మోడల్‌ స్కూళ్లలో 282 టీచర్‌ పోస్టుల భర్తీ! | Sakshi
Sakshi News home page

మోడల్‌ స్కూళ్లలో 282 టీచర్‌ పోస్టుల భర్తీ!

Published Fri, Dec 10 2021 3:39 AM

Replacement of 282 teacher posts in model schools - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో (మోడల్‌ స్కూల్స్‌) 282 ఖాళీ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పోస్టుల భర్తీతో మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ వరకు చదువుతున్న విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ల కొరత తీరనుంది. వీటిల్లో 211 పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు (పీజీటీ), 71 ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు (టీజీటీ) పోస్టులున్నాయి. ఒకటి రెండు రోజుల్లో  నోటిఫికేషన్‌ విడుదల చేసేలా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేపట్టింది. ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు, అనుభవం లాంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని మెరిట్‌ అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే మోడల్‌ స్కూళ్లలో గెస్టు ఫ్యాకల్టీగా పనిచేస్తున్న పార్ట్‌టైమ్‌ టీచర్లకు పోస్టుల భర్తీలో మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. 

సీట్లకు పెరిగిన డిమాండ్‌ 
కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా 2009లో మోడల్‌ స్కూళ్లు ఏర్పాటయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 355 స్కూళ్లు ఏర్పాటు కాగా విభజన అనంతరం ఏపీకి 164 స్కూళ్లు కేటాయించారు. వీటిల్లో మొత్తం 91,520 సీట్లు అందుబాటులో ఉండగా 65,600 సెకండరీ ఎడ్యుకేషన్, 25,920 ఇంటర్‌ విద్యకు సంబంధించినవి ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులతో ఇంటర్‌ బోధన కొనసాగుతోంది. ప్రారంభంలో ఈ స్కూళ్లలో చేరికలు తక్కువగా ఉండగా ఇప్పుడు సీట్లకు డిమాండ్‌ పెరిగింది. డీఎస్సీ ద్వారా ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ పోస్టులు కొంతమేర భర్తీ అయ్యాయి. ఇంకా 565 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. వీటిలో 282 పోస్టులను ప్రస్తుతం భర్తీ చేయనున్నారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement