వర్సిటీ పోస్టులన్నీ 'రీ రేషనలైజేషన్'‌

Re-rationalization of all varsity posts‌ in AP - Sakshi

ఉన్నత విద్యామండలి కసరత్తు

కోర్టు ఆదేశాలతో గత నియామకాలు, నోటిఫికేషన్లు రద్దు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 14 యూనివర్సిటీల్లో ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను పునఃప్రారంభించడంపై ఉన్నత విద్యామండలి దృష్టి సారిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఈ పోస్టుల భర్తీకి జారీ చేసిన జీవోలు, నోటిఫికేషన్లను న్యాయస్థానం ఇటీవల రద్దు చేయడంతో కొత్తగా ప్రక్రియను ప్రారంభించనున్నారు. గత సర్కారు ఇష్టానుసారంగా పోస్టుల హేతుబద్ధీకరణ చేపట్టడంతో న్యాయవివాదాల్లో చిక్కుకున్నాయి. ఆ లోపాలను సవరించి వర్సిటీల వారీగా పోస్టుల హేతుబద్ధీకరణ చేపట్టాలని మండలి భావిస్తోంది. రేషనలైజేషన్, రిజర్వేషన్లు, రోస్టర్‌ విధానం, వయోపరిమితి తదితర అంశాలపై న్యాయస్థానం మార్గదర్శకాల ప్రకారం వ్యవహరిస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రక్రియను చేపట్టనున్నామన్నారు.

నిబంధనల ప్రకారం హేతుబద్ధీకరణ
వర్సిటీ పోస్టుల హేతుబద్ధీకరణపై యూజీసీ మార్గదర్శకాలతో పాటు ప్రభుత్వ నిబంధనలను పాటించనున్నారు. వర్సిటీలకే బాధ్యత అప్పగించనున్నారు. హేతుబద్ధీకరణ ముగిశాక కొత్తగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. మెరిట్‌ అభ్యర్థులను గుర్తించేందుకు స్క్రీనింగ్‌ టెస్టు నిర్వహించాలని భావిస్తున్నారు. వర్సిటీ పోస్టులను పూర్తి పారదర్శకంగా, మెరిట్‌ ప్రాతిపదికన భర్తీ చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలిని ఆదేశించారు.

కమిటీ సిఫార్సులంటూ క్యాడర్‌ మార్పు
రాష్ట్రంలోని 14 యూనివర్సిటీల్లో 1,385 బోధనా సిబ్బంది పోస్టుల భర్తీ ప్రక్రియలో గత ప్రభుత్వం అక్రమాలు, అవకతవకలకు తావిచ్చింది. వర్సిటీల స్వయం ప్రతిపత్తిని పక్కన పెట్టి కమిటీ ద్వారా పోస్టుల హేతుబద్ధీకరణ చేసింది. కమిటీ సిఫార్సులంటూ నిబంధనలకు విరుద్ధంగా 570 ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులుగా క్యాడర్‌ మార్పు చేసింది. ఒక విభాగం పోస్టును మరో విభాగానికి తరలించింది. రిజర్వేషన్లు, రోస్టర్‌ పాయింట్లను కూడా తమకు అనుకూలంగా మార్చుకున్నారు. 

తమ సామాజిక వర్గానికి ప్రొఫెసర్‌ పోస్టులు
ప్రొఫెసర్‌ పోస్టులను తమ సామాజికవర్గం వారితో గత ప్రభుత్వ పెద్దలు భర్తీ చేయించారు. అనంతపురం జేఎన్టీయూలో 9 ప్రొఫెసర్‌ పోస్టులలో ఏడింటిని ఒకే సామాజికవర్గం వారితో భర్తీ చేశారు. కృష్ణా వర్సిటీలో 4 ప్రొఫెసర్‌ పోస్టులు, రాయలసీమ వర్సిటీలో 4 ప్రొఫెసర్‌ పోస్టులతోపాటు మరికొన్ని వర్సిటీల్లో కూడా తమ వారితో భర్తీ చేశారు. రేషనలైజేషన్‌ జీవోలు, నోటిఫికేషన్లను న్యాయస్థానం రద్దు చేసినందున ఈ ప్రొఫెసర్‌ పోస్టుల నియామకాలు కూడా రద్దు కానున్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top