అపనమ్మకాలు..అపోహలతో గుడ్లగూబల్ని దూరం చేసుకుంటున్నారు.. అసలు విషయం తెలుసా?

Rare 12 species owls in Andhra Pradesh - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 12 రకాల జాతులు 

నల్లమలలో చుక్కల పొట్ట గద్దాకారపు గుడ్లగూబ

వేట, అడవులు తగ్గడంతో వాటి ఉనికికి ప్రమాదం.. మనుషుల అపనమ్మకాలు కూడా కారణమే

ఎలుకల నియంత్రణ ద్వారా ఆహార భద్రత కల్పిస్తున్న గుడ్లగూబలు

వాటి సంరక్షణ ముఖ్యమంటున్న నిపుణులు

సాక్షి, అమరావతి: గుడ్లగూబలు మానవాళికి ఎంతో మేలు చేకూరుస్తున్నాయి. ఒక్క గాదె గుడ్లగూబ (బార్న్‌ ఔల్‌) తన జీవిత కాలంలో 11 వేల ఎలుకలను తింటుందని అంచనా. తద్వారా 13 టన్నుల ఆహార పంటలను కాపాడుతుందని ఒక పరిశోధనలో తేలింది. గుడ్లగూబలు ఎలుకలతోపాటు కీటకాలు, చిన్న పక్షులను వేటాడి తింటాయి. తద్వారా వాటితో మానవాళికి వ్యాధులు ప్రబలకుండా నివారిస్తాయి. ఇంత మేలు చేకూరుస్తున్న గుడ్లగూబలను అపోహలతో, అపనమ్మకాలతో మనుషులు దూరం చేసుకుంటున్నారు.

అడవులు తగ్గిపోవడం, వేట వంటి కారణాలతో వీటి సంఖ్య తగ్గిపోతోందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇటీవల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అరుదైన గుడ్లగూబలు దర్శనమిస్తున్నాయని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. అత్యంత అరుదైన చుక్కల పొట్ట గద్దాకారపు గుడ్లగూబ (స్పాట్‌ బెల్లీడ్‌ ఈగల్‌ ఔల్‌) కొద్ది రోజుల క్రితం నల్లమల అడవుల్లో కనిపించిందని అంటున్నారు. రాష్ట్రంలో ఈ జాతి గుడ్లగూబ కనిపించడం ఇదే తొలిసారి.

అలాగే దట్టమైన అడవుల్లో మాత్రమే నివాసం ఏర్పరచుకునే గోధుమ రంగు అడవి గుడ్లగూబ (బ్రౌన్‌ వుడ్‌ ఔల్‌)లను పాపికొండలు, నల్లమల అడవుల్లో గుర్తించారు. శీతాకాలంలో రష్యా, యూరప్‌ల నుంచి మన దేశానికి వలస వచ్చే పొట్టి చెవుల గుడ్లగూబలు కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని గడ్డి మైదానాల్లో కనిపించాయి. అలాగే చిత్తూరు, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని గడ్డి మైదానాల్లో వీటి ఉనికి ఉన్నట్లు నిర్ధారించారు. రాష్ట్రంలో అత్యంత అరుదుగా కనిపించే గుడ్లగూబల జాబితాలో ఉన్న గడ్డి గుడ్లగూబ (ఈస్టర్న్‌ గ్రాస్‌ ఔల్‌) ఇటీవల కాలంలో ఎక్కడా కనిపించలేదు. 

సంరక్షణ అందరి బాధ్యత 
దట్టమైన అడవులు, కొండలు, గడ్డినేలలు కనుమరుగు కావడం, వేట వల్ల గుడ్లగూబలు, వాటి పరిధి నెమ్మదిగా తగ్గుతోంది. తెలుగు రాష్ట్రాల్లో గుడ్లగూబల సంరక్షణను చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. వీటివల్ల మానవాళికి ఎంతో మేలు జరుగుతుంది. వాటిని సంరక్షించడం మనందరి బాధ్యత.
– రాజశేఖర్‌ బండి, సిటిజన్‌ సైంటిస్ట్, ఐఐఎస్‌ఈఆర్, తిరుపతి  

మనదేశంలో 35 జాతులు
కాగా ప్రపంచవ్యాప్తంగా 220కిపైగా, మన దేశంలో 35, మన రాష్ట్రంలో 12 రకాల గుడ్లగూబ జాతుల్ని గుర్తించారు. మనదేశంలో 16 రకాల గుడ్లగూబ జాతులను అక్రమ వ్యాపారానికి వినియోగిస్తున్నట్లు తేలింది. కొందరు చేతబడి, క్షుద్రపూజలు వంటి వాటికి వీటిని ఉపయోగిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో గుడ్లగూబలు ఎత్తయిన భవనాలు, అపార్టుమెంట్లలో గూడు కట్టుకుంటున్నాయి. వాటిని ప్రజలు అపశకునంగా భావిస్తూ గూళ్లను నాశనం చేస్తున్నారు. దీంతో గుడ్లగూబల ఉనికికి ప్రమాదం ఏర్పడింది.     

ఇతర పక్షులకు భిన్నంగా గుడ్లగూబలకు కళ్లు మనుషుల మాదిరిగా ముఖం ముందు ఉంటాయి. కానీ మనుషుల్లా కళ్లను కదిలించలేవు. అవి తలను 270 డిగ్రీల వరకు తిప్పి చూడగలుగుతాయి. ఈ సామర్థ్యంతోనే అవి రాత్రి వేళల్లో చురుగ్గా వేటాడతాయి. అవి మనుషుల మీద దాడిచేయవు. అపోహలు, అపనమ్మకాలు గుడ్లగూబలను మనుషుల నుంచి దూరం చేశాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top