ఆహా.. హలీం​: భలే టేస్ట్‌ గురూ

Ramadan Month Haleem Guntur District Iftar Dinner - Sakshi

రంజాన్‌ నెలలో ప్రసిద్ధి చెందిన వంటకం   

జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన దుకాణాలు    

ఏటా రూ.12 కోట్లకుపైగా వ్యాపారం

తెనాలి/పాతగుంటూరు: రంజాన్‌ నెల రాగానే అందరికీ గుర్తుకొచ్చేది హలీం. ఈ పేరు వినగానే మాంసప్రియుల నోరు రసార్ణమవుతుంది. మధుర పదార్థాల మేళవింపుతో.. ఘుమఘుమలాడుతూ.. నోటికి సరికొత్త రుచులనందించే ఈ ప్రత్యేక వంటకాన్ని ఆస్వాదించేందుకు ఆహారప్రియులు ఉవ్విళ్లూరుతున్నారు.  

వెయ్యిమందికి ఉపాధి  
రంజాన్‌ నెలలో రోజంతా ఉపవాస దీక్ష చేసిన ముస్లింలు సాయంత్రం ఇఫ్తార్‌ విందు ఆరగిస్తారు. దీనిలో పోషక విలువలు అధికంగా ఉండే హలీం తప్పనిసరిగా తీసుకుంటారు. దీనివల్ల నీరసించిన శరీరానికి వెంటనే శక్తి వస్తుందని చెబుతారు.  ఇరాన్‌ నుంచి దిగుమతి అయిన ఈ వంటకాన్ని హైదరాబాదీయులు సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు జోడించి మరింత రుచికరం చేశారు. దాదాపు 20ఏళ్ల క్రితం హలీం ఘుమఘుమలు గుంటూరు వాసులను పలరించాయి. ఆ  తర్వాత ఇతర ప్రాంతాలకూ విస్తరించాయి. ప్రస్తుతం గుంటూరు, తెనాలి, నరసరావుపేట, పిడుగురాళ్లలో వీటి తయారీ కేంద్రాలు, అమ్మకం పాయింట్లు ఏర్పాటయ్యాయి. వీటిద్వారా సుమారు వెయ్యిమందికి ఉపాధి లభిస్తోందని అంచనా. ఏటా రంజాన్‌ నెలలో హలీం ద్వారా రూ.12కోట్లకుపైగా వ్యాపారం జరుగుతుందని సమాచారం. 

తెనాలిలో హలీం తయారీ 

వాడే పదార్థాలివీ..  
గొర్రెపోతు మాంసంతో చేసిన హలీంకు జిల్లాలో ఆదరణ ఎక్కువ.  ఆ మాంసంతోపాటు గోధుమ రవ్వ, బాస్మతి బియ్యం, ఉప్పు, పెసరపప్పు, మినుములు, కందిపప్పు, బాదం, జీడిపప్పు, వేయించిన ఉల్లిపాయ, నెయ్యి, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీర, జీలకర్ర, పచ్చి మిర్చి, కొత్తిమీరతో సహా 21 వస్తువులతో హలీం తయారు చేస్తారు.
 
ప్లేటు రూ.100 
కొన్నిచోట్ల హలీం తయారీకి హైదరాబాద్‌ నుంచి  ప్రత్యేకంగా వంట మాస్టర్లను తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ప్లేటు రూ.100, అర కిలో రూ.200, కిలో రూ.400కు విక్రయిస్తున్నారు. 

బలవర్ధకం కూడా  
హలీం అంటే ఎంతో ఇష్టం. ఇది రుచికరమే కాదు.. బలవర్ధకం కూడా. కరోనా వల్ల గత రెండేళ్లు రుచిచూడలేకపోయా. ఈ ఏడాది అందుబాటులోకి రావడం ఆనందంగా ఉంది.   
– షేక్‌ అహ్మద్‌ హుస్సేన్, తెనాలి 

గిరాకీ పెరిగింది 
గుంటూరు నగరంలో ఎన్నాళ్ల నుంచో హలీం తయారు చేస్తున్నాను. అప్పట్లో ప్లేటు రూ.25 ఉండేది. కాలక్రమేణా సరుకుల ధరలు పెరిగాయి.  హలీం ప్రియులూ పెరిగారు.  ప్రస్తుతం ప్లేటు రూ.100కు విక్రయిస్తున్నాం. ఏడాదిలో ఒక నెల మాత్రమే తయారు చేస్తుండటంతో వినియోగం బాగా పెరిగింది. చాలామంది వస్తున్నారు.  
– మహమ్మద్‌ జాఫర్, నిర్వాహకుడు, గుంటూరు 

ఎంతో ఇష్టం 
హలీం అంటే నాకు ఎంతో ఇష్టం. రంజాన్‌ నెలలో దీనిని ఇంటిల్లిపాదీ రుచి చూస్తుంటాం. హలీంకు ప్రత్యేక స్థానం ఉంది. దీంతోపాటు ఈనెలలో చికెన్‌ తందూరీ, ఫలుదాను ఆరగిస్తుంటాం.    
– సాధిక్, హలీం ప్రియుడు, గుంటూరు 

గుంటూరుకు పరిచయం చేసింది నేనే 
హైదరాబాద్‌ హలీంను గుంటూరుకు పరిచయం చేసింది నేనే. 20 ఏళ్ల క్రితం వంటవాళ్లను తీసుకొచ్చి హలీం రుచులను నగరవాసులకు చూపించాను.  తెనాలిలో ఏటా రంజాన్‌ నెలలో హలీమ్‌ వ్యాపారం చేస్తున్నా. కరోనా వల్ల రెండేళ్లుగా వీలుపడలేదు. మళ్లీ ఇప్పుడు ఆరంభించా. చాలా సంతోషంగా ఉంది. 
– షేక్‌ అబ్దుల్‌ వహీద్, తెనాలి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top