వాంగ్మూలంలో నేనా విషయాలు చెప్పలేదు

Pulivendula Municipal Chairman Varaprasad fires on CBI officials - Sakshi

కొన్ని పత్రికలు, సీబీఐ అధికారులపై పులివెందులమునిసిపల్‌ చైర్మన్‌ వరప్రసాద్‌ ధ్వజం

నేను సీబీఐకి చెప్పని విషయాలు కూడా చెప్పినట్లుగా తప్పుడు వార్తలు రాశారు

వైఎస్‌ వివేకా, అవినాష్‌రెడ్డి మధ్య విభేదాలున్నట్లు నేను చెప్పలేదు

అవినాష్‌కి ఎంపీ టికెట్‌ను వివేకా వ్యతిరేకించారని కూడా చెప్పలేదు

దురుద్దేశంతోనే సీబీఐ అధికారులు నా పేరిట తప్పుడు వాంగ్మూలం 

కేసును, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలా అనైతికంగా వ్యవహరిస్తున్నారు

పులివెందుల: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తన వాంగ్మూలమంటూ కొన్ని పత్రికల్లో ప్రచురితమైన విషయాలు పూర్తిగా అవాస్తవమని పులివెందుల మునిసిపల్‌ చైర్మన్‌ వరప్రసాద్‌ చెప్పారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ అధికారులు తనను అడగని విషయాలు, తాను చెప్పని విషయాలను వాంగ్మూలంగా కొన్ని పత్రికలు ప్రచురించడాన్ని ఖండిస్తున్నానన్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డిల మధ్య విభేదాలు ఉన్నాయని. అవినాష్‌రెడ్డికి  ఎంపీ టికెట్‌ ఇవ్వడాన్ని వివేకానందరెడ్డి వ్యతిరేకించారని తాను వాంగ్మూలం ఇచ్చినట్లుగా వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమని తెలి పారు. ‘సీబీఐ అధికారులు పిలిస్తే గత ఏడాది ఆగస్టు 9న వెళ్లాను. వివేకానందరెడ్డి మరణించిన రోజున ఏం జరిగిందని అడిగారు.

వివేకా చనిపోయారని తెలిసి ఆ రోజు ఉదయం 7.45 గంటల సమయంలో అక్కడకు వెళ్లానని, వివేకా మృతదేహం బెడ్‌రూంలో ఉందని చెప్పాను. అప్పటికే ప్రజలు ఎక్కువగా వస్తుండటంతో వారిని నియంత్రిస్తూ అక్కడే ఉన్నానని తెలిపాను. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తీసుకెళ్లిన తర్వాత ఇంటికి వచ్చేసినట్లు చెప్పాను. 2019 ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్‌ ఎవరికి ఇస్తే వైఎస్సార్‌సీపీ గెలుస్తుందని అడిగారు. వైఎస్సార్‌సీపీకి ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉందని, ఎవరు అభ్యర్థి అయినా పార్టీ గెలుస్తుందని చెప్పాను. అప్పటికే అవినాష్‌రెడ్డి విజయం కోసం వివేకా ప్రచారం చేస్తున్నారని కూడా చెప్పాను. కడప ఎంపీ టికెట్‌ అంశంపై సీబీఐ అధికారులు అడిగింది అదొక్కటే. నేను చెప్పింది ఇంతే. కానీ నన్ను అడగని విషయాలు, నేను చెప్పని విషయాలను సీబీఐ నా వాంగ్మూలంగా రాసుకోవడం దిగ్భ్రాం తికి గురి చేసింది.

వివేకా జీవించి ఉంటే 2019లో కడప ఎంపీ టికెట్‌ ఆయనకే ఇచ్చేవారని నేను చెప్పినట్లుగా వాంగ్మూలంలో రాశారు. ఎంపీ టికెట్‌ వైఎస్‌ షర్మిలకు ఇవ్వాలని వివేకా భావించారని కూడా నేను చెప్పినట్లు పేర్కొన్నారు. వివేకా, అవి నాష్‌రెడ్డి మధ్య విభేదాలు ఉన్నట్లు చెప్పానని రాసుకున్నారు. ఇవన్నీ పూర్తిగా అవాస్తవం. ఆ విషయాలేవి నన్ను అడగలేదు, నేను చెప్పలేదు’ అని వరప్రసాద్‌ స్పష్టం చేశారు. ‘కొందరు సీబీఐ అధి కారులు దురుద్దేశంతోనే నా పేరిట తప్పుడు వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. దానినే మీడియాకు లీక్‌ చేస్తున్నారు.  

ఈ కేసును, ప్రజలను తప్పుదోవ ప ట్టించేందుకే ఆ అధికారులు ఇలా నిబంధనలకు వి రుద్ధంగా, అనైతికంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారం చేయడమే ఏకైక అజెండాగా ఉన్న కొన్ని పత్రికలు, టీవీ, యూట్యూబ్‌ చానళ్లు ఇదే అవకాశంగా తప్పుడు వార్తలు ప్రచురిస్తూ కేసును ప్రభావితం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయి.  సీబీఐ అధికారులు, ఆ మీడియా సంస్థలపై న్యాయపరంగా పోరాడుతాను.  కుట్రలను తిప్పికొడతాము’అని వరప్రసాద్‌ పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top