పుత్తడి బొమ్మలకు పుస్తెల బంధం..

Rising Child Marriage in Nellore District - Sakshi

బడికెళ్లాల్సిన బాలికలు పెళ్లి పీటలెక్కుతున్నారు. పుస్తకాలు పట్టాల్సిన అమ్మాయిలు పుస్తెలతాడుతో అత్తారింటి బాట పడుతున్నారు. పట్టుమని 15 ఏళ్లు నిండకుండానే భార్యగా, తల్లిగా బాధ్యతలను మోస్తున్నారు. సంసార మధురిమలు తెలియకుండానే జీవితాన్ని మోస్తున్నారు. పేదరికం ఒక వైపు, ఆడపిల్ల భారం తీరుతుందని కన్నోళ్లే సంసార సాగరంలోకి నెట్టేస్తున్నారు. ఎక్కువగా ఇలాంటి పరిస్థితులు గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల్లోనే జరుగుతున్నాయి.    

సాక్షి, నెల్లూరు: సాంకేతికత రోజు రోజుకూ పెరుగుతున్నా, ఆధునిక సమాజం వైపు అడుగులు వేస్తున్నా జిల్లాలో మాత్రం బాల్య వివాహాల సంఖ్య నానాటికి పెరుగుతోంది. పెళ్లంటే ఏమిటో కూడా తెలియని వయసులో బాలికలను అత్తారింటికి పంపి, వారి బంగారు భవిష్యత్‌కు తల్లిదండ్రులే సంకెళ్లు వేస్తున్నారు. మరికొందరు ఆడ పిల్లలను బరువుగా భావించి వదిలించుకునే ఆలోచనతో పెళ్లిపీట లెక్కిస్తున్నారు. ఇలాంటి పరిణామాలతో మానసికంగా, శారీరకంగా బాలికలు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నా.. బాల్య వివాహాలు ఆగడం లేదు.

ప్రేమ వివాహాలు, మేనరికాలు, వలసలు, వరుడికి ఉద్యోగం ఉందని పరిపక్వత లేని బాల్యాన్ని మాంగల్యంలో బందీ చేస్తున్నారు. ఎక్కువగా గిరిజన, మత్స్యకార కుటుంబాల్లో ఆడ పిల్లలను ఇంటి వద్ద ఉంచలేక 18 ఏళ్ల లోపే వివాహాలు జరిపిస్తున్నారు. పిల్లలు చదువుకునే సమయంలో ప్రేమ, పెళ్లి వైపు వెళ్తే కుటుంబం పరువు పోతుందనే భయంతో మరి కొందరు ఇలా చేస్తున్నారు.   

అడ్డుకట్టకు మార్గాలు  
గ్రామ స్థాయిలో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, ఐసీడీఎస్‌ సెక్టార్‌ పరిధిలో సూపర్‌వైజర్, సీడీపీఓ, మండల స్థాయిలో తహసీల్దార్లు, రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో ఆర్డీఓలు బాల్యవివాహాలు అడ్డుకునే అధికారం ఉంది. ఎవరైనా 1098 ఫోన్‌ చేసి ఫిర్యాదు ఇవ్వొచ్చు. ఇప్పటికే సమగ్ర బాలల పరిరక్షణ పథకం కింద ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ స్థాయి సమావేశాల్లో అంగన్‌వాడీ కార్యకర్తల మండల మహిళా సమాఖ్య, సంరక్షణ అధికారుల సమన్వయంతో 18 ఏళ్లు నిండుకుండానే పెళ్లిళ్లు చేయకూడదనే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  

వివాహ రిజిస్ట్రేషన్‌ తప్పని సరి 
బాల్యవివాహాల నిరోధానికి అధికారులు ప్రత్యేక ప్రణాళిక చేపట్టారు. జిల్లాలోని అన్ని, రెవెన్యూ డివిజనల్, ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ పరిధిలోని సీడీపీఓలు వివాహ రిజిస్ట్రేషన్‌ చట్టం -2002 అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని జీఓ జారీ చేశారు. గ్రామ, వార్డు స్థాయిలో మహిళ సంరక్షణ కార్యదర్శి ద్వారా తప్పక వివాహ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలన్ని ఆదేశాలిచ్చారు. పెళ్లికి ముందే వరుడు, వధువు, ఇద్దరు సంతకం చేసిన దరఖాస్తు ఫారం, నివాస ధ్రువీకరణ పత్రాలు, వయస్సు నిర్ధారణకు ఆధార్‌ , రెండు పాస్‌ఫొటో సైజు ఫొటోలు, వివాహ పత్రికలతో కలిసి దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే జైలు శిక్ష, జరిమానా కూడా ఉంటుంది. ఇకపై జిల్లాలో బాల్య వివాహాలు నిరోధించేందుకు కఠినంగా చర్యలు చేపడుతాం.  
– రోజ్‌మాండ్,  ఐసీడీఎస్‌ పీడీ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top