కోనసీమలో ‘నల్ల బంగారం’

Preparation of coconut shell charcoal in drums on banks of the river - Sakshi

నదీతీరంలో డ్రమ్ముల్లో కొబ్బరి చిప్ప బొగ్గు తయారీ

సౌందర్య పోషణ, దేశ రక్షణకు సంబంధించిన విడి భాగాల తయారీలో వినియోగం

తమిళనాడు, కేరళ, కర్ణాటక కన్నా మేలైన బొగ్గు ఉత్పత్తి

చిన్నతరహా పరిశ్రమలుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు

సాక్షి అమలాపురం: కోనసీమలో తయారయ్యే ‘కొబ్బరి చిప్ప బొగ్గు’ దేశంలోనే ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ముఖ సౌందర్యానికి ఫేస్‌ప్యాక్‌గా, తాగునీటిని శుద్ధిచేసేందుకు వినియోగించడంతో పాటు పెట్రోలియం ఉత్పత్తులు, దేశ రక్షణకు చెందిన విడి భాగాలు, ఆటో మొబైల్‌ పరిశ్రమలలో కీలక విడిభాగాల తయారీలో ఈ బొగ్గు అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. తయారీదారుల ఇంట నల్ల బంగారమై మెరుస్తోంది. ఇటువంటి అత్యుత్తమమైన, నాణ్యమైన కొబ్బరి చిప్ప బొగ్గు తయారీకి కేరాఫ్‌ అడ్రస్‌గా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా నిలుస్తోంది.   

నదీతీరంలో బొగ్గు తయారీ..  
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం, అంబాజీపేట మండలాల్లో వైనతేయ నదీతీరంలో బొగ్గు తయారవుతోంది. ఇక్కడ నుంచి  ఏడా­దికి రూ. 2 కోట్ల విలువ చేసే 700 నుంచి 900 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తున్నారు. తమిళనాడు లోని కాంగాయం, పల్లడం, కోయింబత్తూరు, కర్ణాటకలోని బెంగళూరు, తెలంగాణలోని హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాలకు, మన రాష్ట్రంలోని నెల్లూ రు, గూడూరు వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.  

ప్రయోజనాలెన్నో..
కొబ్బరి చిప్ప బొగ్గు ప్రయోజనాలు తెలిస్తే నిజంగా నల్ల బంగారమే అంటారు. సౌందర్య పోషణకు వాడే ఫేస్‌ప్యాక్‌లతోపాటు కాస్మోటిక్స్, సబ్బులలో వాడకం అధికం. ఆటోమొబైల్‌లో కీలకమైన స్పేర్‌ పార్టుల తయారీ, రక్షణ రంగంలో యుద్ధ పరికరా లు, గ్యాస్‌ మాస్కుల తయారీలో వినియోగిస్తారు. పెట్రోలియం, గ్యాస్‌ ఉత్పత్తిలో అధిక శాతం రికవరీకి ఇది దోహదపడుతుంది. నీటిలోని క్లోరిన్, పురుగు మందులు, మలినాలను, వైరస్, బ్యాక్టీరియాలను నివారిస్తుంది. దీనిలో అధిక ఉష్ణ విలువ ఉంటుంది. మండించడానికి సమర్థవంతమైన ఇంధన వనరు గా ఉపయోగపడుతుంది. చిప్ప బొగ్గుతో భూమిలో వేగంగా సేంద్రియ కర్భనం ఉత్పత్తి అవుతుంది.  

బాగా ఆరిన కొబ్బరి చిప్ప బొగ్గు అత్యధిక ధర కేజీ రూ.35 నుంచి రూ.38 వరకు ఉండగా, ఈ ఏడాది ఆశించిన ఎగుమతులు లేకపోవడంతో ధర తగ్గిపోయింది. ప్రస్తుతం కేజీ రూ.24 నుంచి రూ.26 కాగా, తడిసిన బొగ్గు ధర రూ.19 వరకు మాత్రమే ఉంది. దీనివల్ల నష్టపోతున్నామని, ఎగుమతులు  లేక సరుకు పెద్ద ఎత్తున పేరుకుపోయిందని, అక్టోబర్‌ నుంచి మంచి ధర వస్తుందని తయారీదారులు ఆశలు పెట్టుకున్నారు.

పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రోత్సాహం
వన్‌ డిస్ట్రిక్ట్‌.. వన్‌ ప్రొడెక్టులో భాగంగా కోనసీమ జిల్లాను కొబ్బరికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ చిప్ప బొగ్గు తయారీ పరిశ్రమలను ప్రోత్సహించాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. కోకోనట్‌ బోర్డు, ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రూ.25 లక్షల విలువైన యూనిట్‌కు 35 శాతం వరకు రాయి తీ అందించనుంది. అంతకన్నా పెద్ద ప్రాజెక్టు పెట్టుకుంటే రూ.పది లక్షల వరకు రాయితీ ఇవ్వనున్నా రు. జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోపరేషన్‌ ఏజెన్సీ (జైకా) ఆధ్వర్యంలో రూ.3 కోట్లతో జిల్లాలో కోకోనట్‌ మిల్క్‌ యూనిట్‌తోపాటు కోకోనట్‌ చార్‌ కోల్‌ పరిశ్రమ ఏర్పాటుకు ఉద్యానశాఖ సన్నాహాలు చేస్తోంది.    

మన్నిక ఎక్కువ..
దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటక కన్నా ఇక్కడ ఉత్పత్తి అవుతున్న బొగ్గు నాణ్యమైంది. చిప్ప దళసరి కావడంతోపాటు దీనిలో అధిక శాతం గ్యాస్‌ నిక్షిప్తమైనందున ఇది వేగంగా మండుతోంది. మిగిలిన రాష్ట్రాలలో ఆరు బయట బొగ్గు తయారీ ఎక్కువ. కోనసీమలో బొగ్గు తయారీ డ్రమ్ములలో చేస్తారు. దీనివల్ల బూడిద శాతం తక్కువగా ఉంటోంది. ఇక్కడ తయారయ్యే బొగ్గు ఎక్కువ కాలం మన్నిక ఉండడంతోపాటు ధృడంగా ఉంటుంది.

మార్కెట్‌ అవకాశాలు పెరగాలి
మనం తయారు చేసే బొగ్గే అత్యంత నాణ్యమైంది. మార్కెటింగ్‌ అవకాశాలు పెద్దగా లేక అనుకున్న ధర రావడం లేదు. ఇతర ప్రాంతాల వారు ఇక్కడ నుంచి బొగ్గు  తీసుకెళ్లి మరింత నాణ్యంగా తయారు చేసి కేజీ రూ.50 నుంచి రూ.70 చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. మనకు మాత్రం ఆ ధర రావడం లేదు. మార్కెటింగ్‌ అవకాశాలు పెరిగితే మరింత ధర వచ్చే అవకాశముంది.– మట్టపర్తి రామకృష్ణ,ముంజువరం, పి.గన్నవరం మండలం  
అత్యంత ధృడమైంది
ఇక్కడ తయారయ్యే కొబ్బరి చిప్పలో 80 నుంచి 90 శాతం మేర చిన్న చిన్న రంధ్రాలు ఉండడంతో ఎక్కువ కాలం మన్నిక ఉండడంతోపాటు ధృడంగా ఉంటోంది. ఆటోమొబైల్, రక్షణ పరికరాలు, పెట్రోలియం ఉత్పత్తుల తయారీలో అధికంగా వాడుతున్నారు. – ఎ.కిరిటీ, ఉద్యాన శాస్త్రవేత్త, డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top