రొయ్యల కొనుగోళ్లు: కోతేస్తే.. కొరడా

Prawns Price: Continuous Review Of International And Local Prices - Sakshi

ప్రభుత్వం చెప్పినా ధరలు తగ్గించి రొయ్యల కొనుగోళ్లు

ఆదేశాలు ధిక్కరిస్తున్న వ్యాపారులు, ప్రాసెసింగ్‌ యూనిట్లు

ఆక్వా రైతులకు బాసటగా ప్రభుత్వం

నిరంతరం ప్రత్యేక పోర్టల్‌ ద్వారా అంతర్జాతీయ, స్థానిక ధరలపై సమీక్ష

జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమైన రైతులు

ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుచుకుంటామంటూ తీర్మానం

అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకుల కారణంగా ఆక్వా ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. ధరల పతనంతో రొయ్య రైతులు దిగాలు పడ్డారు. ఈ సమయంలో ప్రభుత్వం అండగా నిలబడింది. గిట్టుబాటు ధర కల్పించేందుకు ముందుకొచ్చింది. ధరల స్థిరీకరణకు ఆక్వా సాధికారత కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేయని ప్రాసెసింగ్‌ కంపెనీలపై కొరడా ఝులిపించేందుకు రంగం సిద్ధం చేసింది. మరో వైపు ఆక్వా రైతులు, ప్రాసెసింగ్‌ యూనిట్ల యజమానులు, సీడ్, ఫీడ్‌ తయారీదారులు సమన్వయంతో ముందుకు సాగేలా చర్యలు చేపట్టింది. ఎప్పుటికప్పుడు ధరలను సమీక్షిస్తూనే రైతుల కోసం జిల్లా మత్స్యశాఖ అధికారులు హెల్ప్‌లైన్‌ నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. 

 హెల్ప్‌లైన్‌ నంబర్లు : 9392905878, 9392905879

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దాదాపు 16 వేల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. ప్రధానంగా రొయ్యల సాగు చేపడుతున్నారు. రొయ్యల సాగును మూడు విడతల్లో చేపడతారు. ప్రధాన రెండు సీజన్లలో అధిక సంఖ్యలో రైతులు అధిక మొత్తంలో దిగుబడి సాధిస్తారు. ఒక్కో సీజన్‌లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దాదాపు 30 వేల టన్నుల రొయ్యల దిగుబడి వస్తోంది. ఈ మొత్తాన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఆక్వా ప్రాసెసింగ్‌ ప్లాంట్లు కొనుగోలు చేయాల్సిందే.

జిల్లాలో ఉన్న ఆక్వా ప్రాసెసింగ్‌ ప్లాంట్లు దేవీ సీ ఫుడ్స్, జీవీఆర్‌ ఆక్వా, మున్నంగి ఆక్వా, సదరన్‌ ఆక్వా, కళ్యాణి ఆక్వా, నీలా ఆక్వా, క్రిస్టల్‌ ఆక్వా, రాయల్‌ ఆక్వా, ఆక్వా టీకాలు కొనుగోలు చేయాలి. ఇదిలా ఉండగా అంతర్జాతీయంగా ఏర్పడిన సంక్షోభంతో రొయ్యల ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. దీనిని సాకుగా చూపి వ్యాపారులు రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఆక్వా వ్యాపారులు, ప్రాసెసింగ్‌ ప్లాంట్ల నిర్వాహకులు, ఎగుమతిదారులు కుమ్మక్కై కూడబలుక్కుని రొయ్యలు సాగు చేస్తున్న రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. దీంతో నీలివిప్లవానికి పెట్టింది పేరైన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రొయ్యల రైతులు విలవిల్లాడిపోతున్నారు. ఈ దశలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. గత నెల 17వ తేదీ విజయవాడలో అధికారులు, మంత్రులు కలిసి రొయ్యల రైతులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. వ్యాపారులకు దిశానిర్దేశం చేశారు. అయినా వారిలో మార్పురాలేదు.  

రైతుల పక్షాన ప్రభుత్వం... 
ప్రభుత్వం ఆక్వా రైతుల పక్షాన నిలిచింది. వ్యాపారులు, ఎగుమతిదారులతో మంత్రుల సబ్‌ కమిటీ సంప్రదింపులు జరిపింది. ప్రస్తుతం ఎగుమతులు లేవని, అందుకోసం తగ్గించి కొనుగోలు చేయాల్సి వస్తుందని వ్యాపారులు, ఎగుమతిదారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కూడిన మంత్రుల సబ్‌ కమిటీ సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లింది. రొయ్యలు పచ్చి సరుకు కాబట్టి ప్రభుత్వమే ఒక మెట్టు దిగి గతంలో నిర్ణయించిన ధరను కొంచెం తగ్గించి కొనుగోలు చేయాలని నిర్ణయించింది.  

ధరలు సవరించిన ప్రభుత్వం... 
వ్యాపారులు, ఎగుమతిదారులు అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తక్కువగా ఉన్నాయనడంతో ప్రభుత్వం ఆక్వా రైతులతో చర్చించిన మీదట ధరల్లో కొంత మార్పు చేసింది. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని ముందు నిర్ణయించిన ధరలను కొంచెం తగ్గించి కొనుగోలు చేయాలని నూతన ధరలను ప్రకటించింది. ఆ ధరలకు కొనుగోలు చేస్తున్నామంటూనే నూతనంగా నిర్ణయించిన ధరలను కూడా పెడచెవిన పెట్టి మరీ తక్కువకు కొనుగోలు చేయడం ప్రారంభించారు. బుధవారం మరోసారి రాష్ట్ర మంత్రులు సాధికారిత కమిటీతో సమావేశమయ్యారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఎప్పటికప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు స్థానిక మార్కెట్‌లో ధరలను సమీక్షించేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రేట్లకు కొనుగోలు చేయకపోతే రైతులు తమ దృష్టికి తీసుకురావాలని సూచిస్తున్నారు. ఈ విషయంపై రైతులకు ఆవగాహన కల్పిస్తున్నారు. ఇందుకు సంబంధించి హెల్ప్‌లైన్‌ నంబర్లు కూడా అందుబాటులో ఉంచారు.

ఇక్కడ పండించిన పంట ఉత్పత్తులను ఇదే ప్రాంతంలో విక్రయించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాల వారీగా ఆక్వా రైతు కమిటీలు గురువారం జూమ్‌ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుచుకునేలా తీర్మానం చేసుకున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంది 
రాష్ట్ర ప్రభుత్వం రొయ్యల రైతులకు అండగా ఉంది. అందుకే అటు వ్యాపారులతో, ఇటు రైతులతో విరామం లేకుండా చర్చలు జరుపుతోంది. అయినా రొయ్యల ధరల విషయంలో వ్యాపారుల్లో మార్పు లేదు. ప్రభుత్వం స్పష్టంగా చెప్పినా రొయ్యల ప్రాసెసింగ్‌ ప్లాంట్ల యజమానులు, వ్యాపారులు రైతులను నిలువునా నష్టపరుస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధరల కంటే తక్కువకు కొనుగోలు చేయడం ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.  
– దుగ్గినేని గోపీనా«థ్, రొయ్యల రైతు సంఘ నాయకుడు 

వ్యాపారులు, ఎగుమతిదారులు తీరు మార్చుకోవాలి 
రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా సాగుకు పూర్తి భరోసానిస్తోంది. కరోనా సమయంలోనూ రైతులకు ఇబ్బంది లేకుండా వ్యాపారులతో రొయ్యలు కొనుగోలు చేయించింది. 10 ఎకరాల్లోపు సాగు చేసే రైతులకు విద్యుత్‌ చార్జీ యూనిట్‌కు కేవలం రూ.1.50గా నిర్ణయించింది. ఇటీవల రొయ్య మేత ధరలను టన్ను రూ.2,600కు తగ్గించింది. ప్రస్తుతం ఆక్వా వ్యాపారులు ధరలు తగ్గించేందుకు ప్రయత్నిస్తే ప్రభుత్వం 100 కౌంట్‌ రూ.210గా నిర్ణయించి వ్యాపారులచే కొనుగోలు చేయిస్తోంది. 
 – మాలె రంగారెడ్డి, ఆక్వా రైతు, మూలగుంటపాడు 

ఇతర దేశాల్లో తక్కువ ధరకు రొయ్యల ఎగుమతి 
ఇతర దేశాల్లో తక్కువ ధరకు రొయ్యలు ఎగుమతి చేయడం వలన మన దేశం రొయ్యల ధర దిగజారింది. యూరప్‌ కంట్రీస్‌లో ఉన్న ఈక్విల్యాండ్‌ దేశంలో రొయ్యలు 100 కౌంట్‌ రూ.140కు విక్రయిస్తున్నారు. అక్కడ ఏడాది క్రితం రొయ్యల కల్చర్‌ మొదలుపెట్టారు. ఎకరానికి 5 టన్నులకు తగ్గకుండా తీస్తారు. మన దేశంలో 2 టన్నుల్లోపే వస్తుంది. వారికి ఎగుమతి ఖర్చులు, రొయ్యల యూనిట్లు దగ్గర ఉండటం వలన చార్జీలు తక్కువ. అందుకే తక్కువ ధరకు ఇస్తారు. మనదేశంలో రొయ్యల రైతులకు 100 కౌంట్‌ ధర రూ.250కు తగ్గకుండా ఇస్తేనే గిట్టుబాటవుతుంది. 
– గాదె కోటిరెడ్డి, రొయ్యల రైతు, గాదెపాలెం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top