
తేల్చి చెప్పిన రాజస్థాన్ హైకోర్టు.. ఏపీ సర్కారుకు చెంపపెట్టు!
30 రోజులకు మించి ఎవరినీ వెయిటింగ్‌లో ఉంచకూడదు
అలా ఉంచితే లిఖిత పూర్వకంగా కారణం చెప్పాలి
వెయిటింగ్‌లో ఉంచడంపై మార్గదర్శకాలు జారీ
ఏపీలో 11 నెలలుగా వందలాది మంది అధికారులపై కక్ష సాధింపు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ అధికారులకు అకారణంగా పోస్టింగులు ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచడం అధికార దుర్వినియోగమేనని రాజస్థాన్ హైకోర్టు తేల్చి చెప్పింది. అధికారులకు పోస్టింగులు ఇవ్వడంలో జవాబుదారీతనం ఉండాలని స్పష్టం చేసింది. ఎవరికైనా సరే పోస్టింగ్ ఇవ్వకపోతే అందుకు కారణాలను వారికి లిఖిత పూర్వకంగా తెలపాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.
నిర్దిష్ట కారణం లేకుండా ఏ అధికారికీ పోస్టింగు ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచడానికి వీల్లేదని విస్పష్టంగా ప్రకటించింది. అధికారులకు ఎటువంటి పరిస్థితుల్లో పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచవచ్చో నిర్దిష్ట మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు రాజస్థాన్ హైకోర్టు జోధ్‌పూర్ బెంచ్ చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతోపాటు వందలాది మంది అధికారులకు 11 నెలలుగా పోస్టింగులు ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచింది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ హైకోర్టు తీర్పు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. పరిపాలన కారణాలతోనే వెయిటింగ్‌లో ఉంచాలి తప్ప.. అదేదో శిక్షగానో కక్ష పూరితంగానో ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు.
ఆ తీర్పులోని ప్రధాన అంశాలు
ూ వెయిటింగ్‌లో ఉంచడానికి కారణాలను లిఖిత పూర్వకంగా తెలపాలి
ూ ఒక అధికారిని దీర్ఘకాలంగా పోస్టింగు ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచడం అధికార దుర్వినియోగమే అవుతుంది. 30 రోజులకు మించి ఎవరికీ పోస్టింగు ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచకూడదు. అంతకు మించి వెయిటింగ్‌లో ఉంచాల్సి వస్తే సహేతుక కారణాలతో ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి.
ూ అధికారులు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లి తిరిగి వచ్చి జాయిన్ అయినప్పుడు, ఒక శాఖ నుంచి మరో శాఖకు డెప్యుటేషన్‌పై వెళ్లి.. ఆ డెప్యుటేషన్ కాలపరిమితి ముగియడంతో మాతృ శాఖకు తిరిగి వచ్చినప్పుడు, ఉద్యోగపరమైన శిక్షణకు హాజరై తిరిగి వచ్చిన తర్వాత, అధికారి తనకు ఇచ్చిన పోస్టులో చేరకుండా ఉన్నప్పుడు, తనను బదిలీ చేసిన పోస్టులో చేరకుండా ఉన్నప్పుడు, అధికారి బదిలీని ఉపసంహరించినప్పుడు వెయిటింగ్‌లో ఉంచవచ్చని మార్గదర్శకాలు జారీ చేసింది.
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ తీరు
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తోంది. 2024 జూన్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎటువంటి కారణాలను పేర్కొనకుండానే ఏకంగా ఐదుగురు ఐఏఎస్, 13 మంది ఐపీఎస్ అధికారులతోపాటు అదనపు ఎస్పీల నుంచి సీఐల వరకు మరో 300 మందికి పోస్టింగులు ఇవ్వకుండా ఎన్నో నెలలపాటు వెయిటింగ్‌లో ఉంచింది. దాదాపు ఏడాది కావస్తున్నా ఇప్పటికీ ఇద్దరు ఐఏఎస్ అధికారులు, ఇద్దరు ఐపీఎస్ అధికారులతోపాటు అదనపు ఎస్పీ స్థాయి నుంచి సీఐ స్థాయి అధికారుల వరకు 191 మందికి పోస్టింగులు ఇవ్వకుండా వెయిటింగ్‌లోనే ఉంచింది.