
పసుపు సాగులో స్థానిక రకానికి ప్రాధాన్యం
ఆధునిక వంగడాలపై కానరాని ఆసక్తి
ఏటా పంట దిగుబడిలో కొంతమేర విత్తనానికి కేటాయింపు
సొంతంగా సమకూర్చుకుంటున్న గిరి రైతులు
అప్రమత్తంగా లేకుంటే తెగుళ్లతో నష్టమంటున్న శాస్త్రవేత్తలు
పసుపు సాగులో ఏజెన్సీ వాతావరణానికి అనువైన ఆధునిక వంగడాలు అందుబాటులో ఉన్నప్పటికీ గిరి రైతులు దేశవాళీ రకం వైపే మొగ్గు చూపుతున్నారు. అధిక దిగుబడినిచ్చే రోమా రకాన్ని శాస్త్రవేత్తలు పరిచయం చేసినా ఆసక్తి చూపడం లేదు. మెట్ట, పోడు భూముల్లో దేశవాళీ రకం సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
చింతపల్లి: అల్లూరి జిల్లా ఏజెన్సీలో గిరి రైతులకు ప్రధాన ఆదాయ వనరుల్లో కాఫీ మాదిరిగానే పసుపు సాగు కీలకం. ఏటా సాగు చేస్తున్న పంటలో కొంతమేర పసుపు దుంపను భద్రపరిచి విత్తనంగా వినియోగించడం ఆనవాయితీగా వస్తోంది. దీనివల్ల విత్తన ఖర్చు తగ్గుతోందని గిరి రైతులు చెబుతున్నారు.
» పాడేరు డివిజన్ పరిధిలో సుమారు 24 వేల హెక్టార్లలో పసుపు పంటను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు పైరుకు అనుకూలంగా ఉన్నప్పటికీ తెగుళ్ల సోకే అవకాశం కూడా లేకపోలేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని ఉద్యానవన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో సాగు చేపట్టారు. పైరు ఎదుగదల బాగానే ఉంది. అయితే ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి.
» దేశవాళీ రకాలను కూడా ఏడాది పంటగా సాగు చేయడం వల్ల మంచి దిగుబడులు ఆదాయం పొందవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అలాకాకుండా రెండేళ్ల పంటగా సాగు చేయడం వల్ల రెండో ఏడాది గణనీయంగా దిగుబడులు తగ్గిపోతున్నాయి.
పెరుగుతున్న తేమశాతంతో నష్టం
వర్షాలు కురుస్తున్నందున గాలిలో తేమశాతం ఎక్కువగా ఉంటోంది. ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆకుమచ్చ, తాటాకు తెగులు సోకే ప్రమాదం ఉందని ఉద్యానవన శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సకాలంలో నివారణ చర్యలు చేపట్టకుంటే దిగుబడి నష్టపోయే పరిస్థితులు ఉంటాయని వారు హెచ్చరిస్తున్నారు.
‘రోమా’ అనుకూలమైనా..
ఏజెన్సీలో పసుపు సాగుకు ‘రోమా’ రకం అత్యంత అనుకూలమని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆదివాసీలు దేశవాళీ రకం పసుపును రెండేళ్ల పంటగా సాగుచేస్తున్నారు. అయితే రోమా రకం పసుపు కేవలం పది నెలల్లో ఎకరానికి దేశవాళీ రకం కన్నా ఎక్కువ దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ రకం పసుపులో కుర్కుమిన్ అధికంగా ఉన్నందున అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని గతంలో రైతులకు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ఎస్టీ ఉప ప్రణాళిక నిధులతో 250 మంది రైతులకు 20 కిలోల చొప్పున పంపిణీ చేశారు. రైతు స్థాయిలో విత్తనం ఉత్పత్తి చేసుకునేలా సహకారం అందించినా ఆశించిన ఫలితాలు రాలేదు. దేశవాళీ రకం కన్నా ఈ రకం పైరులో 25 నుంచి 35 శాతం దిగుబడి ఎక్కువగా ఉంటున్నా ఈ రకం సాగుపై ఆసక్తి కనబరచడం లేదు.
మచ్చ తెగుళ్ల లక్షణాలివీ..
» మొక్కల ఆకులపై చిన్న చిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడి అవి క్రమేపీ గోధుమ రంగులోకి మారి ఎండిపోతాయి. ఈ తెగులు కింద ఆకుల నుంచి పైకి వ్యాప్తి చెందుతుంది. దీనికి ఆకుమచ్చ తెగులుగా గుర్తించి వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. నవంబర్– డిసెంబర్ నెలలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీని విషయంలో రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.
» ఆకులపై అండాకారంలో పెద్ద మచ్చలు కనిపిస్తే తాటాకు మచ్చ తెగులుగా గుర్తించాలి. ఇవి ముదురు గోధుమ వర్ణంలో ఉంటాయి. ఆకు కాడపై మచ్చలు ఏర్పడటంతో ఆకు కిందకు వాలిపోతుంది. ఈదురు గాలులతో కూడిన వర్షాలు, గాలిలో తక్కువ తేమ, ఉష్ణోగ్రతలు ఈ తెగులు వ్యాప్తికి దోహదపడతాయి. సెపె్టంబర్ నుంచి ఈ తెగులు ప్రభావం పైరుపై కనిపిస్తుందని శాసŠత్రవేత్తలు సూచిస్తున్నారు.
అప్రమత్తత అవసరం
దేశవాళీ రకం పసుపు పైరుపై మచ్చలు కనిపించిన వెంటనే రైతులు అప్రమత్తం కావాలి. ప్రారంభంలోనే సస్యరక్షణ చేపడితే వ్యాప్తిని వెంటనే నివారించవచ్చు. ఒక శాతం బోర్డో మిశ్రమం/ ఒక లీటరు నీటికి ఒక మిల్లీలీటర్ ప్రోపికోనజోల్ లేదా 2.5 గ్రాముల మాంకోజెబ్‌కు 0.5 ఎంఎల్ సబ్బునీరు కలిపి 15 రోజుల వ్యవధిలో సెపె్టంబరు నుంచి 3 నుంచి 4 సార్లు పిచికారి చేయాలి. పైరు విత్తుకునే సమయంలో జాగ్రత్తలు పాటించడం వల్ల కూడా నివారించవచ్చు. ఆరోగ్యకరమైన విత్తనాన్ని ఎంచుకుని విత్తనశుద్ధి చేయడం వల్ల తెగుళ్లను నివారించవచ్చు. – శెట్టి బిందు, ప్రధాన శాస్త్రవేత్త, ఉద్యానవన పరిశోధన స్థానం, చింతపల్లి