12 నుంచి ఉద్యమ సన్నద్ధ సభలు | Protest rallies from 12th says Amaravati JAC Chairman | Sakshi
Sakshi News home page

12 నుంచి ఉద్యమ సన్నద్ధ సభలు

Jul 9 2026 5:14 AM | Updated on Jul 9 2026 5:14 AM

Protest rallies from 12th says Amaravati JAC Chairman

సర్కారు నిర్లక్ష్యంపై ప్రతి జిల్లాలోనూ నిర్వహిస్తాం 

 బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టీకరణ 

ఉద్యోగుల సమస్యలపై ఈ సర్కారు ఏమాత్రం స్పందించడం లేదు 

ఉద్యమ కార్యాచరణపై సీఎస్‌కు లేఖ అందజేస్తాం 

ఉద్యోగుల పోరాటంతో విధులకు ఇబ్బంది కలిగితే ప్రభుత్వానిదే బాధ్యత  

అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా పీఆర్సీ కమిషన్‌ వేయలేదు 

పెండింగ్‌లో ఐదు డీఏలు, ఇతర బకాయిలు.. ఒక్కో ఉద్యోగికి రూ.లక్షల్లో నష్టం

మహారాణిపేట/విజయనగరం అర్బన్‌: ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నందున పోరాటం తప్పదని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి ఉద్యమ సన్నద్ధ సభలు ప్రతి జిల్లాల్లో నిర్వహిస్తు­న్నామని చెప్పారు. త్వరలో ఉద్యమ కార్యాచరణను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేస్తామని తెలిపారు. బుధవారం ఆయన విజయనగరం రెవెన్యూ హోమ్‌లో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా ఏపీ జేఏసీ అమరావతి అనుబంధ సంఘాలు, కార్యవర్గ సభ్యులతో సమావేశమ­య్యారు. అంతకు ముందు విశాఖలోని రెవెన్యూ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు గడుస్తున్నప్పటికీ, ఇప్పటి వరకు పీఆర్‌సీ కమిషనర్‌ను నియమించక పోవడం దారుణమ­న్నారు. ఉద్యోగులకు కనీసం తాత్కాలిక భృతి (ఐఆర్‌) కూడా ప్రకటించలేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికీ ఐదు డీఏలను విడుదల చేయకపోవడం వల్ల ప్రతి ఉద్యోగి, పెన్షనర్‌ ఆర్థికంగా లక్షలాది రూపాయలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈహెచ్‌ఎస్‌ పథకం కోసం ప్రతి ఉద్యోగి, పెన్షనర్‌ ప్రతినెలా తమ జీతం, పెన్షన్ల నుంచి చందా చెల్లిస్తున్నప్పటికీ ఆస్పత్రుల్లో హెల్త్‌ కార్డులు చెల్లుబాటు కావడంలేదని ధ్వజమెత్తారు. 

సరెండర్‌ లీవ్‌ డబ్బులు ఎన్‌కాష్‌మెంట్‌ కావడం లేదని, అయినప్పటికీ ఆ సొమ్ముకు ఇన్‌కంట్యాక్స్‌ పడుతోందన్నారు. పీఆర్‌సీ, డీఏ బకాయిలు వేల కోట్లలో పేరుకుపోయాయని, ఉద్యోగికి ప్రభుత్వం ఎంత బకాయి ఉందో వారి పే స్లిప్‌లో స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. దీనివల్ల ఒకవేళ ఉద్యోగి చనిపోయినా, వారి వారసులకు ఆ బకాయిల వివరాలు తెలుస్తాయన్నారు. 

కూటమి ప్రభుత్వంలో కష్టాలు తగ్గుతాయనుకుంటే పెరిగాయి
ఉద్యోగుల హక్కుల సాధన కోసం జిల్లాల పర్యటనలు చేస్తున్నామని, ఇందులో భాగంగా ఈ నెల 12న ఉద్యోగులు, పెన్షనర్లతో కలిసి పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఉద్యోగుల పోరాటంతో విధులకు ఇబ్బంది కలిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కూటమి ప్రభుత్వం వస్తే తమ కష్టాలు తీరుతాయని ఉద్యోగులంతా భావించారని, కానీ కష్టాలు పెరిగిపోయాయని చెప్పారు. 2023లో గత ప్రభుత్వం పీఆర్సీ కమిషన్‌ను నియమించిందని, ఈ ప్రభుత్వం రాగానే కమిషనర్‌ రాజీనామా చేశారని ఆయన గుర్తు చేశారు. 

డిమాండ్ల సాధన కోసం ఇతర జేఏసీలతో కూడా కలిసి ఉమ్మడిగా ఉద్యమించడానికి సమాలోచనలు చేస్తున్నట్లు బొప్ప­రాజు తెలిపారు. సిక్కోలు మహాసభ అనంతరం ప్రతి జిల్లాలోనూ ‘ఉద్యోగ మహా సభ’ నిర్వహిస్తా­మని స్పష్టం చేశారు. అప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణ ప్రకటి­స్తామని హెచ్చరించారు. ఆర్టీసీలో కొత్తగా ప్రవేశ పెడుతున్న విద్యుత్‌ బస్సులను ప్రభుత్వమే నిర్వ­హించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఫణి పేర్రాజు, అమరావతి జేఏసీ మహిళా విభాగం రాష్ట్ర అధ్య­క్షురాలు లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హెల్త్‌ కార్డులకు అనారోగ్యం వచ్చిందన్నారు. 

కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి, మున్సిపల్‌ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలరాజు, మున్సిపల్‌ టీచర్స్‌ రాష్ట్ర ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి రవి సిద్ధార్థ, డిజేబుల్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, జీవీఎంసీ స్టాఫ్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ అధ్యక్షుడు వామన రావు, ఏపీ జేఏసీ అమరావతి విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయ­నగరం, పార్వతీపురం మన్యం జిల్లాల చైర్మన్లు, జనరల్‌ సెక్రటరీలు, మహిళా విభాగం ప్రతిని­ధులు, జిల్లా రెవెన్యూ సంఘం కార్యవర్గ సభ్యులు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement