అల్లూరి సీతారామరాజు జిల్లా : సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో పురిటి నొప్పులు వచ్చిన ఓ గర్భిణిని డోలీలో ఆస్పత్రికి తరలిస్తుండగా అడవిలోనే ప్రసవించింది. మండలంలో పెదలోచలి పంచాయతీ మారుమూల ఇందుగుల గ్రామానికి రోడ్డు సదుపాయం లేదు. గ్రామానికి చెందిన సీదరి దేవికి సోమవారం సాయంత్రం పురిటి నొప్పులు వచ్చాయి. గ్రామానికి అంబులెన్స్ వచ్చే అవకాశం లేదు. గ్రామం నుంచి తారు రోడ్డు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది.
పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను కొంత దూరం మండుటెండలో గొడుగు నీడలో నడిపించి, మరికొంత దూరం డోలీలో మోస్తూ కొండలు, గుట్టలు, గెడ్డలను అష్టకష్టాలు పడి దాటిస్తూ రోడ్డుకు తీసుకెళుతుండగా మార్గమధ్యలో అడవిలో నొప్పులు ఎక్కువై మగశిశువుకు జన్మనిచ్చింది. అక్కడి నుంచి 108 వాహనానికి దేవి భర్త రంగారావు సమాచారం అందించారు. దీంతో ఈదులగరువు గ్రామం వద్ద ఉన్న రోడ్డు వరకూ బాలింతను, శిశువును తీసుకొచ్చి అంబులెన్స్‌లో జి.మాడుగుల పీహెచ్‌సీకి తరలించారు. బాలింతకు, శిశువుకు వైద్యసేవలందించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.


