మూడు రాజధానులు.. రాష్ట్ర పరిధిలోని అంశం: కేంద్ర మంత్రి

Ramdas Athawale Comments On Andhra Pradesh Three Capitals - Sakshi

కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే

సాక్షి,విశాఖపట్నం/మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఏపీలో మూడు రాజధానుల అంశంతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధంలేదని, అది పూర్తిగా రాష్ట్ర పరిధిలోనిదని  కేంద్ర సోషల్‌ జస్టిస్‌ సహాయ మంత్రి రాందాస్‌ అథవాలే స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. పరిశ్రమల ప్రైవేటీకరణ కాంగ్రెస్‌ పార్టీ నుంచే ప్రారంభమైందన్నారు. ఒకవేళ నష్టాల్లో ఉన్న పరిశ్రమలను ప్రైవేటీకరణ చేస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించారు. దేశ వ్యాప్తంగా మోదీ నాయకత్వంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతోందని చెప్పారు.

తమ రిపబ్లికన్‌ పార్టీ కూడా వైఎస్సార్‌సీపీలాగే ప్రాంతీయ పార్టీ అని, ఎన్‌డీఏలో భాగస్వామి అయ్యాక అభివృద్ధి వేగవంతమైందన్నారు. అదే తరహాలో వైఎస్సార్‌సీపీ ఎన్‌డీఏలో భాగస్వామి అయితే ఏపీలో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ఏపీలో జాతీయ రహదారులు, టూరిజం తదితర ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రులకు పలుసార్లు వినతులిచ్చారని చెప్పారు.

ఏపీలో బలమైన పార్టీ నేతగా ఎదిగిన వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. పేద, బడుగు, బలహీన వర్గాల వారి కోసం చాలా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ప్రశంసించారు. వైఎస్సార్‌తో తనకెంతో అనుబంధముందన్నారు. డాక్టర్‌ అంబేడ్కర్‌ ఫౌండేషన్‌ ద్వారా కులాంతర వివాహాలకు రూ.2.5 లక్షల ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. స్వర్ణకారుల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకు వెళతానని ఏపీ స్వర్ణకార సంఘం మహాసభలో అథవాలే చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top