ఆమె కథలో వ్యథలెన్నో..!

Pregnant Woman Is Requesting Donors To Help - Sakshi

చావు బతుకుల్లో నర్స్‌

పాడైన కిడ్నీలు, లివర్‌

దాతలు ఆదుకోవాలని గర్భిణి వినతి 

డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణ): ఆమె ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్స్‌.  ఎందరో రోగులకు సేవ చేసి ప్రాణాలు నిలిపిన ఆమె ఇప్పుడు అనారోగ్యంపాౖలై మంచం పట్టింది. రెండు కిడ్నీలు ఫెయిలయ్యాయి. లివర్‌ పాడైంది. వైద్యానికి డబ్బులు లేక దాతలే తనను బతికించాలంటూ దీనంగా వేడుకుంటోంది. తనలాంటి కష్టం ఎవరికీ రాకూడదంటూ బోరున విలపిస్తోంది.  కష్టాలు వెంటాడుతున్న ఓ గర్భిణి కథ ఇది.. దాతలు, ప్రభుత్వం ఆదుకుంటే గానీ తీరని వ్యథ ఇది...

కంచరపాలెంలో నివాసముంటున్న బి.రాణి నర్సింగ్‌ విద్యనభ్యసించింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్స్‌గా చేరింది. ఎనిమిదేళ్ల క్రితం ప్రకాష్‌ అనే వ్యక్తిని వివాహమాడింది. భర్త రోజువారి కూలి. వీరికి ఒక కుమారుడు జన్మించాడు. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించుకున్నా ఫెయిల్‌ కావడంతో మళ్లీ గర్భం దాలి్చంది. ప్రస్తుతం రాణి ఆరు నెలల గర్భిణి. ఇటీవల తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకుంది. రెండు కిడ్నీలు ఫెయిలయ్యాయని, లివర్‌ పాడైందని వైద్యులు నిర్థారించారు. దీంతో కేజీహెచ్‌లో చేరేందుకు వెళితే అక్కడ ఎవరూ జాయిన్‌ చేసుకోలేదు. కేజీహెచ్‌ గైనకాలజీ విభాగం ముందున్న చెట్టు వద్దనే రోజంతా కూర్చుంది. విషయం తెలుసుకున్న తోటి నర్సింగ్‌ ఉద్యోగులు తలోకొంత వేసుకుని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.

ఆ డబ్బులతో వైద్యం సాధ్యం కాదని  ఆ ఆస్పత్రి వైద్యులు చెప్పడంతో.. రాణి పుస్తెలు తాకట్టు పెట్టి కొంత నగదు, అలాగే మరో కొంతమంది స్నేహితులు కలిసి కొంత నగదు సేకరించి ఆస్పత్రికి కట్టారు. అలా చెల్లించిన డబ్బులు కేవలం రెండు రోజుల వైద్యానికే సరిపోయాయి. ఇప్పుడు కథ మళ్లీ మొదటికి వచ్చింది. చేతిలో చిల్లి గవ్వ లేదు. వైద్యానికి లక్షల్లో ఖర్చు అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదని రాణి కన్నీటిపర్యంతమవుతోంది. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటోంది. తన కడుపులో పెరుగుతున్న పసికందు భవిష్యత్తు ఏమిటోనని ఆందోళన చెందుతోంది. దాతలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. సహాయం చేసే దాతలు ఆంధ్రాబ్యాంకు, అకౌంట్‌ నంబరు 179610100043093, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ANDB0001796కు జమ చేయాలని విజ్ఞప్తి చేసింది. లేదా 93982 94998, 63095 41731 నంబర్లకు ఫోన్‌ చేసి ఆర్థిక సాయం చేయాలని రాణి వేడుకుంటోంది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top