పూతరేకులు..చాలా ఈజీ

RARS scientists Prepared machine for Putharekulu in Atreyapuram - Sakshi

రోజూ 1,200 వరకు తయారుచేసేలా యంత్రం తయారీ

ఆత్రేయపురంలో ప్రయోగాత్మకంగా తయారుచేసిన ఆర్‌ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు 

కేవలం రూ.35 వేలతో సులువుగా పూతరేకులు చేసుకోవచ్చు

నాలుగో పేటెంట్‌ హక్కు సాధించిన అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్‌

సాక్షి, అనకాపల్లి: పూతరేకులంటే అందరికీ ఠక్కున గుర్తుకొచ్చేది ఆత్రేయపురం. ఆంధ్ర సంప్రదాయ స్వీట్ల వంటకాల్లో వీటిది ప్రత్యేక స్థానం. నోట్లో వేస్తే చటక్కున కరిగిపోయే లక్షణమున్న వీటిని ఉమ్మడి తూర్పు గోదావరి, విజయనగరం– విశాఖపట్నం, గుంటూరు జిల్లాల సరిహద్దు గ్రామాల్లో సాధారణ పద్ధతుల్లో ఎక్కువగా తయారుచేస్తుంటారు. కానీ, ఈ ప్రాంతాలు ఆత్రేయపురం అంత ప్రసిద్ధి కాదనే చెప్పుకోవచ్చు. ఇక సంప్రదాయ పద్ధతిలో కొంచెం కష్టతరమైన వీటి తయారీ ఇప్పుడు చాలా సులభతరమైంది. అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు వీటి తయారీకి ప్రత్యేక యంత్రాన్ని రూపొందించారు.

సాధారణ పద్ధతిలో తయారీ ఇలా..
పూతరేకుల తయారీకి ప్రత్యేకంగా తయారుచేసిన మట్టికుండను వాడతారు. కుండ పైభాగం నున్నగా వెడల్పుగా ఉంటూ. మంటపెట్టడానికి కింది భాగంలో  రంధ్రాన్ని పెడతారు. ఇక బియ్యాన్ని ఒకరోజు ముందుగా నీటిలో నానబెట్టి మరుసటి రోజు రుబ్బురోలులో రుబ్బేవారు. ఈ ప్రక్రియ కష్టతరంగా మారడంతో మారుతున్న కాలానుగుణంగా గ్రైండర్‌లలో రుబ్బుతున్నారు. ఇలా.. మెత్తగా రుబ్బిన పిండిలో తగిన మోతాదులో నీటిని కలిపి పలచగా జాలుగా వచ్చేలా చేస్తారు.

బోర్లించిన కుండ అడుగుభాగం నుంచి కొబ్బరి ఆకులతో సన్నని మంట పెడుతూ కుండ వేడెక్కిన తర్వాత పూతరేకుల తయారీ ప్రక్రియ ప్రారంభిస్తారు. మంచినూనే లేదా నేతిని కుండ పైభాగాన రాస్తారు. పలుచని వస్త్రాన్ని జాలుగా ఉన్న బియ్యపు పిండిలో ముంచి కుండ వేడెక్కిన తరువాత ఆ వస్త్రాన్ని కుండపై ఒకవైపు నుంచి మరొక వైపుకు లాగుతారు. కుండ వేడికి పిండి పలుచని పొరలా వస్తుంది. మంట ఎక్కువైనా తక్కువైనా పూతరేకులు విరిగిపోతాయి. ఇలా వీటిని ఈ విధానంలో రోజుకు కేవలం 200వరకు మాత్రమే చేయగల్గుతారు. 
అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు తయారుచేసిన పూతరేకుల తయారీ యంత్రం 

తయారీ సులభతరానికి యంత్రం
ఈ నేపథ్యంలో.. సాంకేతికత జోడించి పూతరేకుల తయారీని సులభతరం చేయాలన్న ఆలోచన అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలకు 2016లో కల్గింది. అంతే.. ఈ ఆలోచనను శాస్త్రవేత్తలు డాక్టర్‌ పీవీకే జగన్నాథరావు, డాక్టర్‌ పి. శ్రీదేవిలు కార్యరూపం దాల్చారు. పూతరేకులను తయారుచేసే యంత్రాన్ని రూపొందించారు. కరెంట్‌ ఆధారంగా పనిచేసే ఈ యంత్రంపై పూతరేకులను ఒకదాని తర్వాత ఒకటి వేగంగా తీయ్యొచ్చు. అదే పాత విధానంలో అయితే కుండకు పెట్టే మంట అటు ఎక్కువ కాకుండా, ఇటు తక్కువ కాకుండా చూసుకోవడంలో ఎక్కువ సమయం పడుతుంది. దీంతో యంత్రం రాకతో వాటి తయారీ మరింత సులభతరమైంది.

నాలుగు పేటెంట్లు సాధించిన ఆర్‌ఏఆర్‌ఎస్‌
గతంలో అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ఉప్పుడు బియ్యం యంత్రానికి, ప్రాసెస్‌ పౌడర్‌ బెల్లానికి, మిషనరీ పౌడర్‌ బెల్లానికి మూడు పేటెంట్లు పొందారు. ఇప్పుడు తాజాగా పూతరేకుల తయారీ యంత్రానికి చెన్నైలో ఉన్న సౌత్‌ ఇండియా ఇంటెలెక్చువల్‌ సంస్థ ఈనెల 7న పేటెంట్‌ హక్కులను కల్పిస్తూ ఆర్‌ఏఆర్‌ఎస్‌కు అనుమతినిచ్చింది. 

రోజుకు 200 నుంచి 1,200కు పెరుగుదల
సాధారణ విధానంతో రోజుకి గరిష్టంగా 200 వరకు పూతరేకులు తయారుచేస్తారు. పెట్టుబడిపోను రూ.650 వరకు మిగులుతోంది. ఈ నేపథ్యంలో.. ఆర్‌ఏఆర్‌ఎస్‌ వారు తయారుచేసిన యంత్రం ద్వారా అయితే రోజుకు గరిష్టంగా 1,200 వరకు తయారుచేయవచ్చు. పెట్టుబడి ఖర్చులు పోను..రూ.2వేల వరకు లాభం ఆర్జించవచ్చు. ఈ యంత్రం ఖరీదు దాదాపు రూ.35 వేలు.

రుచిలో ఏమాత్రం తేడాలేదు
ఆత్రేయపురంలో మా బృందం నెల రోజులపాటు క్షేత్రస్థాయిలో పరిశీలించాం. పూతరేకుల తయారీ వివరాలను అడిగి తెలుసుకున్నాం. యంత్రం రూపొందించిన తర్వాత తయారుచేసిన పూతరేకులకు, సా«ధారణ పద్ధతుల్లో తయారుచేసిన పూతరేకులకు మధ్య రుచి వ్యత్యాసం కూడా పరిశీలించాం. రెండింటికీ ఒకే రుచి వచ్చాయి. 
    – పీవీకే జగన్నాథరావు, ఆర్‌ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్త  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top