నూనెల ధరలు పెరుగుదల

Rise in oil prices with the impact of Corona - Sakshi

ఆగిన దిగుమతులు

లాక్‌డౌన్‌తో భారీగా పెరిగిన వాడకం

దగ్గరకొస్తున్న పండగలతో గృహిణుల్లో ఆందోళన

సాక్షి, అమరావతి: దసరా దగ్గర కొస్తున్నందున పిండివంటలు చేయమని ఇంటిల్లిపాది కోరటంతో విజయవాడ పటమటలో నివాసం ఉండే ఏ.లక్ష్మి మార్కెట్‌లో నూనె ధరలు చూసి నివ్వెరపోయారు. లాక్‌డౌన్‌కు ముందుతో పోలిస్తే ఇప్పుడు వంట నూనెల ధరలు లీటర్‌కు ఏకంగా రూ.27 నుంచి రూ.45 వరకు పెరిగాయి. పిండివంటలు కావాలని పిల్లలు, భర్త పట్టుబట్టడంతో ఏం చేయాలో ఆమెకు తోచడం లేదు. 

లాక్‌డౌన్లతో పోటీగా నూనె ధరలు.. 
కరోనా ప్రభావం ఆర్థిక రంగంతోపాటు వంట నూనెలపై కూడా పడింది. లాక్‌డౌన్లతో పోటీగా వీటి ధరలు కూడా పెరిగాయి. నూనె దిగుమతులు తగ్గడం, అంతా ఇళ్లల్లోనే ఉంటున్నందున దేశీయంగా వాడకం ఎక్కువ కావడం ధరల మంటకు కారణమని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. మన దేశానికి మలేసియా, ఇండోనేసియా నుంచి పామాయిల్, అర్జెంటైనా, బ్రెజిల్‌ నుంచి సోయా ఆయిల్, రష్యా, యుక్రేయిన్‌ నుంచి సన్‌ఫ్లవర్‌ నూనెలు దిగుమతి అవుతాయి. దేశంలో సగటున ఏటా 16 కిలోల చొప్పున నూనె వినియోగిస్తున్నట్లు అంచనా.

పుంజుకుంటున్న వ్యాపారాలతో గిరాకీ.. 
మరోవైపు లాక్‌డౌన్‌ ఆంక్షలు క్రమంగా తొలగడం, ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్లతోపాటు బిస్కెట్ల తయారీ కారణంగా నూనెల వాడకం పెరిగింది. దీనికి తగ్గట్టుగా సరఫరా లేక పోవడంతో ధరలు ఎగబాకుతున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. 

గతేడాదితో పోలిస్తే... 
ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో నూనెలు రూ.127 నుంచి రూ.145 వరకు ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయంలో లీటర్‌ నూనె రూ.85 నుంచి రూ.100 మధ్యలో ఉండటం గమనార్హం. ఇక తొలిసారి లాక్‌డౌన్‌ విధించిన మార్చి నెలలో రూ.వంద నుంచి రూ.110 మధ్య ఉన్న నూనెల ధరలు ఇప్పుడు మండిపోతున్నాయి. 

రిఫైన్డ్‌పై భారీగా.. 
జూలైలో 5 కిలోల సన్‌ఫ్లవర్‌ రిఫైన్డ్‌ ఆయిల్‌ టిన్ను రూ.495 ఉండగా ఇప్పుడది ఏకంగా రూ.580 దాటింది. ప్రస్తుతం సన్‌ఫ్లవర్‌ రిఫైన్డ్‌  ఆయిల్‌ విజయా బ్రాండ్‌ లీటర్‌ ప్యాకెట్‌ రూ.127 ఉండగా గత నెలలో ఇది రూ.105గా ఉంది. 

ధరల మంటకు కారణాలు.. 
► దేశీయంగా ఉత్పత్తి అవుతున్న నూనెలు మన అవసరాలకు సరిపోకపోవడం, దీర్ఘకాలిక లాక్‌డౌన్‌తో  నూనెల వినియోగం పెరగడం.  
► కరోనా సమయంలో ప్రజలు తక్కువ కొవ్వు పదార్థాలున్న నూనెలపై మొగ్గు చూపడం వల్ల కూడా రిఫైన్డ్‌ ఆయిల్‌ ధరలు పెరిగాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top