం మండలం మేరికపూడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. టూరిస్టు బస్సు అదుపు తప్పి కాల్వలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. కాగా, సదరు బస్సు గుంటూరు నుండి నరసరావుపేట వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలిసింది.
ఇక, క్షతగాత్రులు అందరూ రాజస్థాన్‌కు చెందిన వారు అని సమాచారం. తీర్థయాత్రలో భాగంగా వీరంతా అన్నవరం వెళ్లి వస్తుండగా బస్సు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే, ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.