గుర్తించిన పెట్రోలింగ్ పోలీసులు
వారిపైకి రాళ్లు రువ్వి న దుండగులు
పది రౌండ్ల కాల్పులు జరిపిన జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు స్టేషన్ సమీపంలోని ఆలూరు గేటు వద్ద ఘటన
తెనాలిరూరల్/పొన్నూరు: రైల్వేసిగ్నల్ వ్యవస్థను దెబ్బతీసి రైలులో దోపిడీ చేసేందుకు దుండగులు విఫలయత్నం చేశారు. దీన్ని గుర్తించిన రైల్వే పోలీసులు వారి ప్రయత్నాలను అడ్డుకున్నారు. దీంతో వారిపై దుండగులు రాళ్లు రువ్వారు. పోలీసులు పది రౌండ్లు కాల్పులు జరపగా, దుండగులు పరారయ్యారు. సంచలనం రేకెత్తించిన ఈ ఘటనకు సంబంధించి గుంటూరు జీఆర్పీ డీఎస్పీ అక్కేశ్వరరావు మంగళవారం విలేకరులకు వివరించారు. నరసరావుపేట జీఆర్పీ ఎస్‌ఐ రాజమోహనరావు, కానిస్టేబుళ్లు సదా, ఆంజనేయులు సోమవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా నిడుబ్రోలు రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున సిగ్నల్ టాంపరింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు అనుమానితులు తారసపడ్డారు.
వారిని ఆపి ప్రశ్నించే ప్రయత్నం చేయబోగా వారు రాళ్లు రువ్వారు. వెంటనే ఎస్‌ఐతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు కాల్పులు జరిపారు. వారు తప్పించుకొని సమీపంలోని పొలాల వైపు పారిపోయారు. ఘటన అనంతరం జీఆర్పీ, ఆర్‌పీఎఫ్ స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. మంగళవారం ఉదయం ఘటనా స్థలాన్ని డీఎస్పీ అక్కేశ్వరరావు, గుంటూరు ఎస్‌హెచ్‌ఓ అంజిబాబు, ఆర్‌పీఎఫ్, సివిల్ పోలీసులు పరిశీలించారు. ఘటనా స్థలంలో అనుమానితులు వదిలివెళ్లిన వైర్ కట్టర్ (స్లీవ్ కట్టర్), టెస్టర్, జత గ్లౌజులు స్వా«దీనం చేసుకున్నారు.
ఘటనపై తెనాలి రైల్వే పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. తమ సిబ్బందికి కనిపించిన ఇద్దరు దుండగులతోపాటు మరికొంత మంది ఉంటారని, అందరి ఆచూకీ గుర్తించేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు చెప్పారు. సిగ్నల్ టాంపర్ చేసి రైలు నిలిచిపోగానే దోపిడీకి పాల్పడాలన్నదే దుండగుల ముఖ్యోద్దేశంగా కనిపిస్తున్నట్లు చెప్పారు.
కొద్ది రోజుల కిందట ఇక్కడే దొంగల బీభత్సం
ఏప్రిల్ 19న బెంగళూరు–నరసాపురం(07154) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ నాలుగు కోచ్‌లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ప్రయాణికుల నుంచి 11 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. బాపట్ల–అప్పికట్ల మధ్య ఈ ఘటన జరిగింది. అప్పికట్లలో రైలు ఆపి వారు పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు.


