లాక్‌డౌన్‌ ప్రభావం.. తగ్గిన విద్యుత్‌ ధర

Reduced electricity price with Lockdown effect - Sakshi

బహిరంగ మార్కెట్లో యూనిట్‌ రూ.2.49

నెలరోజుల కిందట రూ.4 పైనే

పవర్‌ డిమాండ్‌ ఏపీలో ఫుల్‌.. ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో నిల్‌

రోజుకు 60 ఎంయూల కొనుగోలు చేస్తున్న ఏపీ

సాక్షి, అమరావతి: కోవిడ్‌ కారణంగా బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ ధరలు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లోను లాక్‌డౌన్‌ ఏదో ఒక రూపంలో కొనసాగుతోంది. దీంతో ఆ రాష్ట్రాల్లో వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్‌ వినియోగం తగ్గింది. ప్రైవేటు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు కూడా దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో అన్ని కాలాల్లోనూ జలవిద్యుత్‌ పుష్కలంగా ఉంటుంది. ఈ పరిస్థితుల వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో మిగులు విద్యుత్‌ ఉంటోంది. ఏప్రిల్‌ నెలలో బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ యూనిట్‌ రూ.4.20 వరకు ఉంది. వేసవి తీవ్రత పెరగడం, వాణిజ్య, పారిశ్రామిక వినియోగం ఎక్కువ కావడంతో మే నెలలోనూ విద్యుత్‌ ధరల్లో మార్పు ఉండదని భావించారు. కానీ అంచనాలు తారుమారయ్యాయి. కరోనా విజృంభణతో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లో పారిశ్రామికరంగం కుదేలైంది. తాజాగా తెలంగాణ వ్యాప్తంగా వాణిజ్య, పారిశ్రామిక వినియోగం పడిపోయింది. దీంతో మార్కెట్లో యూనిట్‌ రూ.2.49 కే లభిస్తోంది. 

చౌకవిద్యుత్‌ అందిపుచ్చుకుంటున్న రాష్ట్రం
దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో ఇప్పటికీ విద్యుత్‌ డిమాండ్‌లో పెద్దగా మార్పులేదు. వర్షం వల్ల మంగళ, బుధవారాల్లో డిమాండ్‌ తాత్కాలికంగా తగ్గినా.. మిగతా రోజుల్లో రోజుకు 230 మిలియన్‌ యూనిట్ల (ఎంయూల) వరకు ఉంటోంది. పారిశ్రామిక వినియోగం క్రమంగా పుంజుకుంటున్నట్టు తెలుస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర విద్యుత్‌ ఉన్నతాధికారులు చౌక విద్యుత్‌పై దృష్టిపెట్టారు. ఏపీ జెన్‌కో థర్మల్‌ ప్లాంట్ల విద్యుత్‌ యూనిట్‌ గరిష్టంగా రూ.3.50 చర వ్యయంతో ఉంటోంది. మార్కెట్లో మాత్రం యూనిట్‌ రూ.2.49కే వస్తోంది. థర్మల్‌ ప్లాంట్ల విద్యుత్‌ ధరతో పోలిస్తే రోజుకు దాదాపు రూ.2 కోట్లమేర ఆదా అవుతుందని లెక్కించిన అధికారులు చౌక విద్యుత్‌నే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల జెన్‌కో థర్మల్‌ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు కూడా పెరుగుతున్నాయి.

ఇదే సరైన విధానం
మార్కెట్లో లభించే చౌక విద్యుత్‌ తీసుకోవడం వల్ల పెద్ద ఎత్తున ఆదా చేసే వీలుంది. కష్టకాలంలో ఇది మంచి ఆలోచన. మార్కెట్‌ విద్యుత్‌ కొనుగోలు, పరిశీలనపై ఉన్నతస్థాయిలో ఓ బృందాన్ని ఏర్పాటు చేశాం. కొన్నాళ్లు చౌక విద్యుత్‌కు ఢోకా లేదనిపిస్తోంది. అందుకే తాత్కాలికంగా జెన్‌కో ఉత్పత్తిని తగ్గించటం సంస్థకే ప్రయోజనం.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top